జోరుమీద బెంగళూరు.. పంజాబ్‌ పడగొట్టేనా?

తాజా వార్తలు

Updated : 30/04/2021 17:31 IST

జోరుమీద బెంగళూరు.. పంజాబ్‌ పడగొట్టేనా?

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు అదరగొడుతోంది. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింట గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. అదే ఉత్సాహంతో పంజాబ్‌ కింగ్స్‌తో తలపడబోతోంది. అహ్మదాబాద్‌ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌ జరగనుంది. మరి కోహ్లీ సేన దూకుడుకు రాహుల్‌ కళ్లెం వేస్తాడా? పంజాబ్‌కు మూడో విజయం దక్కుతుందా? 

ఆరంభం నుంచే అదరగొడుతూ..

గత సీజన్‌తో పోలిస్తే ఈ ఏడాది కోహ్లీ సేన పూర్తి భిన్నంగా కన్పిస్తోంది. ఇప్పటి వరకు ఒక్క చెన్నై మినహా మిగతా అన్ని జట్లపై గెలిచి జోరు కొనసాగిస్తోంది. బ్యాటింగ్‌లో కోహ్లీతో పాటు మ్యాక్స్‌వెల్‌, డివిలియర్స్‌ అద్భుతంగా రాణిస్తున్నారు. దేవదత్‌ పడిక్కల్‌ కూడా మళ్లీ గతేడాది మెరుపులకు ప్రయత్నిస్తున్నాడు. ఇక బౌలింగ్‌ పరంగా మహ్మద్‌ సిరాజ్‌తో పాటు హర్షల్‌ పటేల్‌ ఔరా అనిపిస్తున్నాడు. చాహల్‌ ప్రదర్శన ఆశించినంత మేర లేకపోయినప్పటికీ అతడి అనుభవం పనికొస్తోంది. 

కష్టపడుతోన్న పంజాబ్‌

మరోవైపు పంజాబ్‌ జట్టు వరుస ఓటములతో సతమతమవుతోంది. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లాడిన ఈ జట్టు రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, క్రిస్‌ గేల్‌ రాణిస్తున్నా.. మిగతా బ్యాట్స్‌మెన్‌ ఎవరూ వీరికి అండగా నిలవడం లేదు. ముఖ్యంగా మిడిలార్డర్‌ సమస్య వెంటాడుతూనే ఉంది. బౌలర్ల ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది. ఈ సీజన్‌లో రాహుల్‌ మూడు అర్థశతకాలు నమోదు చేసినప్పటికీ అతడి స్ట్రయిక్‌ రేట్‌ 129 మాత్రమే. అయితే, బెంగళూరుపై పంజాబ్‌కు మంచి రికార్డే ఉంది. గతేడాది రెండు సార్లూ కోహ్లీ సేనను ఓడించింది. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 26 సార్లు తలపడగా.. 14 విజయాలతో పంజాబ్‌ ఆధిక్యంలో ఉంది. ఈసారి కూడా గత వ్యూహాలను అమలు చేస్తే కోహ్లీ సేనను ఓడించే అవకాశం ఉంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని