IPL 2021: రాజస్థాన్‌పై బెంగళూరు ఘన విజయం 

తాజా వార్తలు

Updated : 29/09/2021 23:42 IST

IPL 2021: రాజస్థాన్‌పై బెంగళూరు ఘన విజయం 

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రాజస్థాన్‌ నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని కోహ్లీసేన 17.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. బెంగళూరు జట్టులో మాక్స్‌వెల్‌(50 నాటౌట్‌) అర్ధసెంచరీతో చెలరేగగా, శ్రీకర్‌ భరత్‌(44), కోహ్లీ(25) రాణించారు. క్రిస్ మోరిస్‌ వేసిన 17వ ఓవర్లో మాక్స్‌వెల్ చెలరేగిపోయాడు. ఓ సిక్స్‌, మూడు ఫోర్లు సహా 22 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలోనే మాక్స్‌వెల్‌ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అప్పటికీ జట్టు స్కోరు 149/3. రియాన్ పరాగ్ వేసిన తర్వాాతి ఓవర్లో బౌండరీ బాదిన డివిలియర్స్‌ (4) బెంగళూరు జట్టుకు విజయాన్నందించాడు. రాజస్థాన్‌ బౌలర్లలో ముస్తాఫిజుర్ రహ్మాన్‌ రెండు వికెట్లు తీశాడు. 

అంతకు ముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. రాజస్థాన్‌ ఓపెనర్లు ఎవిన్‌ లూయిస్‌ (58; 37 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), యశస్వీ జైస్వాల్‌ (31; 22 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) శుభారంభం చేశారు. దూకుడుగా ఆడుతూ తొలి వికెట్‌కు 77 పరుగులు జోడించారు. ఈ క్రమంలో డేనియల్‌ క్రిస్టియన్‌ వేసిన 8.2 బంతికి జైస్వాల్‌.. సిరాజ్‌కి క్యాచ్‌ ఇచ్చి ఔట్‌ అయ్యాడు. తర్వాత, జార్జ్‌ గార్టన్‌ వేసిన 12వ ఓవర్‌లో ఎవిన్‌ లూయిస్‌.. కీపర్‌కి చిక్కాడు. ఆ తర్వాత వచ్చిన సంజూ శాంసన్‌ (19) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. షాబాజ్‌ అహ్మద్‌ వేసిన 13వ ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించి దేవ్‌దత్ పడిక్కల్‌కి చిక్కాడు. అదే ఓవర్ చివరి బంతికి మహిపాల్ లోమ్రోర్ (3) కూడా వెనుదిరిగాడు. దీంతో ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన రాజస్థాన్‌ జట్టు.. ఆ తర్వాత పుంజుకోలేకపోయింది. రాహుల్‌ తెవాటియా (2), లివింగ్‌ స్టోన్‌ (6), రియాన్‌ పరాగ్‌ (9), మోరిస్‌ (14) వెంట వెంటనే ఔటయ్యారు. బెంగళూరు బౌలర్లలో హర్షల్‌ పటేల్‌ మూడు, యుజువేంద్ర చాహల్‌, షాబాజ్‌ అహ్మద్‌ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జార్జ్‌ గార్టన్‌, డేనియల్ క్రిస్టియన్‌ ఒక్కో వికెట్‌ తీశారు. చివరి ఓవర్లో బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ మూడు వికెట్లు తీశాడు. రియాన్ పరాగ్‌, క్రిస్ మోరిస్‌ని వరుస బంతుల్లో పెవిలియన్‌కి పంపించాడు. చివరి బంతికి మరో వికెట్‌ తీశాడు. దీంతో ఒకే ఓవర్లో రాజస్థాన్ మూడు వికెట్లు కోల్పోయి మోస్తరు స్కోరుకే పరిమితమైంది. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని