
తాజా వార్తలు
ఆస్పత్రి నుంచి సచిన్ డిశ్చార్జి
ముంబయి: కరోనా నుంచి టీమ్ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ కోలుకున్నారు. ఆస్పత్రి నుంచి ఆయన డిశ్చార్జి అయ్యారు. ఇకపై ఇంట్లోనే ఐసోలేషన్ అవ్వనున్నారు. మార్చి 27న కరోనా పాజిటివ్ రావడంతో మాస్టర్ ఐసోలేషన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. కానీ ముందు జాగ్రత్తగా కొన్ని రోజుల క్రితం ఆస్పత్రిలో చేరారు. అయితే ఆయనకు ఇంకా నెగెటివ్ రాలేదు.
రోడ్‌సేఫ్టీ ప్రపంచ సిరీస్‌లో భాగంగా ఇండియా లెజెండ్స్‌కు సచిన్ నాయకత్వం వహించారు. ఈ మ్యాచులకు అభిమానులను స్టేడియాల్లోకి అనుమతించారు. క్రికెటర్లు నిబంధనలు పాటిస్తూ బయో బుడగలోనే ఉన్నా వైరస్ మాత్రం సోకింది. మొదట సచిన్ తర్వాత యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, బధ్రీనాథ్కు పాజిటివ్ రావడం గమనార్హం.
ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్న సచిన్ వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. ‘వైద్యశాల నుంచి ఇప్పుడే ఇంటికొచ్చా. ఐసోలేషన్‌లో ఉండి విశ్రాంతి తీసుకుంటాను. నా కోసం ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు. ఆస్పత్రిలో నన్ను జాగ్రత్తగా చూసుకున్న వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు. ఏడాది కాలంగా వారు ఇలాంటి కష్టసమయంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు’ అని సచిన్ ట్వీట్ చేశారు.