
తాజా వార్తలు
ఆ ఒక్క అడుగేస్తేనే.. నీ విజయం: సచిన్
ఇంటర్నెట్‌డెస్క్: ప్రతి ఒక్కరూ తమ కలలను సాకారం చేసుకోవాలని క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ సూచించారు. తాజాగా ‘అన్అకాడమీ’ ఆన్లైన్ విద్యాసంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. తాము డ్రెస్సింగ్ రూమ్‌లోకి అడుగుపెట్టిన ప్రతిసారీ.. ఎవరు..?ఎక్కడి నుంచి వచ్చారనే విషయాలు చర్చకు రావని, అందరికీ మైదానం ఒకటేనని అన్నారు. దేశంలో ఏ మూల నుంచి వచ్చావనేది ముఖ్యం కాదని సచిన్ తెలిపారు. ఈ సందర్భంగా తన అనుభవాలను సచిన్ పంచుకున్నాడు.
‘మైదానంలో ఆటగాళ్ల ప్రదర్శన తప్పా మరే విషయాలను క్రీడలు గుర్తుపెట్టుకోవు. జట్టు విజయం కోసం కృషి చేసేందుకు నువ్వో ఆటగాడివి. నేను చదువుకునే రోజుల్లో పలు పాఠశాలలు మారాను. పలువురు కోచ్‌ల వద్ద శిక్షణ పొందాను. దాంతో చాలా విషయాలు నేర్చుకున్నాను. ప్రతి ఒక్కరూ తమ కలలు సాకారం చేసుకొనేందుకు ముందుకు సాగాలి. అవి నిజం అవుతాయి. అయితే, లక్ష్య సాధనలో చాలా మంది మధ్యలోనే ఆగిపోతారు. ఏవైనా ఆటంకాలు ఎదురైతే అక్కడితోనే వెనకడుగు వేస్తారు. అలా కాకుండా ధైర్యంగా ముందడుగు వేస్తే విజయం వరిస్తుంది’ అని సచిన్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా తన తండ్రి రమేశ్ తెందూల్కర్‌ను సచిన్ గుర్తుచేసుకున్నారు. ఆయన కూడా ఒక అధ్యాపకుడని, ముంబయిలో విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి నగరమంతా తిరిగేవారని పేర్కొన్నారు.