Sachin: గుండె లోతుల్లో బాధతోనే..!

తాజా వార్తలు

Updated : 23/05/2021 14:37 IST

Sachin: గుండె లోతుల్లో బాధతోనే..!

తండ్రిని కోల్పోయిన వేళ..

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రికెట్ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ కెరీర్‌లో 100 శతకాలు సాధించినా ఆ సెంచరీ ఒక్కటి ప్రత్యేకం. గుండెలోతుల్లోంచి ఉబికి వస్తున్న దుఃఖాన్ని పంటి బిగువన దాచిపెట్టి సునామీలా విరుచుకుపడ్డాడు. ప్రత్యర్థి బౌలర్లను చిత్తు చేస్తూ ద్రవిడ్‌తో కలిసి దంచికొట్టాడు. ఫలితంగా భారత్‌ ఘన విజయం సాధించింది. అదే 1999 ప్రపంచకప్‌లో కెన్యాతో జరిగిన లీగ్‌ మ్యాచ్‌. అంతకు రెండు రోజుల ముందే సచిన్‌ తండ్రి రమేశ్‌ తెందూల్కర్‌ను కోల్పోవడం బాధాకరం. అలాంటి పరిస్థితుల్లో చెలరేగి ఆడిన తీరు ఇప్పటికీ అభిమానుల కళ్లల్లో కదలాడుతోంది. ఆ మ్యాచ్‌ జరిగి నేటికి 22 ఏళ్లు గడిచిన సందర్భంగా ఆ ప్రత్యేక ఇన్నింగ్స్‌ విశేషాలు మీకోసం..

మాస్టర్‌ ‘బ్లాస్టర్‌’ ఇన్నింగ్స్‌..

ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 329 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్లు సందగొప్పన్‌ రమేశ్‌(44), సౌరభ్‌ గంగూలీ(13) ఔటయ్యాక.. సచిన్‌(140 నాటౌట్‌; 101 బంతుల్లో 16x4, 3x6), రాహుల్‌ ద్రవిడ్‌(104 నాటౌట్‌; 109 బంతుల్లో 10x4) శతకాలతో రెచ్చిపోయారు. ప్రత్యర్థి కెన్యా జట్టుకు మరో అవకాశం ఇవ్వకుండా బౌలర్లపై ఎదురుదాడి చేశారు. ముఖ్యంగా తెందూల్కర్‌ తన కెరీర్‌లోనే అతి గొప్ప ఇన్నింగ్స్‌ ఆడాడు. తండ్రిని కోల్పోయిన బాధలోనూ 16 బౌండరీలు, 3 సిక్సర్లతో సునామీలా విరుచుకుపడ్డాడు.

గెలవక తప్పని పరిస్థితి..

అంతకుముందు ఓపెనింగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో ఓటమిపాలైన టీమ్‌ఇండియా తర్వాతి మ్యాచ్‌లో జింబాబ్వేతో తలపడింది. అయితే, ఆ రోజే సచిన్‌ తండ్రి కన్నుమూశారు. దాంతో వెంటనే ఇంగ్లాండ్‌ నుంచి ఇంటికి తిరిగొచ్చాడు. ఆరోజు జింబాబ్వే చేతిలో భారత్‌ 3 పరుగుల తేడాతో ఓటమిపాలై ఘోర అవమానాన్ని మూటగట్టుకుంది. మరోవైపు అంత్యక్రియల అనంతరం సచిన్‌ మళ్లీ ఇంగ్లాండ్‌కు పయనమయ్యాడు. తర్వాతి మ్యాచ్‌లోనే కెన్యాపై దంచికొట్టాడు. గుండెలోతుల్లో బాధను దిగమింగి ద్రవిడ్‌తో కలిసి గొప్ప ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ క్రమంలోనే కెన్యా ఛేదనలో 50 ఓవర్లకు 235/7కే పరిమితమైంది. దాంతో భారత్‌ 94 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికైన సచిన్‌ ఆ ఇన్నింగ్స్‌ను తన తండ్రికి అంకితమిచ్చాడు. ఆపై టీమ్ఇండియా సూపర్‌ సిక్స్‌ దశకు చేరినా సెమీఫైనల్స్‌కు చేరలేకపోయింది. అయితే, కెన్యాపై సాధించిన ఆ శతకం సచిన్‌ కెరీర్‌లో అతిగొప్ప ఇన్నింగ్స్‌లో ఒకటిగా నిలిచింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని