Tokyo Olympics: ఈ సమయంలో వారికి అండగా ఉండాలి

తాజా వార్తలు

Published : 06/07/2021 19:26 IST

Tokyo Olympics: ఈ సమయంలో వారికి అండగా ఉండాలి

ఒలింపిక్స్‌ అథ్లెట్లకు సచిన్‌ శుభాకాంక్షలు..

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత అథ్లెట్లకు శుభాకాంక్షలు చెప్పాడు. కరోనా వైరస్‌ విపత్కర పరిస్థితుల్లోనూ వారెన్నో సవాళ్లను ఎదుర్కొని నిరంతరం కష్టపడ్డారని కొనియాడాడు. కరోనా కారణంగా ఏడాది పాటు వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్‌ ఈనెల 23 నుంచి తిరిగి ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 100 మందికి పైగా భారత అథ్లెట్లు ఒలింపిక్స్‌ పోటీలకు అర్హత సాధించగా సచిన్‌ వారికి అండగా నిలుస్తూ ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పాడు.

‘ఈ మహమ్మారి సమయంలో మనతో పాటు అథ్లెట్లు కూడా ఎన్నో సవాళ్లు ఎదుర్కొని నిలిచారు. అయినా, వారు నిరుత్సాహ పడకుండా నిరంతరం ఒలింపిక్స్‌ కోసం సన్నద్ధమయ్యారు. టోక్యో ఒలింపిక్స్‌లో వాళ్లంతా అత్యుత్తమ ప్రదర్శన చేయాలని భావిస్తున్నారని నాకు తెలుసు. అయితే, గెలుపోటములనేవి రెప్పపాటులో జరిగిపోతాయి. అందుకోసమే వీరంతా కొన్నేళ్లుగా కఠోర సాధన చేస్తున్నారు. ఇలాంటి సమయంలో వారికి మనమంతా అండగా ఉండాలి. మన నుంచి మద్దతు, శుభాకాంక్షలు కావాలి. ఒలింపిక్స్‌లో భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడాలని పూర్తి మద్దతు తెలుపుదాం’ అని సచిన్‌ పేర్కొన్న ఓ వీడియోను ట్విటర్‌లో అభిమానులతో పంచుకున్నాడు. కాగా, ఈ మెగా ఈవెంట్‌లో భారత్‌ తరఫున హాకీ కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌, దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌ ఆరంభ వేడుకల్లో జెండాను ఎత్తుకొని ప్రాతినిధ్యం వహిస్తుండగా ముగింపు వేడుకల్లో రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పునియా ఆ బాధ్యతలు చేపట్టనున్నాడు.

మరోవైపు టోక్యో ఒలింపిక్స్‌కు భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య సోమవారం 26 మంది సభ్యుల అథ్లెటిక్స్‌ బృందాన్ని ప్రకటించింది. ద్యుతిచంద్‌ (మహిళల 100, 200 మీ), ఎంపీ జబీర్‌ (పురుషుల 400 మీ హర్డిల్స్‌), గుర్‌ప్రీత్‌ సింగ్‌ (పురుషుల 50 కి.మీ నడక), అన్నురాణి (మహిళల జావెలిన్‌)లకు ర్యాంకింగ్స్‌ ద్వారా బెర్తులు దక్కాయి. 4×400 మీటర్ల మిక్స్‌డ్‌ రిలే కోసం ఇద్దరు పురుషులు, ముగ్గురు మహిళల బృందాన్ని ఎంపిక చేశారు.

భారత అథ్లెటిక్స్‌ జట్టు...
పురుషులు: అవినాశ్‌ (3000 మీ స్టీపుల్‌ఛేజ్‌), ఎంపీ జబీర్‌ (400 మీ హర్డిల్స్‌), శ్రీశంకర్‌ (లాంగ్‌జంప్‌), తేజిందర్‌పాల్‌ (షాట్‌పుట్‌), నీరజ్‌ చోప్రా, శివ్‌పాల్‌ సింగ్‌ (జావెలిన్‌ త్రో), ఇర్ఫాన్‌, సందీప్‌, రాహుల్‌ (20 కి.మీ నడక), గుర్‌ప్రీత్‌ సింగ్‌ (50 కి.మీ నడక), 4×400 మీ రిలే: అమోజ్‌ జాకబ్‌, అరోకియా రాజీవ్‌, మహ్మద్‌ అనాస్‌, నాగనాథన్‌, నిర్మల్‌ తోమ్‌; 4×400 మీ మిక్స్‌డ్‌ రిలే: సార్థక్‌ బాంబ్రి, అలెక్స్‌ ఆంథోని.

మహిళలు: ద్యుతిచంద్‌ (100 మీ, 200 మీ), కమల్‌ప్రీత్‌ కౌర్‌, సీమా పునియా (డిస్కస్‌ త్రో), అన్నురాణి (జావెలిన్‌ త్రో), భావ్నా జాట్‌, ప్రియాంక గోస్వామి (20 కి.మీ నడక), 4×400 మీ మిక్స్‌డ్‌ రిలే: రేవతి, శుభ, ధనలక్ష్మి



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని