
తాజా వార్తలు
పాక్ పరువు తీశారు: అక్తర్
ఆ దేశ క్రికెట్ బోర్డుపై మాజీ పేసర్ తీవ్ర ఆగ్రహం..
ఇంటర్నెట్‌డెస్క్: పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై ఆ జట్టు మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. గతనెలలో ప్రారంభమైన పాక్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) ఆరో సీజన్‌ను గురువారం అర్ధాంతరంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీంతో అక్తర్ క్రికెట్ బోర్డుపై విరుచుకుపడ్డాడు. లీగ్ జరుగుతున్న సమయంలో పలువురు ఆటగాళ్లు బయోసెక్యూర్ నిబంధనల్ని ఉల్లంఘించడంతోపాటు కొంతమంది క్రికెటర్లు కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో లీగ్‌ను కొనసాగించడానికి ఆయా ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపకపోవడంతో పీఎస్ఎల్ను వాయిదా వేస్తున్నట్లు ఆ క్రికెట్ బోర్డు ముఖ్య కార్యదర్శి వసీమ్ ఖాన్ గురువారం మీడియాకు చెప్పారు.
ఇదే విషయంపై స్పందించిన షోయబ్ అక్తర్ తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ క్రికెట్ బోర్డుపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. సరైన పర్యవేక్షణ లేకపోవడంతోనే ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారని అన్నాడు. అందుకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. బయోసెక్యూర్ పరిస్థితుల్ని పకడ్బందీగా అమలు చేయాల్సిందన్నాడు.
‘మెడికల్ సిబ్బందిని శిక్షించాలని ఉన్నతాధికారులను కోరుతున్నా. ఎందుకంటే వారు ఆటగాళ్ల జీవితాలతో ఆడుకున్నారు. ఈ ఘటనకు బాధ్యులుగా పీసీబీ సీఈవో వసీమ్‌ఖాన్ పేరును ప్రస్తావిస్తున్నారు. ఆయనను ఎవరు తీసుకొచ్చారు? పీసీబీ ఛైర్మన్ ఎహ్సాన్ మని తెచ్చారు. ఇప్పుడు మని ఎక్కడున్నారు? దీనికి ఆయన సమాధానం ఇవ్వాలి. ఈ విషయంలో ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ జోక్యం చేసుకోవాలి. ఆటగాళ్ల కోసం బుక్ చేసిన హోటల్లో వివాహాలు, ఇతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆటగాళ్లు కూడా నిబంధనల్ని అతిక్రమించి తిరుగుతున్నారు’ అని అక్తర్ మండిపడ్డాడు.
ఇలా జరగడం వల్ల ఆటగాళ్ల జీవితాలను ప్రమాదంలోకి నెట్టడమే కాకుండా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పరువు కూడా పోయిందని మాజీ పేసర్ చెప్పుకొచ్చాడు. ఇందుకు పీసీబీ ఛైర్మన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో పీఎస్ఎల్ను నిర్వహించి ఎహ్సాన్ పాకిస్థాన్ దేశ పరువుతో పాటు ఆ క్రికెట్ బోర్డు పరువు కూడా తీశాడని అక్తర్ ఆవేదన వ్యక్తం చేశాడు.