పాకిస్థాన్‌లో తెలిసిన వాళ్లనే ఎంపిక చేస్తారు
close

తాజా వార్తలు

Published : 16/05/2021 00:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాకిస్థాన్‌లో తెలిసిన వాళ్లనే ఎంపిక చేస్తారు

పీసీబీపై షోయబ్ మాలిక్‌ తీవ్ర వ్యాఖ్యలు

ఇంటర్నెట్‌డెస్క్‌: పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టులో ఆటగాళ్ల ప్రతిభను చూడకుండా.. తమకు ఇష్టమైనవారినే ఎంపిక చేస్తారని ప్రముఖ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. పీసీబీ వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు గుప్పించాడు. ఈ మేరకు అక్కడి క్రీడా జర్నలిస్టు సజ్‌ సాధిక్ వరుస ట్వీట్లు చేశారు.

‘మా వద్ద ఆటగాళ్లను ఇష్టపడటం, ఇష్టపడకపోవడం లాంటి పద్ధతి ఉంది. ఇది ప్రపంచంలోని ఇతర రంగాల్లో ఉన్నా మా క్రికెట్‌లో ఇంకాస్త ఎక్కువ ఉంది. మా క్రికెట్‌ బోర్డులో ఆటగాళ్లను తెలిసిన వ్యక్తులని కాకుండా వారి ప్రతిభ చూసి ఎంపిక చేసిన రోజే ఈ పరిస్థితిలో మార్పు వస్తుంది. ఇటీవల ఎంపిక చేసిన జట్టులో కెప్టెన్‌ బాబర్‌ కావాలనుకున్న ఆటగాళ్లలో చాలా మందికి చోటుదక్కలేదు. సెలెక్షన్‌ ప్రక్రియలో ఇతరుల అభిప్రాయాలకు విలువ ఉన్నా తుది నిర్ణయం తీసుకోవాల్సింది కెప్టెనే. ఎందుకంటే మైదానంలో ఏం కావాలనేది తెలిసేది అతడికే’ అని మాలిక్‌ అన్నాడు.

‘పీఎస్‌ఎల్‌ ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేయాలి. అదో మంచి టోర్నీ. కనీసం రెండు సీజన్లలో ఆయా ఆటగాళ్ల నిలకడను పరిశీలించి ఎంపిక చేయాలి. కేవలం ఒక ఇన్నింగ్స్‌లో బాగా ఆడితే లేదా ఒక స్పెల్‌లో అద్భుత బౌలింగ్‌ చేస్తే ఎంపిక చేయొద్దు. ఈ విషయాన్ని ఇలా బయటకు చెప్పడం వల్ల నా భవిష్యత్‌పై బెంగలేదు. అది ఎవరి చేతుల్లోనూ లేదు. అంతా దేవుడే చూసుకుంటాడు. నన్ను మళ్లీ టీ20 జట్టులో ఆడనివ్వకపోయినా పశ్చాత్తాపం పడను. కానీ తోటి క్రికెటర్ల కోసం ఇప్పుడైనా స్పందించకుంటే అంతకన్నా ఎక్కువ పశ్చాత్తాపం చెందుతా. అలాగే నేను మిస్బాకు వ్యతిరేకం కాదు. అతడో మంచి క్రికెటర్‌. నేను అమితంగా గౌరవిస్తా. అయితే, అతడు జాతీయ జట్టుకు కోచ్‌గా చేయడానికి ముందు దేశవాళీ క్రికెట్‌లో పనిచేయాల్సింది. ఆ తర్వాతే పాక్‌ జట్టుకు రావాల్సింది. నేనెంతో మంది కెప్టెన్లతో కలిసి ఆడాను. వాళ్లంతా తమకు నచ్చిన నిర్ణయాలు ధైర్యంగా తీసుకునేవారు. వసీమ్‌ అక్రమ్‌, వకార్‌ యూనిస్‌, ఇంజమామ్‌ ఉల్‌ హక్‌, షాహిద్‌ అఫ్రిది లాంటి దిగ్గజాలతో ఆడాను. కెప్టెన్‌గా ఉండాలంటే ఇతరులను కాకా పట్టడం పనిచేయదు. అలాంటి వాళ్లెప్పుడూ సంతోషంగా ఉండరు. అలా చేస్తే ఎక్కువ కాలం కూడా కెప్టెన్‌గా కొనసాగరు’ అని మాలిక్‌ చెప్పినట్లు సాధిక్‌ వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని