Ganguly: అంతకన్నా ఇంకేం కావాలి? 
close

తాజా వార్తలు

Published : 25/06/2021 01:19 IST

Ganguly: అంతకన్నా ఇంకేం కావాలి? 

అప్పుడు సచిన్‌ చెప్పిన మాటలు ఇంకా గుర్తున్నాయి..

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ టెస్టు అరంగేట్రంలోనే ప్రతిష్ఠాత్మక లార్డ్స్‌ మైదానంలో శతకం సాధించి అందర్నీ ఆశ్చర్యపర్చిన సంగతి తెలిసిందే. అది జరిగి ఇప్పటికి 25 ఏళ్లు గడుస్తోంది. నాటి విశేషాల్ని గంగూలీ తాజాగా గుర్తు చేసుకుంటూ ఓ క్రీడాఛానెల్‌తో ముచ్చటించాడు. ఆ రోజు తాను తొలి శతకం బాదాక మానసికంగా అలిసిపోయానని చెప్పాడు. దాంతో అప్పుడు సచిన్‌ తన వద్దకు వచ్చి చెప్పిన మాటలు ఇంకా గుర్తున్నాయన్నాడు. అలాగే తాను బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే టీమ్‌ఇండియా ఆస్ట్రేలియా పర్యటనలో చారిత్రక టెస్టు సిరీస్‌ గెలుపొందడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పాడు.

‘‘ఆ రోజు టీ బ్రేక్‌ సమయంలో నేను శతకంతో కొనసాగుతున్నా. అప్పటికే మానసికంగా అలసిపోయా. అది నా తొలి శతకం అయినందున భావోద్వేగానికి గురయ్యా. చాలా సంతోషం వేసింది. అలా ఉద్వేగానికి లోనవడంతో శారీరకంగా కాకున్నా మానసికంగా ఎంతో అలసిపోయా. టీ బ్రేక్‌కు వెళ్లినప్పుడు నా బ్యాట్‌ హ్యాండిల్‌ పట్టుకోల్పోతుందని టేప్‌ చుడుతుండగా సచిన్‌ నా వద్దకొచ్చి ‘నువ్వు ప్రశాంతంగా ఉండు. వెళ్లి చాయ్‌ తీసుకొని తాగు’ అని చెప్పాడు. అదిప్పటికీ గుర్తుంది. అలా నేను డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్తుంటే సహచర ఆటగాళ్లంతా నన్ను అభినందించడానికి బయట నిల్చొని ఉన్నారు’’ అని గంగూలీ తన తొలి శతకం తీపిజ్ఞాపకాలు గుర్తుచేసుకున్నాడు.

‘‘నా క్రికెట్‌ ప్రయాణం మొత్తం అద్భుతంగా సాగింది. 1996లో అరంగేట్రంలోనే శతకం బాదాను. కొద్ది సంవత్సరాల్లోనే టీమ్‌ఇండియా కెప్టెన్‌గా ఎదిగా. జట్టును బలంగా తీర్చిదిద్దడం, దాంతో ప్రజల్లో మంచి గుర్తింపు రావడం, అక్కడి నుంచి కెప్టెన్సీ వదులుకొని జట్టులో కొనసాగడం, క్రికెట్‌ పాలనా వ్యవహరాల్లో మునిగిపోవడం ఆపై బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగడం, అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనే టీమ్‌ఇండియా ఆస్ట్రేలియాపై 2-1 తేడాతో చారిత్రక సిరీస్‌ గెలుపొందడం అంతా అద్భుతమైన ప్రయాణం. ఒక క్రీడాకారుడిగా, క్రికెటర్‌గా ఇంతకన్నా మంచిగా ఏం ఆశించగలం?’ అని గంగూలీ తన కెరీర్‌ మొత్తాన్ని నెమరువేసుకొని సంతోషం వ్యక్తం చేశాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని