AB devilliers: పునరాగమనంపై స్పష్టత.. 
close

తాజా వార్తలు

Published : 18/05/2021 19:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

AB devilliers: పునరాగమనంపై స్పష్టత.. 

క్రికెట్‌ దక్షిణాఫ్రికా ఏం చెప్పిందంటే..?

ఇంటర్నెట్‌డెస్క్‌: రాబోయే టీ20 ప్రపంచకప్‌కు ముందు మిస్టర్‌ 360 ఏబీ డివిలియర్స్‌ తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చే అవకాశం లేదని దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు మంగళవారం తేల్చి చెప్పింది. ఒకసారి రిటైర్మెంట్‌ ప్రకటించాక అదే అంతిమ నిర్ణయమైనట్లు అతడు పేర్కొన్నాడని చెప్పింది. అందులో డివిలియర్స్‌ మనసు మార్చుకునే ఉద్దేశం లేదని బోర్డు స్పష్టం చేసింది. ఈ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడే విషయంపై అతడితో చర్చించామని, ఈ సందర్భంగా తన నిర్ణయంలో ఎలాంటి మార్పులేదని కుండ బద్దలుకొట్టినట్లు దక్షిణాఫ్రికా బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.

2018 మే నెలలో డివిలియర్స్‌ అకస్మాత్తుగా రిటైర్మెంట్‌ ప్రకటించి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసిన సంగతి తెలిసిందే. అయితే, అతడు రిటైర్మెంట్‌ వెనక్కి తీసుకొని తిరిగి క్రికెట్‌ ఆడాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ క్రమంలోనే 2019 వన్డే ప్రపంచకప్‌ సమయంలో డివిలియర్స్ తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లోకి రావాలనుకున్నట్లు వార్తలు వచ్చాయి. దాంతో అతడు భవిష్యత్‌లో మళ్లీ దక్షిణాఫ్రికా తరఫున ఆడతాడని అంతా అనుకున్నారు. మరోవైపు ఇటీవల ఐపీఎల్‌ 14వ సీజన్‌లోనూ మిస్టర్‌ 360 తిరిగి తనకు అంతర్జాతీయ క్రికెట్‌ ఆడాలని ఉందన్నాడు. రాబోయే టీ20 ప్రపంచకప్‌కు ముందు పునరాగమనం చేస్తే అద్భుతంగా ఉంటుందని చెప్పాడు. ఆ విషయంపై ఐపీఎల్‌ పూర్తయ్యాక దక్షిణాఫ్రికా కోచ్‌ మార్క్‌ బౌచర్‌తో మాట్లాడతానన్నాడు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా బోర్డు తాజా ప్రకటన అభిమానులకు నిరాశ కలిగించింది. కాగా, కరోనా కేసుల నేపథ్యంలో ఈ ఐపీఎల్‌ సీజన్‌ నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అంతకుముందు జరిగిన మ్యాచ్‌ల్లో డివిలియర్స్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫున పలు కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని