కోహ్లీ సరసన ‌స్మిత్‌
close

తాజా వార్తలు

Published : 08/01/2021 10:49 IST

కోహ్లీ సరసన ‌స్మిత్‌

టెస్టుల్లో 27వ శతకం బాదిన ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌

సిడ్నీ: టీమ్‌ఇండియాతో తలపడుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌స్మిత్‌(131; 226 బంతుల్లో 16x4) శతకంతో చెలరేగాడు. అడిలైడ్‌, మెల్‌బోర్న్‌ టెస్టుల్లో విఫలమైన అతడు సిడ్నీలో ఆత్మవిశ్వాసంతో ఆడాడు. దీంతో సుదీర్ఘ ఫార్మాట్‌లో 27వ శతకం సాధించాడు. అలాగే టెస్టుల్లో అత్యధిక సెంచరీలు బాదిన బ్యాట్స్‌మెన్‌ జాబితాలో టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సరసన నిలిచాడు. ఇంకో శతకం బాదితే దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు హషీమ్‌ ఆమ్లా, మైఖేల్‌ క్లార్క్‌ల సరసన నిలుస్తాడు. వీరిద్దరూ 28 శతకాలు సాధించారు. ఇక క్రికెట్‌ దిగ్గజం సచిన్ తెందూల్కర్‌ 51 శతకాలతో అందరికన్నా ముందున్న సంగతి తెలిసిందే. 

స్మిత్‌ గురువారం 35వ ఓవర్లో క్రీజులోకి రాగా శుక్రవారం చివరి బ్యాట్స్‌మన్‌గా వెనుతిరిగాడు. జడేజా రనౌట్‌ చేయడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది. అంతకుముందు లబుషేన్‌(91; 196 బంతుల్లో 11x4)తో కలిసి స్మిత్‌ 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. దీంతో ఆతిథ్య జట్టు 206 పరుగుల వద్ద లబుషేన్‌ రూపంలో మూడో వికెట్‌ కోల్పోయింది. ఆపై వచ్చిన బ్యాట్స్‌మెన్‌ వచ్చినట్లు పెవిలియన్‌ బాట పట్టినా స్మిత్‌ పట్టుదలతో క్రీజులో పాతుకుపోయాడు. ఈ క్రమంలోనే నవ్‌దీప్‌ సైని బౌలింగ్‌లో 27వ టెస్టు శతకం సాధించాడు. 2019 సెప్టెంబర్‌లో ఈ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ చివరిసారి ద్విశతకం బాదాడు. అప్పుడు మాంచెస్టర్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో తలపడిన మ్యాచ్‌లో 211 పరుగులు చేశాడు. ఇక ఈ బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో అడిలైడ్‌లో(1, 1*), మెల్‌బోర్న్‌లో (0, 8) విఫలమైన సంగతి తెలిసిందే.

ఇవీ చదవండి..
స్మిత్‌ శతకం.. ఆస్ట్రేలియా 338 
ఆంక్షలు సడలిస్తేనే నాలుగో టెస్టు.. లేదంటే!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని