close

తాజా వార్తలు

Updated : 29/09/2020 18:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పరుగుల ‘కొండల్ని’ కరిగించారు!

టాప్‌-5 ఛేదనల్లో రాజస్థాన్‌ మెరుపులు

215.. మొన్నటి వరకు లీగులో అతిపెద్ద ఛేదన ఇదే. అరంగేట్రం సీజన్‌లోనే రాజస్థాన్‌ సాధించిన ఘనత ఇది. దాదాపుగా 12 ఏళ్లు గడిచింది. ఎన్నో జట్లు దీనిని బద్దలు కొట్టేందుకు విశ్వప్రయత్నం చేశాయి. కానీ అందులో ఏ ఒక్కటీ విజయవంతం అవ్వలేదు. మళ్లీ ఇన్నాళ్లకు తన రికార్డును తానే తిరగరాసింది ‘గులాబి సేన’. 224 పరుగుల కొండను కరిగించి తనకు తానే సాటి.. తనకు లేరెవరు పోటీ! అని చాటింది. ఈ నేపథ్యంలో లీగ్‌లో టాప్‌-5 ఛేదనలేంటో ఒకసారి చూసేద్దామా!


షార్జాలో గులాబి ‘దర్జా’

లీగ్‌లో అతిపెద్ద ఛేదన రికార్డును రెండుసార్లు సృష్టించింది రాజస్థాన్‌. 13వ సీజన్‌లో షార్జా వేదికగా జరిగిన మ్యాచులో పంజాబ్‌ నిర్దేశించిన 224 పరుగుల భారీ లక్ష్యాన్ని దర్జాగా ఛేదించింది ఆ జట్టు. అసలు సింగిల్స్‌, డబుల్స్‌ అన్న మాటే లేదు. దొరికిన ప్రతి బంతినీ స్టేడియం పైకప్పుపైకి తరలించారు ఆటగాళ్లు. ఈ పోరులో మొదట మయాంక్‌ (106; 50 బంతుల్లో 10×4, 7×6), రాహుల్‌ (69; 54 బంతుల్లో 7×4, 1×6) దంచికొట్టారు. అయితే లక్ష్య ఛేదనలో సంజు శాంసన్‌ (85; 42 బంతుల్లో 4×4, 7×6), స్మిత్‌ (50; 27 బంతుల్లో 7×4, 2×6), రాహుల్‌ తెవాతియా (53; 31 బంతుల్లో 7×6) పరుగుల వరద పారించడంతో మరో 3 బంతులు మిగిలుండగానే గులాబి దండు విజయ దుందుభి మోగించింది.


మళ్లీ.. రాజస్థానే

రెండో రికార్డు ఛేదనా రాజస్థాన్‌దే. 2008లో డెక్కన్‌ జట్టుపై 215 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్ల నష్టాపోయి ఛేదించేసింది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ ఈ పోరుకు వేదిక. తొలుత ఆండ్రూ సైమండ్స్‌ (117; 53 బంతుల్లో 11×4, 7×6) ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. విధ్వంసకర బౌండరీలు బాదాడు. 220.75 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేశాడు. అతడికి తోడుగా రోహిత్‌ శర్మ (36; 30 బంతుల్లో 3×4, 1×6) నిలిచాడు. అరంగేట్రం సీజన్‌ కావడంతో రాజస్థాన్‌ గెలుపు సులువేమీ కాదని అంతా అనుకున్నారు. కానీ షేన్‌వార్న్‌ సేన అందరి అంచనాలనూ తలకిందులు చేసింది. గ్రేమ్‌ స్మిత్‌ (71; 45 బంతుల్లో 9×4, 2×6), యూసుఫ్‌ పఠాన్‌ (61; 28 బంతుల్లో 4×4, 6×6), మహ్మద్‌ కైఫ్‌ (34; 16 బంతుల్లో 2×4, 3×6), వార్న్‌‌ (22*; 9 బంతుల్లో 2×4, 2×6) సమష్టిగా దంచికొట్టారు. దాంతో మరో బంతి మిగిలుండగానే గెలుపు రాజస్థాన్‌ తలుపు తట్టింది.


దిల్లీకి పంత్‌ అండ

లీగ్‌లో‌ అతిపెద్ద మూడో ఛేదన దిల్లీది. 2017లో కోట్లా వేదికగా దిల్లీ, గుజరాత్‌ తలపడ్డాయి. సురేశ్‌ రైనా (77; 43 బంతుల్లో 5×4, 4×6), దినేశ్‌ కార్తీక్‌ (65; 34 బంతుల్లో 5×4, 5×6) వేగంగా ఆడటంతో గుజరాత్ 7 వికెట్ల నష్టానికి‌ 208 పరుగులు చేసింది. మందకొడిగా ఉండి స్పిన్నర్లకు సహకరించే నెమ్మది పిచ్‌పై ఈ లక్ష్యం ఛేదించడం దిల్లీకి కష్టమే అనుకున్నారు. కానీ మరో 15 బంతులు మిగిలుండగానే ఆ జట్టు అద్భుత విజయం సాధించడం విశేషం. సంజు శాంసన్‌ (61; 31 బంతుల్లో 7×6) మెరుపు ఆరంభాన్ని ఇవ్వగా రిషభ్ పంత్ ‌(97; 43 బంతుల్లో 6×4, 9×6) చితకొట్టాడు. తనదైన శైలిలో సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దాంతో 7 వికెట్ల తేడాతో ఛేదన పూర్తైంది.


పంజాబ్‌ ఛేదించేసెన్‌

2014 సీజన్‌లో పంజాబ్‌ వీర విహారం గురించి అందరికీ తెలిసిందే. ఫైనల్‌ చేరిన ఆ ఏడాది అతిపెద్ద నాలుగో ఛేదన రికార్డూ సొంతం చేసుకుంది. 206 పరుగుల లక్ష్యాన్ని ఉఫ్‌..! అని ఊదేసింది. ఉప్పల్‌ వేదికగా హైదరాబాద్‌తో ఆ జట్టు తలపడింది. శిఖర్ ధావన్‌ (45), నమన్‌ ఓజా (79; 36 బంతుల్లో 4×4, 7×6), డేవిడ్‌ వార్నర్‌ (44; 23 బంతుల్లో 3×4, 3×6) చెలరేగడంతో హైదరాబాద్‌ 5 వికెట్లకు 205 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో పంజాబ్‌ సమష్టిగా రాణించింది. మనన్‌ వోహ్రా (47; 20 బంతుల్లో 5×4, 2×6), వృద్ధిమాన్‌ సాహా (54; 26 బంతుల్లో 8×4, 2×6), మాక్స్‌వెల్‌ (43; 22 బంతుల్లో 2×4, 5×6), జార్జ్‌ బెయిలీ (35*; 19 బంతుల్లో 2×4, 3×6) చితకబాదారు. దాంతో పంజాబ్‌ 18.4 ఓవర్లకే 4 వికెట్ల నష్టానికి విజయం అందుకుంది.


ఆఖరి బంతికి చెన్నై

లీగ్‌లో అత్యంత విజయవంతమైన చెన్నై టాప్‌-5 ఛేదనల్లో ఐదో స్థానంలో నిలిచింది. 2012లో బెంగళూరు నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని ఆఖరి బంతికి ఛేదించింది. చిదంబరం మైదానం వేదికగా సాగిన ఈ పోరులో బెంగళూరు తొలుత బ్యాటింగ్‌ చేసింది. మయాంక్‌ అగర్వాల్‌ (45; 26 బంతుల్లో 5×4, 3×6), క్రిస్‌గేల్‌ (68; 35 బంతుల్లో 2×4, 6×6), విరాట్‌ కోహ్లీ (57; 46 బంతుల్లో 5×4, 2×6) విజృంభించి ఆడారు. అయితే ఆఖరి వరకు ఉత్కంఠతో చంపేసింది ధోనీసేన. డుప్లెసిస్‌ (71; 46 బంతుల్లో 5×4, 4×6)కు తోడుగా ధోనీ (41; 24 బంతుల్లో 1×4, 2×6), ఆల్బీ మోర్కెల్‌ (28; 7 బంతుల్లో 2×4, 3×6) ధనాధన్‌‌ ఇన్నింగ్స్‌లు ఆడేశారు. కోహ్లీ 2 ఓవర్లు విసిరి 36 పరుగులు ఇవ్వడం గమనార్హం.

-ఇంటర్నెట్‌డెస్క్‌


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
    ఎక్కువ మంది చదివినవి (Most Read)
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.