WTC Final: భారత్‌ తుది జట్టులో మార్పులు?
close

తాజా వార్తలు

Updated : 18/06/2021 19:00 IST

WTC Final: భారత్‌ తుది జట్టులో మార్పులు?

మాజీ సారథి సునీల్‌ గావస్కర్‌..

ఇంటర్నెట్‌డెస్క్‌: న్యూజిలాండ్‌తో తలపడే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు టీమ్‌ఇండియా గురువారమే 11 మందితో కూడిన తుది జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం మ్యాచ్‌ ప్రారంభానికి ముందు అక్కడ వర్షం కురవడంతో తొలిరోజు ఆట మొదటి సెషన్‌ రద్దయింది. ఈ క్రమంలోనే టాస్‌ కూడా వేయలేదు. దాంతో వర్షం ఆగి టాస్‌ వేసే సమయానికి భారత్‌ గురువారం ప్రకటించిన జట్టులో మార్పులు చేయొచ్చని మాజీ సారథి సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డారు. వర్షం కారణంగా జట్టులో ఒక స్పిన్నర్‌ను తొలగించి అదనపు బ్యాట్స్‌మన్‌ను ఎంపిక చేసే వీలుందని ఆయన అంచనా వేశారు. తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ సన్నీ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘నిన్ననే భారత్‌ తుది జట్టును ప్రకటించి ఉండొచ్చు. కానీ ఇరు జట్ల కెప్టెన్లు టాస్‌ సమయంలో తమ ఆటగాళ్ల జాబితా పత్రాన్ని మార్చుకునే వరకు ఏదీ ఫైనల్‌ కాదు. దీన్నిబట్టి అప్పటివరకు జట్టులో మార్పులు చేసుకోవచ్చు. నేను ఆడే రోజుల్లో కెప్టెన్‌గా ఉన్నప్పుడు స్పిన్నర్‌ను తీసుకోవాలా లేదా అదనపు బ్యాట్స్‌మన్‌ను తీసుకోవాలా అనే సందేహం తలెత్తినప్పుడు.. ప్రత్యర్థి జట్టును చూసి నా జట్టులో మార్పులు చేసేవాడిని. అలా టాస్‌ వేసేవరకు ఎవరినైనా మార్చవచ్చు. ఇప్పుడు సౌథాంప్టన్‌లో ఉన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఒక అదనపు బ్యాట్స్‌మన్‌ను తీసుకోవాలని భారత్‌ ఆలోచించొచ్చని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఈ వాతావరణం న్యూజిలాండ్‌ బౌలర్లకు అనుకూలం. పంత్‌ ఇప్పుడు ఆరో స్థానంలో ఆడనున్నాడు. ఇంకో బ్యాట్స్‌మన్‌ను తీసుకుంటే అతడు ఏడో స్థానంలో బరిలోకి దిగుతాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఒక స్పిన్నర్‌ను తప్పించొచ్చు’ అని గావస్కర్‌ పేర్కొన్నారు.

రెండో సెషన్‌ కూడా లేనట్లే..!
మరోవైపు ఈ ఫైనల్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా రెండో సెషన్‌ కూడా నిలిచిపోయింది. ఉదయం నుంచి ఏజీస్‌బౌల్‌ మైదానంలో ఎడతెరిపి లేని వాన కురుస్తున్న సంగతి తెలిసిందే. మ్యాచ్‌ తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుందనే దానిపై సందిగ్ధత నెలకొంది. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు ఈ తుదిపోరు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

టీమ్‌ఇండియా ప్రకటించిన జట్టు:
రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌గిల్‌, చెతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), అజింక్య రహానె, రిషభ్‌ పంత్‌(కీపర్‌), రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, జస్ప్రిత్‌ బుమ్రా, మహ్మద్‌ షమి, ఇషాంత్‌ శర్మ



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని