close

తాజా వార్తలు

Updated : 21/10/2020 19:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గేల్‌ను కట్టేశా.. ప్రమాద ఘంటిక.. సూపర్‌ వద్దు

ఐపీఎల్‌ కబుర్లు ఇంకేం ఉన్నాయంటే!

టీ20 క్రికెట్‌ లీగ్‌‌ రసవత్తరంగా సాగుతోంది. ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శనలు చేస్తున్నారు. తమతో తామే పోటీ పడుతున్నారు. మ్యాచులో హోరాహోరీగా తలపడుతున్న ప్రత్యర్థులు.. ఆట ముగిశాక సరదా కబుర్లు చెప్పుకుంటున్నారు. భారీ అంచనాలను నిజం చేసుకొనేందుకు ఆత్మస్థైర్యం కావాలని షమి అంటే.. బౌలింగ్‌ చేయడానికి ముందే గేల్‌ కాళ్లు కట్టేశానని అశ్విన్‌ అంటున్నాడు. వరుస ఓటములు తమకు ప్రమాద ఘంటికలని శ్రేయస్‌ భావిస్తున్నాడు. ఐపీఎల్‌ కబుర్లు ఇంకా ఏమున్నాయంటే..!


షమి.. తెలియందేముంది!

దిల్లీ మ్యాచులో ఆఖరి ఓవర్‌ను అద్భుతంగా వేసిన మహ్మద్‌ షమిని పంజాబ్‌ సారథి కేఎల్‌ రాహుల్‌ ప్రశంసించాడు. తన పాత్రపై అతనిప్పుడు మరింత స్పష్టతతో ఉన్నాడని పేర్కొన్నాడు. ‘తనదైన రోజున షమి ఏం చేయగలడో మనందరికీ తెలుసు. చాలా ఏళ్లుగా అతడీ పని చేస్తున్నాడు. ఈ ఏడాది అతడు మరింత స్పష్టతతో ఉన్నాడు. సీనియర్‌ బౌలర్‌గా మిగతా వారిని నడిపిస్తున్నాడు. కుర్రాళ్లు ఎదగాలంటే సీనియర్లు వారి భుజం తట్టాల్సిందే. మ్యాచులో మాక్సీ సైతం చక్కగా బౌలింగ్‌ చేశాడు’ అని రాహుల్‌ అన్నాడు.


ఓటమి.. ప్రమాద ఘంటిక

పంజాబ్‌ చేతిలో ఓటమి పాలవ్వడం తమకు ప్రమాద ఘంటిక అని దిల్లీ సారథి శ్రేయస్‌ అయ్యర్‌ అంటున్నాడు. బ్యాట్స్‌మెన్‌ మరింత మెరుగ్గా రాణించాలని సూచించాడు. లీగులో వరుసగా రెండో శతకం చేసిన శిఖర్‌ ధావన్‌ను అభినందించాడు. ‘అవును, ఈ ఓటమి మాకు ప్రమాద ఘంటిక. మున్ముందు మేం హోరాహోరీ మ్యాచుల్లో తలపడాల్సి ఉంది. కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంది. లీగు తొలి భాగంలో మేం అద్భుతమైన క్రికెట్‌ ఆడాం. అయితే అది గతం. ఇకపై మేం మరింత బాధ్యతాయుతంగా ఆడాల్సి ఉంది. ధావన్‌ తిరుగులేని ఫామ్‌లో ఉండటం సంతోషకరం’ అని శ్రేయస్‌ పేర్కొన్నాడు.


చెన్నైపై పిడుగు

వరుస ఓటములతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న చెన్నైపై మరో పిడుగు పడింది. ఆ జట్టు సీనియర్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌బ్రావో సీజన్‌కు పూర్తిగా దూరమవుతున్నాడు. తిరిగి వెస్టిండీస్‌ వెళ్లిపోతున్నాడు. ‘తొడ కండరాల్లో గాయం కారణంగా డ్వేన్‌బ్రావో సీజన్‌ తర్వాతి భాగానికి పూర్తిగా దూరమవుతున్నాడు. తిరిగి స్వదేశానికి వెళ్లిపోతున్నాడు’ అని ఆ జట్టు సీఈవో కాశీవిశ్వనాథన్‌ ప్రకటించారు. లీగులో 10 మ్యాచులాడిన ధోనీసేన ఏడింట్లో ఓటమిపాలైంది. పట్టికలో అట్టడుగున నిలిచి దాదాపుగా ప్లేఆఫ్స్‌ నుంచి నిష్ర్కమించింది.


గేల్‌.. కాళ్లను కట్టేశా!

దిల్లీ సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ యూనివర్స్‌ బాస్‌ క్రిస్‌గేల్‌పై హాస్య గుళిక విసిరాడు. తాను బౌలింగ్‌ చేయడానికి ముందే క్రిస్‌గేల్‌ రెండుకాళ్లను తాడుతో కట్టేశానని అన్నాడు. దిల్లీ మ్యాచులో గేల్‌ విధ్వంసకరంగా ఆడాడు. 3 బౌండరీలు, 2 సిక్సర్ల సాయంతో 13 బంతుల్లోనే 29 పరుగులు చేసేశాడు. యువ పేసర్‌ తుషార్‌ దేశ్‌పాండే వేసిన ఐదో ఓవర్లో విరుచుకుపడ్డ గేల్‌ను.. తాను వేసిన రెండో బంతికే క్లీన్‌బౌల్డ్‌ చేశాడు యాష్‌. ‘డెవిల్‌ ఎప్పటికీ ప్రమాదకరమే.. అందుకే బౌలింగ్‌ చేసే ముందే అతడి రెండు కాళ్లను తాడుతో కట్టేశా..’ అని అశ్విన్‌ ట్వీటాడు.


కుర్రాళ్లూ.. ఇలాగే ముందుకెళ్దాం

‘భారీ అంచనాలు పెట్టుకోండి.. గుండెధైర్యంతో వాటిని అందుకోండి’ అంటున్నాడు మహ్మద్‌ షమి. దిల్లీని తక్కువ స్కోరుకే  కట్టడి చేయడంలో అతడు ప్రధాన పాత్ర పోషించిన  సంగతి తెలిసిందే. ఆఖరి ఓవర్లో అద్భుతమైన యార్కర్లతో విజృంభించి ఒక్క బౌండరీ ఇవ్వలేదు. విజయం సాధించిన తర్వాత.. ‘కలిసికట్టుగా సరైన దిశగా అడుగులు వేస్తుంటే ఎలాంటి అడ్డంకులూ ఉండవు. కుర్రాళ్లూ.. ఇలాగే ముందుకెళ్దాం’ అని ట్వీటాడు షమి.


ఆఖరి వరకు వద్దేవద్దు

హైదరాబాద్‌ పోరులో సూపర్‌ ఓవర్లో గెలిచింది కోల్‌కతా. అలా చివరి వరకు మ్యాచులను తీసుకురాకుండా ముందుగానే తాము మ్యాచుల్ని ముగించాల్సిన అవసరం ఉందని యువ పేసర్‌ శివమ్‌ మావి అంటున్నాడు. అబుదాబి పిచ్‌పై మరోసారి లాకీ ఫెర్గూసన్‌ రెచ్చిపోయే అవకాశం ఉందన్నాడు. అతడి చేరికతో తమ బౌలింగ్‌ దాడి మరింత పదునెక్కిందని పేర్కొన్నాడు. బెంగళూరు మ్యాచులో తమ ప్రణాళికలను పక్కాగా అమలు చేయాల్సి ఉందన్నాడు. ‘ఇంతకు ముందే వారితో ఓ మ్యాచ్‌ ఆడాం. అందుకే మా తప్పుల్ని గ్రహించి మరోసారి ఓటమి పాలవ్వకుండా చూసుకోవాలి’ అని పేర్కొన్నాడు. ఆ మ్యాచులో కోల్‌కతా 82 పరుగుల తేడాతో ఓడింది.


ఏబీకి మాత్రమే చెల్లు

కోల్‌కతాతో మ్యాచ్‌కు ముందు బెంగళూరు కొన్ని  గణాంకాలను పంచుకుంది. మరో 58 పరుగులు చేస్తే టీ20ల్లో ఏబీ 9000 పరుగుల మైలురాయి అందుకుంటాడని తెలిపింది. ఈ సీజన్‌లో యూజీ 13 వికెట్లతో ఎక్కువ వికెట్లు తీసిన స్పిన్నర్‌గా నిలిచాడని ప్రశంసించింది. తమ జట్టులో దేవదత్‌ పడిక్కల్‌ అత్యధికంగా 6 క్యాచులు అందుకున్నాడని వెల్లడించింది. లీగులో ఒకే జట్టుకు 4009 పరుగులు చేసిన విదేశీ ఆటగాడు ఏబీ మాత్రమేనని గొప్పగా చెప్పుకుంది.


ఇంకా.. ఎవరెవరు ఏయే ట్వీట్లు చేశారంటే...








Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.