కుంబ్లేను ఎదుర్కోడానికి ద్రవిడ్‌ సాయం: తైబు

తాజా వార్తలు

Updated : 25/01/2021 12:45 IST

కుంబ్లేను ఎదుర్కోడానికి ద్రవిడ్‌ సాయం: తైబు

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ సారథి రాహుల్‌ ద్రవిడ్‌ తనకూ బ్యాటింగ్‌ విషయంలో సాయం చేశాడని జింబాబ్వే మాజీ సారథి తతెందా తైబు పేర్కొన్నాడు. భారత్‌తో టెస్టు మ్యాచ్‌లు ఆడేటప్పుడు స్పిన్‌ దిగ్గజం అనిల్‌కుంబ్లే బౌలింగ్‌ను ఎలా ఎదుర్కోవాలనే విషయంపై స్పష్టతనిచ్చాడని చెప్పాడు. ఇటీవల శ్రీలంక పర్యటనలో ఇంగ్లాండ్‌ ఓపెనర్లు క్రాలే, సిబ్లీ.. లంక స్పిన్నర్‌ ఎంబుల్దేనియా బౌలింగ్‌ను ఆడటంలో విఫలమయ్యారు. ఈ విషయాన్ని గమనించి ఆ జట్టు మాజీ ఆటగాడు కెవిన్‌ పీటర్సన్‌ ట్విటర్‌లో పలు పోస్టులు చేశాడు. తాను ఆడే రోజుల్లో ఇలాగే ఇబ్బంది పడితే ద్రవిడ్‌ సాయం చేశాడని చెప్పాడు. ఆ విషయాలను అభిమానులతో పంచుకోవడంతో పాటు ఇంగ్లాండ్‌ బోర్డు కూడా ద్రవిడ్‌ చెప్పిన విషయాలను కాపీలు తీసి క్రాలే, సిబ్లీకి అందజేయాలని సూచించాడు. 

ఈ క్రమంలోనే ఆ పోస్టును చూసిన తైబు పీటర్సన్‌కు రిప్లై ఇచ్చాడు. ఒకానొక సందర్భంలో ద్రవిడ్‌ తనకూ సాయం చేశాడని గుర్తు చేసుకున్నాడు. ‘టీమ్‌ఇండియాతో నేను ఆడిన తొలి రెండు టెస్టుల్లో మూడుసార్లు కుంబ్లే చేతిలో ఔటయ్యాను. ఆ సమయంలో ద్రవిడ్‌ నుంచి సలహాలు పొందాను. మ్యాచ్‌ అయ్యాక అతనితో మాట్లాడినప్పుడు కుంబ్లే బౌలింగ్‌ను.. స్లో మీడియం పేస్‌ బౌలర్‌ను ఎదుర్కొనేటట్లు ఆడాలని చెప్పాడు. బంతిని తదేకంగా చూస్తూ కాళ్ల కంటే ముందు బ్యాట్‌ను ఉంచాలని, కాస్త ఆలస్యంగా షాట్‌ ఆడాలని తెలిపాడు. అయితే, ఆ షాట్‌ను చాలా తేలిగ్గా నేర్చుకోవచ్చు. బంతి టైమింగ్‌ను బట్టి ముందుకు వచ్చి దాన్ని గమనిస్తూనే ఫ్రంట్‌ఫుట్‌ తీసుకొని షాట్‌ ఆడాలి’ అని తైబు పేర్కొన్నాడు. తైబు 2001లో 18 ఏళ్ల వయసులో జింబాబ్వే జట్టులో చేరాడు. అప్పటి నుంచీ 2012 వరకు మొత్తం 28 టెస్టులు, 150 వన్డేలు, 17 టీ20 ఆడాడు. ఈ క్రమంలోనే టెస్టుల్లో ఒక శతకంతో 1,546, వన్డేల్లో రెండు శతకాలతో 3,393 పరుగులు చేశాడు. 

ఇవీ చదవండి..
ఆ బాధేంటో నాకు తెలుసు: రహానె
 ఒకే ఆటగాడు. ఒకే బంతి.. రెండుసార్లు రనౌట్‌ 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని