WTC 2021-23: టీమ్‌ఇండియా షెడ్యూల్‌ ఇదే!
close

తాజా వార్తలు

Published : 25/06/2021 01:16 IST

WTC 2021-23: టీమ్‌ఇండియా షెడ్యూల్‌ ఇదే!

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా బుధవారమే తొలి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌ ఆడింది. న్యూజిలాండ్‌తో తలపడిన ఈ పోరులో చివరికి 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దాంతో మరోసారి కెప్టెన్‌గా తొలి ఐసీసీ ట్రోఫీని ముద్దాడాలన్న కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కల నెరవేరలేదు. ఇదిలా ఉండగా, మరో రెండేళ్లలో జరిగే రెండో టెస్టు ఛాంపియన్‌షిప్‌ పోటీలకు టీమ్‌ఇండియా షెడ్యూల్‌ ఒకటి ఇప్పుడు ప్రచారంలో ఉంది. గతంలో మాదిరే ఈసారి కూడా మూడు విదేశీ పర్యటనలు, మూడు స్వదేశీ సిరీస్‌లు ఉన్నాయి. అవేంటో ఒకసారి మీరే చూడండి..

ఇంగ్లాండ్‌తోనే ఆరంభం: టీమ్‌ఇండియా ఆగస్టులో ఇంగ్లాండ్‌ జట్టుతో ఐదు టెస్టుల సిరీస్‌ ఆడనుంది. ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్‌ 14 వరకు ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే, మరో రెండేళ్ల పాటు జరిగే రెండో ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో ఇదే తొలిసిరీస్‌ కావడం విశేషం.

కివీస్‌తో మళ్లీ: ఇటీవలి కాలంలో టీమ్‌ఇండియా ఎక్కువగా ఏ జట్టుతోనైనా ఇబ్బంది పడిందంటే అది కివీస్‌తోనే. 2019 వన్డే ప్రపంచకప్‌ సెమీ ఫైనల్లో ఓటమి తర్వాత న్యూజిలాండ్‌ పర్యటనలోనూ కోహ్లీసేన అటు వన్డే, ఇటు టెస్టు సిరీస్‌లు కోల్పోయింది. ఇక తాజాగా తొలి ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలోనే నవంబర్‌లో ఆ జట్టు భారత పర్యటనకు రానుంది. అప్పుడైనా టీమ్‌ఇండియా ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా చూడాలి. అయితే, ఈ షెడ్యూల్‌ తేదీలింకా ఖరారు కాలేదు.

దక్షిణాఫ్రికా పర్యటన: ఇక టీమ్‌ఇండియా న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ పూర్తయ్యాక ఈ ఏడాది చివర్లో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. దాంతో ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో భాగంగా అక్కడ డిసెంబర్‌-జనవరి నెలల్లో మూడు టెస్టుల సిరీస్‌ ఆడనుంది. ఈ సిరీస్‌ తేదీలు కూడా ఇంకా ప్రకటించలేదు.

లంకేయుల రాక: వచ్చే ఏడాది ఐపీఎల్‌ 15వ సీజన్‌కు ముందు శ్రీలంక భారత పర్యటనకు రానుంది. 2022 ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఇరు జట్లూ మూడు టెస్టు మ్యాచ్‌లు ఆడనున్నాయి.

కంగారూల పర్యటన: 2022 రెండో భాగంలో ఆస్ట్రేలియా భారత పర్యటనకు రావాల్సి ఉంది. అప్పుడు నాలుగు టెస్టుల సిరీస్‌ ఇక్కడే జరగనుంది. ఈ సిరీస్‌ సెప్టెంబర్‌-నవంబర్‌ మధ్య ఎప్పుడైనా జరిగే అవకాశం ఉంది.

చివరగా బంగ్లాతో: రెండో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో టీమ్‌ఇండియా చివరగా బంగ్లాదేశ్‌తో తలపడాల్సి ఉంది. ఒకవేళ నవంబర్‌లో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ పూర్తయితే ఆ వెంటనే టీమ్‌ఇండియా బంగ్లా పర్యటనకు వెళ్లనుంది. అక్కడ రెండు టెస్టులు ఆడే అవకాశముంది.

నోట్‌: ఇవన్నీ టీమ్‌ఇండియా భవిష్యత్‌ ప్రణాళిక ప్రకారం రూపొందించిన సిరీస్‌లు. అయితే, పరిస్థితుల ప్రభావంతో వీటిలో మార్పులు జరిగే అవకాశం లేకపోలేదు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని