
తాజా వార్తలు
చిరకాల కోరిక నెరవేర్చుకున్న సిరాజ్..!
హైదరాబాద్: ఇటీవల టెస్టు సిరీస్‌లో సత్తా చాటిన టీమ్ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ మాంచి జోష్ మీద ఉన్నాడు. భారత్ తరఫున టెస్టుల్లో ఆడాలనే తన తండ్రి కలను నిజం చేసుకున్న అతడు ఆస్ట్రేలియా గడ్డపై ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రదర్శన చేశాడు. గబ్బా టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయడమే కాకుండా సిరీస్‌లో అత్యధికంగా 13 వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే 2-1 తేడాతో రహానె సేన సిరీస్ కైవసం చేసుకున్నాక సిరాజ్ గురువారం హైదరాబాద్‌కు తిరిగి వచ్చాడు. దాంతో అతడికి ఘన స్వాగతం లభించింది.
ఆ విజయాన్ని ఆస్వాదిస్తున్న సిరాజ్ తాజాగా తన చిరకాల కోరిక నెరవేర్చుకున్నాడు. కొత్తగా బీఎండబ్ల్యూ కారు కొని నగర రోడ్లపై షికారు చేశాడు. ఆ వీడియోలను ఈ హైదరాబాదీ పేసర్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పంచుకొని సంతోషం వ్యక్తం చేశాడు. కొత్త కారులో విహరిస్తూ సంబరపడ్డాడు. ఇదిలా ఉండగా, సిరాజ్ హైదరాబాద్‌కు రాగానే ఇంటికి వెళ్లలేదు. నేరుగా శ్మశానవాటికకు వెళ్లి... తన తండ్రి సమాధి వద్ద ప్రార్థనలు చేశాడు. ఆ తర్వాతే ఇంటికి చేరుకొని తన మాతృమూర్తిని కలిశాడు.
నవంబర్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసిన వెంటనే ఈ హైదరాబాదీ పేసర్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాడు. అక్కడికి వెళ్లిన వారం రోజుల్లోనే తండ్రి మహ్మద్ గౌస్ అనారోగ్యంతో కన్నుమూశారు. టీమ్ఇండియాకు టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించాలనే తన తండ్రి కోరికను నిజం చేసేందుకు అక్కడే ఉండిపోయాడు. దాంతో కడసారి చూపులకు కూడా నోచుకోలేకపోయాడు. సిరీస్ జరిగేటప్పుడు పలుమార్లు తన తండ్రిని గుర్తు చేసుకొని కంటతడి పెట్టాడు. ఈ నేపథ్యంలోనే కంగారూలపై సత్తా చాటాడు. గబ్బా టెస్టులో బౌలింగ్ దళాన్ని నడిపించి శెభాష్ అనిపించుకున్నాడు.
ఇవీ చదవండి..
కోహ్లీని కెప్టెన్సీ నుంచి తొలగిస్తే..!
తిరస్కరించిన రహానె..అభినందిస్తున్న నెటిజన్లు
36 ఆలౌట్: ఆ అర్ధరాత్రి ఏం జరిగిందంటే!