Neeraj Chopra: ఒక ఛాంప్‌ను అడిగే ప్రశ్నలేనా ఇవి.. నీరజ్‌కు వెల్లువెత్తిన నెటిజన్ల మద్దతు..! 

తాజా వార్తలు

Published : 07/09/2021 01:14 IST

Neeraj Chopra: ఒక ఛాంప్‌ను అడిగే ప్రశ్నలేనా ఇవి.. నీరజ్‌కు వెల్లువెత్తిన నెటిజన్ల మద్దతు..! 

 రాజీవ్‌ సేథీ ప్రశ్నపై తీవ్ర ఆగ్రహం

ఇంటర్నెట్‌డెస్క్‌: అథ్లెటిక్స్‌లో భారత్‌కు మొట్టమొదటి ఒలింపిక్‌ స్వర్ణాన్ని అందించి ప్రజల 100 ఏళ్ల కలను సాకారం చేశారు నీరజ్‌ చోప్రా.  ఇటీవల కాలంలో ఆయన్ను ఇంటర్వ్యూల పేరుతో ఇబ్బందికర ప్రశ్నలు అడగటాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు. ఇటీవల ఒక ఆర్జే ఇంటర్వ్యూకు పిలిచి ఆన్‌లైన్‌లో హగ్‌ అడిగింది.. తాజాగా చరిత్రకారుడు  రాజీవ్‌ సేథీ కూడా నీరజ్‌ను ఓ వివాదాస్పద ప్రశ్న అడిగారు. దీంతో నెటిజెన్లు ఆయన తీరును తప్పుపడుతున్నారు.

ఇటీవల ఒక ఆంగ్ల మీడియా సంస్థ నీరజ్‌ చోప్రాను ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూకు ఆహ్వానించింది. ఆయన వ్యక్తిగత, క్రీడా జీవితానికి సంబంధించిన పలు విషయాలు అడిగారు. ఈ క్రమంలో ఆర్ట్‌ హిస్టారియన్‌ రాజీవ్‌ సేథీ లైన్‌లోకి వచ్చారు. ‘‘అందమైన కుర్రాడివి.. నీ సెక్స్‌జీవితాన్ని.. అథ్లెటిక్స్‌ ట్రైనింగ్‌ను ఎలా బ్యాలెన్స్‌ చేసుకొంటున్నావు..?’’ అని ప్రశ్నించారు. పైగా అదొక ఇబ్బందికరమైన ప్రశ్నే అయినా.. అథ్లెటిక్స్‌కు అది సీరియస్‌ ప్రశ్నే అని సమర్థించుకొనే ప్రయత్నం చేశారు. దీనికి నీరజ్‌ చోప్రా చాలా హుందాగా స్పందిస్తూ.. ‘సారీ సర్‌’  అని సమాధానం ఇచ్చారు. అయినాకానీ, రాజీవ్‌ సేథీ ఒక పట్టాన ఆగలేదు. మరోసారి అదే ప్రశ్నకు సమాధానం కోసం ఒత్తిడి చేశారు. ఈ సారి కూడా నీరజ్‌ ఏమాత్రం సహనం కోల్పోకుండా ‘ప్లీజ్‌ సర్‌, మీ ప్రశ్నతో నా మనసు నిండిపోయింది’ అంటూ కట్‌ చేశారు. ఈ వీడియో క్లిప్‌ వైరల్‌ అయ్యింది.

* ఈ వీడియోకు శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది స్పందిస్తూ ‘‘ఎదుర్కొన్న చెత్త ప్రశ్నలకు కూడా సౌమ్యంగా సమధానం చెప్పిన నీరజ్‌పై నాకు గౌరవం పెరిగింది. నిజమైన స్పోర్ట్స్‌ పర్సన్‌’’ అని  పేర్కొన్నారు.

* ఆర్థిక వేత్త సంజీవ్‌ సాన్యాల్‌ స్పందిస్తూ‘‘నీరజ్‌ నేషనల్‌ ఐకాన్‌ అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అతని వయస్సు, నేపథ్యంతో సంబంధం లేకుండా గౌరవించాలి. ఇలాంటి అగౌరవ ఘటనలు తరచూ చోటు చేసుకోవడానికి పాతుకుపోయిన పక్షపాత ధోరణులే కారణం’’ అని పేర్కొన్నారు.  పలువురు నెటిజన్లు ట్విటర్లో రాజీవ్‌ తీరును తప్పుబట్టారు.

ఎప్పుడూ హుందాతనం కోల్పోని నీరజ్‌..

వాస్తవానికి నీరజ్‌ మొదటి నుంచి వివాదాస్పద ప్రశ్నల జోలికి వెళ్లడు. ఇంటర్వ్యూల్లో పూర్తి పరిపక్వతతో మాట్లాడతాడు. అతని  వయస్సును బట్టి ఏవో ప్రశ్నలు అడిగి కొంటె సమాధానాలు కోరే వారు అతని హుందాతనం చూసి అవాక్కవుతారు. రెండేళ్ల క్రితం ఓ ఆంగ్ల వార్త సంస్థ ప్రతినిధి ఇంటర్వ్యూ చేస్తూ ‘నీ ఇష్టమైన హీరోయిన్‌ ఎవరూ’  అని అడిగారు. అతనికి నీరజ్‌ రెండు చేతులు జోడించి సోదరా.. ఇలాంటి ప్రశ్నలు అడగవద్దని నవ్వుతూ సూచించారు.

ఇటీవల మరో ఆంగ్ల వార్త ఛానెల్‌ యాంకరమ్మ నీరజ్‌ను ప్రేమ గురించి పదేపదే ప్రశ్నించినా.. ఓపిగ్గా ఆ టాపిక్‌ను కట్‌ చేశారు. గతనెలలో ఓ రేడియో జాకి నీరజ్‌ను ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూకు ఆహ్వానించింది. ఇంటర్వ్యూకు ముందు ఓ సినీ పాటకు తన బృందంతో కలిసి డ్యాన్స్‌ చేసింది. చివర్లో ఆన్‌లైన్‌ వర్చువల్‌ హగ్‌ను (జాదు కీ జప్పీ)ని అడిగింది. ఆమె వైఖరితో నీరజ్‌ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. రెండు చేతులతో దణ్ణం పెట్టి ‘అలానే.. దూరంగానే’ అని చెప్పారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని