పగలు కలెక్టర్‌.. రాత్రి బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌!

తాజా వార్తలు

Published : 18/07/2021 09:15 IST

పగలు కలెక్టర్‌.. రాత్రి బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌!

పారాలింపిక్స్‌లో పతకమే లక్ష్యం..

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచ శ్రేణి క్రీడల్లో పాల్గొనే ఏ అథ్లెట్‌ అయినా పతకాలు సాధించాలని బలంగా కోరుకుంటారని, అందుకు తానూ మినహాయింపేమీ కాదన్నారు యూపీలోని నోయిడా జిల్లా మెజిస్ట్రేట్‌ సుహాస్‌ యతిరాజ్‌ అన్నారు. ఆగస్టు 24నుంచి ప్రారంభమయ్యే పారాలింపిక్స్‌ క్రీడల్లో ఐఏఎస్‌ అధికారి బ్యాడ్మింటన్‌ విభాగంలో పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే శనివారం మీడియాతో ముచ్చటించిన ఆయన తన అభిప్రాయాలు పంచుకున్నారు. సుహాస్‌ పారా-బ్యాడ్మింటన్‌ విభాగంలో ప్రపంచంలో మూడో ర్యాంకులో కొనసాగుతున్నారు.

‘విజయాలకు, వైఫల్యాలకు తేడా చాలా చిన్నది. ఏళ్లుగా మనందరం ఇది చూస్తూనే ఉన్నాం. నేను కూడా సెంటిమీటర్ల తేడాతో విజయాలు, మిల్లీమీటర్ల తేడాతో ఓటమిలు చవిచూసినవాడినే. రాబోయే పారాలింపిక్స్‌ క్రీడల్లో ఇతర అథ్లెట్లలాగే నేనూ పతకం సాధించాలనుకుంటున్నా. అలాగే నేను భగవద్గీతను కూడా బలంగా నమ్ముతా. అందులో చెప్పినట్లు మన పని మనం చేస్తే.. ఫలితం దానంతట అదే వస్తుంది. అందుకోసం మనం కృషి చేయాలి. మరోవైపు, ప్రస్తుత పరిస్థితుల్లోనూ నేను ఒత్తిడికి గురికావట్లేదు. ఇప్పుడు పారా-బ్యాడ్మింటన్‌ విభాగంలో ప్రపంచ మూడో ర్యాంకులో ఉన్నందున కచ్చితంగా పతకం సాధించాలని అనుకుంటున్నా’ అని సుహాస్‌ పేర్కొన్నారు.

ఇక కరోనా విపత్కర పరిస్థితుల్లో అటు ఉద్యోగం, ఇటు బ్యాడ్మింటన్‌ను ఎలా సమన్వయం చేసుకున్నారని అడిగిన ప్రశ్నకు.. రెండింటిపై తనకున్న అంకితభావం, ప్రేమే సమన్వయం చేసుకొనేలా చేశాయని చెప్పారు. ఏడాదిన్నరగా పగలు వృత్తి పరమైన విధులు నిర్వర్తించేవాడినని, రాత్రి వేళ బ్యాడ్మింటన్‌ ప్రాక్టీస్‌ చేసేవాడినని నోయిడా మెజిస్ట్రేట్‌ వివరించారు. అలాగే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను తల్లిదండ్రులు పూర్తిగా ప్రోత్సహించాలని, దాంతో వారు ఏదైనా సాధించగలరని ఆయన సూచించారు. ఈ క్రమంలోనే తాను ఇప్పటివరకు ఏది సాధించినా అది తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనన్నారు. తనకు నచ్చిందల్లా చెయ్యమని ప్రోత్సహించారని, అందువల్లే తానీ స్థితిలో ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ ప్రయాణం అంత తేలిక కాకపోయినా పట్టుదలతో కృషి చేయాలని సుహాస్‌ సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని