Gautam Gambhir: కోహ్లీసేనతో పోలిస్తే పాక్‌పైనే ఒత్తిడి ఎక్కువ

తాజా వార్తలు

Published : 20/08/2021 01:39 IST

Gautam Gambhir: కోహ్లీసేనతో పోలిస్తే పాక్‌పైనే ఒత్తిడి ఎక్కువ

దిల్లీ: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాతో పోలిస్తే పాకిస్థాన్‌ పైనే విపరీతమైన ఒత్తిడి ఉంటుందని మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ అంటున్నాడు. వారితో పోలిస్తే కోహ్లీసేన ఎన్నో రెట్లు బలమైన జట్టని పేర్కొన్నాడు. రషీద్‌ఖాన్‌ సారథ్యంలోని అఫ్గానిస్థాన్‌ జట్టు సంచలనాలు సృష్టించే అవకాశం ఉందని అంచనా వేశాడు. కాగా మెగాటోర్నీలో భారత్‌ తన తొలి మ్యాచులో దాయాది పాక్‌తో తలపడుతున్న సంగతి తెలిసిందే.

‘పాకిస్థాన్‌ పైనా అంచనాలు విపరీతంగా ఉంటాయి. కానీ వారితో పోలిస్తే కోహ్లీసేన ఎన్నోరెట్లు మెరుగైన జట్టు. టీ20ల్లో ఎవర్ని ఎవరైనా ఓడించొచ్చు. ఎందుకంటే ఇది వ్యక్తిగత క్రీడ మాదిరిగానే ఉంటుంది. అందుకే ఏ జట్టునూ తక్కువ అంచనా వేయొద్దు. ఉదాహరణకు అఫ్గానిస్థాన్‌ను పసికూనగా భావించొద్దు. రషీద్‌ ఖాన్‌ వంటి ఆటగాళ్లు సంచనాలు సృష్టించగలరు. పాకిస్థాన్‌ సైతం అలాంటిదే. కానీ, వారిపై అంచనాలు అధికం’ అని గంభీర్‌ తెలిపాడు.

ఐపీఎల్‌లో ఎదిగిన అఫ్గాన్‌ ఆటగాళ్లు ఏ జట్టుకైనా షాకులు ఇవ్వగలరని గౌతీ అంటున్నాడు. ‘ఈ టోర్నీలో మీరేదైనా జట్టును అండర్‌డాగ్‌గా గుర్తించమంటే నేను అఫ్గానిస్థాన్‌ పేరే చెప్తా. అంతేకాకుండా వారి జట్టులో రషీద్‌ ఖాన్‌, ముజీబ్‌, మహ్మద్‌ నబీ వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు. వారినంత తేలిగ్గా తీసుకోలేం’ అని అన్నారు. ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌, ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికాతో కూడిన గ్రూప్‌-1లో రసవత్తరమైన పోరాటాలు చూడొచ్చని గౌతీ అంచనా వేశాడు.

‘ఇదే అసలైన గ్రూప్‌. ఇందులో నాలుగు బలమైన జట్లు ఉన్నాయి. అందుకే ప్రపంచకప్‌ ఆరంభమైన రోజు నుంచే గొప్ప పోరాటాలు ఉంటాయి. వెస్టిండీస్‌ ఎప్పుడేం చేస్తుందో చెప్పలేం. ఆ జట్టులో అంతా టీ20 స్టార్లే ఉంటారు. వారు మూడోసారి కప్‌ గెలిచినా ఆశ్చర్యం లేదు. ఇంగ్లాండ్‌కూ అలాంటి ఆటగాళ్లే ఉన్నారు. రెండు మూడేళ్లుగా వారు పరిమిత ఓవర్ల క్రికెట్లో దుమ్మురేపుతున్నారు. వన్డే ప్రపంచకప్‌ సైతం గెలిచారు. ఆస్ట్రేలియాపై ఎవరికీ అంచనాల్లేవు. కీలక ఆటగాళ్లు దూరమయ్యారు. అయితే తనదైన రోజున అది ప్రమాదకరమైన జట్టే’ అని గంభీర్‌ తెలిపాడు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని