Virat Kohli: కెప్టెన్సీపై కోహ్లీ నిర్ణయం.. బీసీసీఐ కోశాధికారి ఏమన్నారంటే?

తాజా వార్తలు

Published : 30/09/2021 01:20 IST

Virat Kohli: కెప్టెన్సీపై కోహ్లీ నిర్ణయం.. బీసీసీఐ కోశాధికారి ఏమన్నారంటే?

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ ఇటీవల అభిమానులకు, క్రికెట్‌ పండితులకు రెండు వరుస షాకులిచ్చిన సంగతి తెలిసిందే. తొలుత భారత జట్టుకు టీ20 ప్రపంచకప్‌ తర్వాత ఈ ఫార్మాట్‌ నుంచి కెప్టెన్‌గా తప్పుకొంటున్నట్లు చెప్పిన అతడు.. ఐపీఎల్‌ తర్వాత రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సారథిగానూ వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. స్వల్ప వ్యవధిలో కోహ్లీ ఇలా రెండు కీలక నిర్ణయాలు తీసుకోవడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే. అయితే, అవేంటన్నదే ఎవరికీ అంతుబట్టడం లేదు.

మరోవైపు కోహ్లీ ఇటీవలి కాలంలో బ్యాటింగ్‌లో భారీ స్కోర్లు చేయలేక ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడు బ్యాటింగ్‌పై శ్రద్ధ పెట్టేందుకు ఈ నిర్ణయాలు తీసుకొని ఉంటాడని క్రికెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. కోహ్లీ ప్రవర్తన బాగోలేదని, భారత జట్టుకు టీ20 కెప్టెన్‌గా తొలగించాలని పలువురు సీనియర్లు బీసీసీఐని కోరినట్లు వార్తలు వచ్చాయి. వీటిపై స్పందించిన కోశాధికారి అరుణ్‌ ధుమాల్‌ అలాంటిదేమీ లేదని స్పష్టం చేశాడు. కోహ్లీ జట్టును బాగా నడిపిస్తున్నాడని, అలాంటప్పుడు తామెందుకు అతడిని తప్పుకోవాలని ఒత్తిడి తెస్తామని ఎదురు ప్రశ్నించాడు. అతడిని తప్పుకోవాలని బీసీసీఐ కోరలేదని వివరించాడు. అది పూర్తిగా కోహ్లీ నిర్ణయమని పేర్కొన్నాడు.

అనంతరం మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీని పొట్టి ప్రపంచకప్‌కు మెంటార్‌గా నియమించడంపై స్పందిస్తూ.. అతడో గొప్ప సారథి అని కీర్తించాడు. అతడి సారథ్యంలో భారత్‌ మేటి జట్టుగా ఎదిగిందన్నాడు. ధోనీ కెప్టెన్సీలో టీమ్‌ఇండియా 2007 టీ20, 2011 వన్డే ప్రపంచకప్‌లు గెలిచిందని, అలాగే 2010, 2016 ఆసియా కప్‌లతో పాటు 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీ సాధించిందని గుర్తుచేశాడు. దీంతో అతడి రికార్డులన్నీ గొప్పగా ఉన్నాయన్నాడు. రాబోయే ప్రపంచకప్‌లో అతడిని మెంటార్‌గా కొనసాగించడం భారత జట్టుకు ఎంతో ఉపయోగకరమని, జట్టులోనూ ధోనీకి మంచి గౌరవం ఉందన్నాడు. మాజీ సారథిని మళ్లీ టీమ్‌ఇండియాకు తీసుకురావడం అనేది ఎవరినీ తక్కువ చేసినట్లు కాదని అరుణ్‌ ధుమాల్‌ వివరించాడు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని