Bumrah vs Anderson: బుమ్రా సారీ.. బూతులు తిట్టిన అండర్సన్‌.. అందుకే కోహ్లీసేనలో ఆ ఫైర్‌!

తాజా వార్తలు

Updated : 20/08/2021 16:17 IST

Bumrah vs Anderson: బుమ్రా సారీ.. బూతులు తిట్టిన అండర్సన్‌.. అందుకే కోహ్లీసేనలో ఆ ఫైర్‌!

లార్డ్స్‌ టెస్టులో టీమ్‌ఇండియా ఎప్పుడూ లేనంత కసిగా ఎందుకు ఆడింది? ఆంగ్లేయులు కవ్విస్తుంటే భారత ఆటగాళ్లు ఎందుకంత ఘాటుగా స్పందించారు? ఆట ఆఖరి రోజు బౌలర్లు ఎందుకంత పట్టుదల ప్రదర్శించారు? కనీసం ముఖంలో నవ్వుతున్న ఛాయలు ఎందుకు కనిపించనివ్వలేదు?

...ఎందుకంటే జస్ప్రీత్‌ బుమ్రా క్షమాపణలు నిరాకరించిన అండర్సన్‌ అతడిని పక్కకు తోసేయడమే కారణమట.

తొలి ఇన్నింగ్స్‌లో అండర్సన్‌కు బౌన్సర్లు సంధించిన జస్ప్రీత్ బుమ్రా అతడికి క్షమాపణ చెప్పాడట. కానీ, అతడి క్షమాపణను పట్టించుకోని జిమ్మీ.. పేసుగుర్రాన్ని పక్కకు తోసేసి బూతు మాటలు అన్నాడట. ఆ మాటలే టీమ్‌ఇండియా క్రికెటర్లలో అగ్నిజ్వాలను రగిలించాయని ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌.శ్రీధర్‌ తెలిపారు. సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ యూట్యూబ్‌ ఛానల్లో ఆయన ఈ విషయాలను వివరించారు.

ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఆఖరి బ్యాట్స్‌మన్‌గా జిమ్మీ అండర్సన్‌ వచ్చాడు. అప్పటికే ఆధిక్యం కోల్పోయిన టీమ్‌ఇండియా త్వరగా వికెట్లు తీయాల్సిన పరిస్థితి. దాంతో జస్ప్రీత్‌ బుమ్రా అతడికి 90 మైళ్ల వేగంతో బంతులు వేశాడు. షార్ట్‌పిచ్‌ బంతులు సంధించడంతో అవి అండర్సన్‌కు తగిలాయి.

అప్పుడు ‘బుమ్రా! ఇంత వేగంగా ఎందుకు వేస్తున్నావు? నీకు నేనిలాగే వేశానా? ఇప్పటి వరకు నువ్వు 80 మైళ్ల వేగంతో వేశావు. నన్ను చూడగానే 90 మైళ్ల వేగంతో ఎందుకు విసురుతున్నావు’ అని జిమ్మీ అన్నట్టు శ్రీధర్‌ తెలిపారు. కాగా, అండర్సన్‌ అలా మాట్లాడటం తనకు విస్మయం కలిగించిందని అశ్విన్‌ పేర్కొన్నాడు.

‘ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌ ముగియగానే కుర్రాళ్లంతా డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వచ్చేశారు. ఆ తర్వాత బుమ్రా వేగంగా వెళ్లి జిమ్మీ భుజం తట్టాడు. ఉద్దేశపూర్వకంగా బంతులు వేయలేదని వివరించాలన్నది అతడి ఉద్దేశం. బుమ్రా ఎంత మంచి వ్యక్తో మనందరికీ తెలుసు. అందుకే, ఆ వ్యవహారం అంతటితో ముగించేందుకు అతడి వద్దకు వెళ్లాడు. కానీ అండర్సన్‌ బుమ్రాను పక్కకు తోసేశాడు’ అని శ్రీధర్‌ వివరించారు.

‘అంతేకాదు, ఇతర బ్యాట్స్‌మెన్‌కు నువ్వు 85మైళ్ల వేగంతో బంతులేశావు. నాకేమో 90 మైళ్లతో వేశావు. ఇది మోసం. నేను అంగీకరించను అని అండర్సన్‌ చెప్పాడు. ఇదంతా జట్టును ఏకతాటిపైకి తీసుకొచ్చింది. అంతకు ముందు అలా లేదని కాదు. ఈ సంఘటన ప్రతి ఒక్కరిలో జ్వాలను రగిలించింది. దాని ప్రభావం ఐదోరోజు మైదానంలో కనిపించింది’ అని శ్రీధర్‌ తెలిపారు.

ఆయన మరో అరుదైన సంగతీ చెప్పారు. ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో అనధికార ఫాస్ట్‌ బౌలర్ల క్లబ్‌ ఉండేదట. బౌలర్లకు వేగంగా బంతులు వేయొద్దన్న నియమం పెట్టుకున్నారట. కాలం మారే కొద్దీ ఆ క్లబ్‌ ఆనవాళ్లు లేకుండా పోయిందని శ్రీధర్‌ చెప్పారు. ఇప్పుడెవరూ దానిని పట్టించుకోవడం లేదని, వేగంగా బంతులు విసురుతున్నారని వివరించారు.

టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో రిషభ్ పంత్‌ ఔటవ్వగానే 180 పరుగులు చేస్తే ఇంగ్లాండ్‌ను ఇబ్బంది పెట్టొచ్చని కోచ్‌ రవిశాస్త్రి తనకు చెప్పారని శ్రీధర్‌ తెలిపారు. సాధారణంగా వారమంతా ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ చేసే శాస్త్రి ఆ రోజు ఉదయమే భోజనం చేసి ఆత్రుతగా కూర్చుకున్నారట. ఇక బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాఠోడ్‌ అయితే విపరీతంగా బాధపడిపోయారట. ‘ఐదు రోజులు ఎంతో కష్టపడి బంతులు విసిరాను. బౌలర్లు కనీసం 30 పరుగులైనా చేయకుంటే ఎలా? శ్రీ (శ్రీధర్‌) నువ్వూ విసిరావు కదా’ అని ఆవేదన చెందాడట. కానీ బుమ్రా, షమి అద్భుతం చేయడంతో ఆనందంలో తేలిపోయాడట. వారు డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి తిరిగొచ్చేటప్పుడు చరిత్రలో నిలిచిపోయేలా చప్పట్లు కొట్టాలని విరాట్‌ కోహ్లీ జట్టు సభ్యులను ఆదేశించినట్లు శ్రీధర్‌ వివరించారు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని