Mirabai chanu: లాక్‌డౌన్‌ వల్ల వెన్నునొప్పి..  ఈసారీ ఇంటివద్ద 10 రోజులే ఉంటా!

తాజా వార్తలు

Published : 27/07/2021 14:15 IST

Mirabai chanu: లాక్‌డౌన్‌ వల్ల వెన్నునొప్పి..  ఈసారీ ఇంటివద్ద 10 రోజులే ఉంటా!

ముంబయి: విశ్రాంతి ఎరగక సాధన చేయడం.. ఐదేళ్లు కుటుంబానికి దూరమవ్వడం.. కఠిన ఆహార పద్ధతులు పాటించడం.. నిరంతర కఠోర శిక్షణకు తగిన ఫలితం లభించింది. ఒలింపిక్స్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను రజత పతకం గెలిచింది. కొవిడ్‌ మహమ్మారి వల్ల గతేడాది విధించిన లాక్‌డౌన్‌ వల్ల ఇబ్బందులు పడ్డానని చాను చెబుతోంది. విశ్రాంతి తీసుకోవడంతో కండరాలు పట్టేసేవని వెల్లడించింది.

‘లాక్‌డౌన్‌ తర్వాత సాధన మొదలు పెట్టాను. నా వీపుభాగం పట్టేసినట్టు అయ్యేది. కుడి భుజానికి సమస్య వచ్చింది. గాయం కాదు గానీ ఎక్కువ బరువులు ఎత్తినప్పుడు కండరాలు పట్టేసేవి. లాక్‌డౌన్‌లో విశ్రాంతి తీసుకోవడం వల్లే అలా జరిగింది. భుజం సమస్య వల్ల స్నాచ్‌ సరిగా చేయలేకపోయాను. అమెరికాకు వెళ్లి చికిత్స తీసుకోవాల్సి వచ్చింది’ అని చాను తెలిపింది.

‘అందుకే మేం అమెరికా వెళ్లాం. మాజీ వెయిట్‌ లిఫ్టర్‌, ఫిజియో థెరపిస్టు, డాక్టర్‌ ఆరోన్‌ హార్స్‌చిగ్‌ వద్దకు వెళ్లడం లాభం చేకూర్చింది. ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో ప్రపంచ రికార్డు సాధించగలిగాను. కండరాల మధ్య సమతూకం లేదు. అందుకే, బరువులు ఎత్తగానే నొప్పి వచ్చేది. డాక్టర్‌ కొన్ని కసరత్తులు సూచించారు. అవి ఉపయోగపడ్డాయి’ అని చాను వెల్లడించింది.

కండరాల సమస్యే కాదు 2017లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌, 2018లో కామన్వెల్త్‌లో స్వర్ణాలు గెలిచాకా ఆమె వెన్నెముక దిగువభాగంలో నొప్పితో బాధపడింది. దాంతో 2018 ఆసియా క్రీడలు ఆడలేదు. కోలుకున్న తర్వాత పునరాగమనం చేసింది. తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనను మరింత మెరుగు పర్చుకోవడంపై దృష్టి పెట్టింది.

‘ఒలింపిక్స్‌ వాయిదా పడితే ఎన్నో ఇబ్బందులు వస్తాయి. తక్కువ సమయంలోనే ఎన్నో మార్పులు చోటు చేసుకొంటాయి. ఒకదాని తర్వాత ఒక సమస్య రావడం చూశాను’ అని చాను తెలిపింది. ఐదేళ్లలో ఇంటి వద్ద గడిపింది పది రోజులేననీ, ఇప్పుడూ ఇంటి వద్ద ఎక్కువ రోజులేం ఉండనని పేర్కొంది. పది రోజులు ఉండి కామన్వెల్త్‌ అర్హత పోటీలకు సిద్ధమవుతానని వెల్లడించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని