INDvsSL: ఈ అవకాశాన్ని వినియోగించుకుంటా

తాజా వార్తలు

Updated : 15/07/2021 14:29 IST

INDvsSL: ఈ అవకాశాన్ని వినియోగించుకుంటా

ఇంటర్నెట్‌ డెస్క్‌: శ్రీలంకతో ఆడే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మన్‌ పృథ్వీషా ఆశాభావం వ్యక్తం చేశాడు. లంకతో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌ కోసం శిఖర్‌ ధావన్‌ నేతృత్వంలో 20 మంది ఆటగాళ్ల బృందం అక్కడికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడిన పృథ్వీ... చాలా రోజుల తర్వాత తనకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ఆలోచనల్లో ఉన్నట్లు చెప్పాడు.

‘నన్నడిగితే కచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత నాకీ అవకాశం దక్కింది. ఇప్పుడు నా మదిలో ఇదొక్కటే ఉంది. నేనెప్పుడూ ఏ జట్టుతో ఆడినా దానికే తొలి ప్రాధాన్యం ఇస్తా. ఈసారి కూడా కచ్చితంగా భారత జట్టును గెలిపించాలనుకుంటున్నా’ అని యువ బ్యాట్స్‌మన్‌ చెప్పుకొచ్చాడు. అనంతరం శిఖర్‌ ధావన్‌తో ఉన్న అనుబంధంపై స్పందిస్తూ.. ‘మేమిద్దరం దిల్లీ క్యాపిటల్స్‌కు ఓపెనింగ్‌ చెయ్యకముందు నుంచే మంచి స్నేహితులం. తర్వాత మా అనుబంధం మరింత మెరుగైంది. మ్యాచ్‌లు లేనప్పుడు బయట కూడా కలిసిమెలిసి ఉంటాం. ఎప్పుడూ క్రికెట్‌ గురించి మాట్లాడుకుంటాం. అతడితో కలిసి బ్యాటింగ్‌ చేయడం బాగుంటుంది’ అని పృథ్వీ పేర్కొన్నాడు.

ఈ యువ బ్యాట్స్‌మన్‌ గతేడాది న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో, తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో అడిలైడ్‌ టెస్టులో విఫలమయ్యాక టీమ్‌ఇండియా పక్కనపెట్టింది. ఈ క్రమంలోనే తన ఆటను మెరుగుపర్చుకున్న పృథ్వీ.. ఆపై దేశవాళీ క్రికెట్‌లో రాణించాడు. ఈ ఏడాది జరిగిన విజయ్‌ హజారే ట్రోఫీలో 800కు పైగా పరుగులు సాధించి కొత్త రికార్డు నెలకొల్పాడు. అనంతరం కరోనా వైరస్‌ కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయిన ఐపీఎల్‌ 14వ సీజన్‌లో తన బ్యాట్‌తో అలరించాడు. ఈ నేపథ్యంలోనే సెలెక్టర్లు అతడిని ప్రపంచటెస్టు ఛాంపియన్‌షిప్‌తో పాటు ఇంగ్లాండ్‌ పర్యటనకు ఎంపిక చేస్తారని భావించినా అలా చెయ్యకుండా శ్రీలంక పర్యటనకు ఎంపిక చేశారు. ఇప్పుడు పృథ్వీ అక్కడ రాణించి జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకోవాలని చూస్తున్నాడు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని