Pakistan Cricket: కివీస్, ఇంగ్లాండ్‌లపై ప్రతీకారం తీర్చుకోండి

తాజా వార్తలు

Published : 22/09/2021 07:51 IST

Pakistan Cricket: కివీస్, ఇంగ్లాండ్‌లపై ప్రతీకారం తీర్చుకోండి

పాకిస్థాన్‌ జట్టుకు పీసీబీ ఛైర్మన్‌ రమీజ్‌ పిలుపు

ఇస్లామాబాద్‌: న్యూజిలాండ్‌ బాటలో ఇంగ్లాండ్‌ కూడా తమ దేశ పర్యటన నుంచి తప్పుకోవడం పట్ల పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు కొత్త ఛైర్మన్‌ రమీజ్‌ రజా తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ఇకపై ఈ జట్లను ముద్దు చేయడం మానుకుని, పాకిస్థాన్‌ స్వప్రయోజనాలు చూసుకోవాలని అతనన్నాడు. రాబోయే టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ను ఓడించడమే ఇప్పటిదాకా పాక్‌ ప్రధాన లక్ష్యమని, కానీ ఇప్పుడు తమ జట్టు కసిగా ఆడి న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌లనూ ఓడించాలని రమీజ్‌ పిలుపునిచ్చాడు. ‘‘ఇంగ్లాండ్‌ కూడా పాక్‌ పర్యటనను రద్దు చేసుకోవడం నన్ను తీవ్ర నిరాశకు గురి చేసింది. కానీ ఇది ఊహించిందే. దురదృష్టవశాత్తూ ఇలాంటి పరిస్థితుల్లో పాశ్చాత్య దేశాలు ఒకదానికి ఒకటి మద్దతుగా నిలుస్తాయి. ముందుగా తమకు తలెత్తిన ముప్పు గురించి ఏ సమాచారం పంచుకోకుండానే న్యూజిలాండ్‌ వెళ్లిపోవడం మాకు ఆగ్రహం తెప్పించింది. ఇప్పుడు ఇంగ్లాండ్‌ తమ నిర్ణయాన్ని వెలువరించింది. ఈ జట్లు వచ్చినపుడు బాగా ముద్దు చేసే మాకు ఇదో గుణపాఠం. ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా మా దేశ పర్యటనపై పునరాలోచిస్తోంది. వెస్టిండీస్‌ జట్టు పర్యటన మీదా ఈ పరిణామాలు ప్రభావం చూపొచ్చు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌.. ఇవన్నీ ఒకే సమూహంలో ఉంటాయి. మరి మేమెవరికి ఫిర్యాదు చేయాలి. తమకు మంచి చేయని న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌లను ఓడించి వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి పాకిస్థాన్‌ జట్టు శారీరకంగా, మానసికంగా సిద్ధమవ్వాలి’’ అని రమీజ్‌ అన్నాడు. న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌ సిరీస్‌ల స్థానంలో తమతో ఆడేందుకు జింబాబ్వే సిద్ధంగా ఉందని.. శ్రీలంక, బంగ్లాదేశ్‌ కూడా జట్లను పంపడానికి సుముఖత వ్యక్తం చేశాయని.. కానీ ఈ సిరీస్‌లను సర్దుబాటు చేయడానికి ఇబ్బందులున్నాయని రమీజ్‌ తెలిపాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని