T20 World Cup: ‘బ్లాక్‌ లైవ్స్ మ్యాటర్‌’ వివాదానికి డికాక్‌ క్షమాపణలు

తాజా వార్తలు

Updated : 28/10/2021 16:39 IST

T20 World Cup: ‘బ్లాక్‌ లైవ్స్ మ్యాటర్‌’ వివాదానికి డికాక్‌ క్షమాపణలు

ఇంటర్నెట్‌డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ ఉద్యమానికి మోకాళ్లపై కూర్చొని ఎందుకు సంఘీభావం తెలపలేదో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌ క్వింటన్‌ డికాక్‌ వివరణ ఇచ్చాడు. తన హక్కులు హరించుకుపోతున్నాయనే కారణంతోనే ఇలా చేశానని చెప్పాడు. ఈ క్రమంలోనే తనపై ‘రేసిస్ట్‌’ అనే ముద్ర పడటం బాధగా ఉందన్నాడు. అలాగే తన చర్యతో ఎవరి మనోభావాలైన దెబ్బతీస్తే క్షమాపణలు చెబుతున్నానని చెప్పాడు. ఇకపై జరిగే మ్యాచ్‌ల్లో జట్టు ఆదేశాలకు అనుగుణంగా ఉంటానని, ఆటగాళ్లు, బోర్డు యాజమాన్యం అనుమతిస్తే తిరిగి మ్యాచ్‌లు ఆడతానని తెలిపాడు. అసలేం జరిగిందంటే.. టీ20 ప్రపంచకప్‌లో ఇటీవల దక్షిణాఫ్రికా ఆడిన ఓ మ్యాచ్‌లో కెప్టెన్‌ తెంబా బవుమాతో సహా కొందరు ఆటగాళ్లు ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ ఉద్యమానికి సంఘీభావంగా మైదానంలో మోకాళ్లపై కూర్చుంటే.. డికాక్‌ మాత్రం చూస్తూ నిలబడ్డాడు. మరికొందరు భిన్నమైన సంజ్ఞలు చేశారు. ఆటగాళ్లు ఎవరికి వారన్నట్లు వ్యవహరిస్తే చెడు సంకేతాలు వెళ్తాయన్న ఉద్దేశంతో విండీస్‌తో మ్యాచ్‌కు ముందు అందరూ ఒకే తరహాలో సంఘీభావం తెలపాలని ఆ దేశ క్రికెట్‌ బోర్డు ఆదేశించింది. అయితే, అప్పటికే ఇతర విషయాల పట్ల అసంతృప్తితో ఉన్న డికాక్‌ బోర్డు ఆదేశాలను నిరాకరించి విండీస్‌ మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో అతడిపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

ఈ నేపథ్యంలోనే సామాజిక మాధ్యమాల్లో స్పందించిన డికాక్‌ తన వివరణ ఇచ్చాడు. బుధవారం రాత్రి జట్టు యాజమాన్యంతో మాట్లాడానని, వారి ఆదేశాలపై ఇప్పుడు తనకు పూర్తి అవగాహన కలిగిందని చెప్పాడు. మోకాళ్లపై నిల్చొని ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’కు మద్దతు తెలపడంలో తనకు అభ్యంతరం లేదన్నాడు. అయితే, మంగళవారం జట్టు యాజమాన్యం అనూహ్యంగా ఆటగాళ్లందర్నీ కచ్చితంగా మోకాళ్లపై నిల్చొని సంఘీభావం తెలపాలని చెప్పినప్పుడు తన హక్కులను లాక్కున్నట్టు భావించానని వివరించాడు. ‘నేను జట్టు ఆటగాళ్లకు, దేశ ప్రజలకు, అభిమానులకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నా. ఎప్పుడూ నా పేరు వివాదాస్పదం అవ్వాలనుకోలేదు. జాత్యాహంకార విషయాలకు వ్యతిరేకంగా నిలబడటం ఎంత అవసరమో నేను అర్థం చేసుకుంటాను. అలాగే ఆటగాళ్లుగా ఇది మా బాధ్యత అని కూడా తెలుసు. నేను మోకాళ్లపై నిల్చొని ఈ ఉద్యమానికి సంఘీభావం తెలపడం ద్వారా ప్రజల జీవితాలు మెరుగవుతాయంటే.. అంతకుమించిన సంతోషం మరొకటి లేదు. వెస్టిండీస్‌తో మ్యాచ్‌ ఆడకపోవడం ద్వారా నేనెవర్నీ కించపర్చాలనుకోలేదు. ముఖ్యంగా ఆ జట్టు ఆటగాళ్లను కూడా. అయితే, మాకు ఈ ఆదేశాలు మంగళవారం ఉదయమే హఠాత్తుగా చెప్పడంతో గందరగోళపరిస్థితులు నెలకొన్నాయి. అది కొందరు అర్థం చేసుకోలేకపోయారు. నా చర్యతో ఎవరినైనా ఇబ్బందులకు గురి చేస్తే నన్ను క్షమించండి. ఇప్పటివరకూ ఈ విషయంపై మౌనంగా ఉన్నా. కానీ, నా బాధేంటో మీతో పంచుకోవాలని మీముందుకు వచ్చా’ అని డికాక్‌ ఓ ప్రకటనలో తెలిపాడు.

‘అలాగే కొంతమందికి నేను ఎలాంటి కుటుంబం నుంచి వచ్చానో కూడా తెలియదు. మాది రెండు వర్ణాలు కలగలిసిన కుటుంబం. అలాంటప్పుడు ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ అనేది నాకు పుట్టినప్పటి నుంచీ ఉన్న విషయమే. ఏ ఒక్కరి వ్యక్తిగత హక్కులకన్నా ప్రజలందరి హక్కులు, సమానత్వమే ముఖ్యమైన విషయం. నేను చిన్నప్పటి నుంచీ ప్రతి ఒక్కరికి హక్కులు ఉంటాయని, అవి ముఖ్యమైనవనే నమ్మకంతో పెరిగాను. అందువల్లే వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు ముందు మాకు అలా మోకాళ్లపై నిల్చొని సంఘీభావం తెలపాలని కచ్చితంగా చెప్పినప్పుడు నా హక్కులు పోయినట్టు భావించాను. ఈ క్రమంలోనే గతరాత్రి జట్టు యాజమాన్యంతో సమావేశమైనప్పుడు వాళ్ల మనోభావాలు ఏంటో అర్థమయ్యాయి. ఈ విషయం మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు కాకుండా అంతకుముందే చెప్పి ఉంటే ఇలాంటి పరిస్థితులు వచ్చేవి కావు. ఇప్పుడు నేను ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’కు పూర్తి మద్దతు తెలిపి ఆదర్శంగా నిలవాలని నాకు తెలుసు. అయితే, ఈ ఉద్యమానికి సంబంధించి మాకు ఇంతకుముందు ఇష్టమైన విధంగా సంఘీభావం తెలపొచ్చనే సందేశం ఇచ్చారు. నేను దేశం తరఫున ఆడటం గర్వంగా భావిస్తాను. ఒకవేళ నేను రేసిస్ట్‌ అయితే, నాకు ఇష్టం లేకున్నా మోకాళ్లపై నిల్చొని మోసపూరితంగా ఆ ఉద్యమానికి చేటు చేసేవాడిని. అలా చేయడం తప్పు. కానీ, నేను అలా చేయలేదు. నేను ఎలాంటి వాడినో నాతో కలిసి ఆడినవారికి తెలుసు’ అని దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌ వాపోయాడు.

‘అలాగే ఒక ఆటగాడిగా నన్ను చాలా మాటలు అన్నారు. అవన్నీ ఎప్పుడూ బాధపెట్టలేదు. కానీ, ఇప్పుడు అపార్ధంతో జరిగిన ఈ సంఘటన వల్ల ‘రేసిస్ట్‌’ అనే ముద్ర వేశారు. అది నన్ను ఎంతగానో కలచివేసింది. ఇది నన్నే కాకుండా నా కుటుంబాన్ని కూడా బాధ పెట్టింది. నేను జాత్యహంకారిని కాదు. ఆ విషయం నా మనస్సాక్షికి, నాతో ఆడిన ఆటగాళ్లకు తెలుసు. నా మాటలు అంత ప్రభావవంతంగా ఉండవని తెలుసు కానీ, నా ఉద్దేశం ఏమిటో మీకు చెప్పాలని ప్రయత్నించాను. మీ అందరికీ మరోసారి క్షమాపణలు చెబుతున్నా’ అని డికాక్‌ విచారం వ్యక్తం చేశాడు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని