Virat Kohli: టీ20ల్లో తిరుగులేని కోహ్లీసేన

తాజా వార్తలు

Updated : 17/09/2021 17:29 IST

Virat Kohli: టీ20ల్లో తిరుగులేని కోహ్లీసేన

మహేంద్రసింగ్‌ ధోనీ కన్నా విరాట్‌కే మెరుగైన రికార్డు..

ఇంటర్నెట్‌డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌ తర్వాత ఈ ఫార్మాట్‌ నుంచి కెప్టెన్‌గా తప్పుకొంటానని టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ గురువారం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అతడి నిర్ణయం వెనుక బలమైన కారణాలున్నా.. పనిభారం తగ్గించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. కానీ, ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును ఇప్పటివరకూ ఒక్కసారి విజేతగా నిలపలేని అతడు అంతర్జాతీయ క్రికెట్‌లోనూ టీమ్‌ఇండియాకు ఒక్క ఐసీసీ ట్రోఫీ అందించలేదు. ఈ నేపథ్యంలోనే కోహ్లీ కెప్టెన్సీపై చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. పొట్టి ఫార్మాట్‌ నుంచి అతడిని తొలగించాలనే డిమాండ్లు అప్పుడప్పుడు బలంగా వినిపించాయి. ఈ క్రమంలోనే తాజాగా అలాంటి వార్తలే వచ్చాయి. అయితే.. బీసీసీఐ వాటిని ఖండించిన రెండు రోజులకే కోహ్లీ ఈ నిర్ణయం ప్రకటించడం గమనార్హం.

ఆ విషయం పక్కనపెడితే అందరూ కోహ్లీ మెగా ట్రోఫీలు సాధించలేదనే అంటున్నారు తప్ప నాయకుడిగా అతడు సాధించిన విజయాల గురించి చర్చించడం లేదు. ముఖ్యంగా టెస్టుల్లో చారిత్రక విజయాలు సాధించిన కోహ్లీ టీ20 క్రికెట్‌లోనూ భారత్‌కు అపురూప విజయాలు అందించాడు. ఈ క్రమంలోనే అతడు SENA దేశాలతో(దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా) పాటు శ్రీలంక, వెస్టిండీస్‌ గడ్డలపైనా పొట్టి సిరీస్‌లు గెలుపొందాడు. మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ 72 టీ20ల్లో 41 విజయాలు సాధించి 59.28 విజయ శాతంతో కొనసాగుతుండగా.. కోహ్లీ 45 మ్యాచ్‌ల్లో 27 విజయాలతో 65.11 విజయశాతంతో నిలిచాడు. దీంతో ధోనీ కన్నా కోహ్లీనే మెరుగైన గణాంకాలు నమోదు చేశాడు. ఇకపోతే రాబోయే టీ20 ప్రపంచకప్ తర్వాత కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకొంటున్న నేపథ్యంలో ఇప్పటివరకు అతడి సారథ్యంలో భారత్‌ విదేశాల్లో టీ20 కప్పులు సాధించిన సందర్భాలు తెలుసుకుందాం.

శ్రీలంకను ఊడ్చేసి..

2017లో ధోనీ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా తప్పుకొన్నాక కోహ్లీ ఆ బాధ్యతలు చేపట్టాడు. ఈ క్రమంలోనే ఆ ఏడాది జులైలో శ్రీలంక పర్యటనకు వెళ్లింది టీమ్‌ఇండియా. అక్కడ తొలుత టెస్టు, వన్డే సిరీస్‌లు గెలుపొందిన కోహ్లీసేన తర్వాత ఆడిన ఏకైక టీ20లోనూ విజయబావుటా ఎగురవేసింది. దీంతో టీమ్‌ఇండియా ఆ పర్యటనలో ఆతిథ్య జట్టును ఊడ్చి పడేసింది.

దక్షిణాఫ్రికాను చిత్తుచేసి..

ఇక 2018 ఆరంభంలోనే దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన టీమ్‌ఇండియా అక్కడ టెస్టు సిరీస్‌ కోల్పోయి, వన్డే సిరీస్‌ సాధించింది. ఆపై మూడు టీ20ల సిరీస్‌లోనూ జయకేతనం ఎగురవేసిన కోహ్లీసేన రెండోసారి విదేశాల్లో పొట్టి కప్పు సాధించింది. ఇక్కడ తొలి టీ20, మూడో టీ20లో గెలుపొంది 2-1తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంది. దీంతో ఆతిథ్య జట్టును చిత్తు చేసింది.

ఇంగ్లాండ్‌లో అదరగొట్టి..

దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం టీమ్‌ఇండియా జులైలో ఇంగ్లాండ్‌తో సుదీర్ఘ పర్యటనకు వెళ్లింది. తొలుత టీ20 సిరీస్‌లో మెరిసిన కోహ్లీసేన తర్వాత వన్డే, టెస్టు సిరీస్‌లో ఓటమిపాలైంది. అయినా, పొట్టి ఫార్మాట్‌లో అప్పటికి బలంగా ఉన్న ఇంగ్లాండ్‌ను సొంతగడ్డపైనే ఓడించడం విశేషం. తొలి టీ20 టీమ్‌ఇండియా కైవసం చేసుకోగా రెండోది ఆతిథ్య జట్టు గెలుపొందింది. ఈ క్రమంలోనే రసవత్తరమైన మూడో పోరులో గెలుపొందిన కోహ్లీసేన 2-1 తేడాతో సిరీస్‌ నెగ్గింది.

విండీస్‌ను వైట్‌వాష్‌ చేసి..

2019 వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా సెమీస్‌ నుంచి నిష్క్రమించిన తర్వాత వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లింది. అక్కడ ఆ జట్టును అన్ని ఫార్మాట్లలో ఓడించిన కోహ్లీసేన వైట్‌వాష్‌ చేసింది. తొలుత టీ20 సిరీస్‌లోనే జయకేతనం ఎగుర వేసిన భారత్‌ తర్వాత వన్డే, టెస్టుల్లోనూ కరీబియన్‌ జట్టును ఓడించింది. ఈ పర్యటనలో భారత్‌ ఒక్క మ్యాచ్‌ కూడా ఓడకపోవడం విశేషం.

న్యూజిలాండ్‌ను దడదడలాడించి..

కరోనా వైరస్‌ విజృంభణకు ముందు టీమ్‌ఇండియా చేసిన ఆఖరి పర్యటన న్యూజిలాండ్‌లోనిది. అక్కడ మొదట ఐదు టీ20ల సిరీస్‌ జరగ్గా కోహ్లీసేనే 5-0 తేడాతో కివీస్‌ను ఓడించి దడదడలాడించింది. ఇందులో మూడు, నాలుగు మ్యాచ్‌లు టైగా మారినా సూపర్‌ ఓవర్లో భారత్ విజయం సాధించింది. అయితే, తర్వాత గొప్పగా పుంజుకున్న న్యూజిలాండ్‌ వన్డే, టెస్టు సిరీస్‌ల్లో విజయం సాధించింది.

ఆస్ట్రేలియాను కంగు తినిపించి..

చివరగా గతేడాది ఆఖర్లో కోహ్లీ సారథ్యంలో టీమ్‌ఇండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. అక్కడ కూడా 2-1 తేడాతో టీ20 సిరీస్‌ కైవసం చేసుకుంది. దీంతో SENA దేశాల్లో ఈ ఘనత సాధించిన జట్టుగా కోహ్లీసేన కొత్త రికార్డు నెలకొల్పింది. తొలుత వన్డే సిరీస్‌ కోల్పోయిన భారత్‌ తర్వాత టీ20, టెస్టు సిరీస్‌లను 2-1తేడాతో సొంతం చేసుకొని చరిత్ర సృష్టించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని