PAK vs NZ: మమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నారు.. ఒక్క అవకాశం ఇవ్వండి: వసీమ్‌ అక్రమ్

తాజా వార్తలు

Published : 20/09/2021 01:48 IST

PAK vs NZ: మమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నారు.. ఒక్క అవకాశం ఇవ్వండి: వసీమ్‌ అక్రమ్

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచం తమ భద్రతా బలగాలను తక్కువ అంచనా వేస్తోందని, క్రికెట్‌ అంటే తమకు ఆటకన్నా ఎక్కువని పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ వసీమ్‌ అక్రమ్‌ అన్నాడు. తాజాగా న్యూజిలాండ్‌ క్రికెట్‌ టీమ్‌ భద్రతా కారణాల రీత్యా పాకిస్థాన్‌ పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకొని తిరిగి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. పాక్‌ జట్టుతో మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు కివీస్‌ జట్టు కొద్ది రోజుల క్రితం రావల్పిండికి వచ్చి ఓ హోటల్‌లో బసచేసింది. అయితే, శుక్రవారం ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరగాల్సి ఉండగా మ్యాచ్‌ నిర్ణీత సమయానికి కూడా ఇరు జట్ల ఆటగాళ్లు మైదానానికి చేరుకోలేదు. ఈ క్రమంలోనే భద్రతా కారణాలతో న్యూజిలాండ్‌ తమ పర్యటనను రద్దు చేసుకొని తిరిగి వెళ్లిపోతున్నట్లు ప్రకటించింది. దీనిపై పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డుతో సహా ఆ జట్టు మాజీలు, ఆటగాళ్లు తీవ్రంగా స్పందించారు. సామాజిక మాధ్యమాల్లో న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డును దుమ్మెత్తిపోశారు.

తాజాగా అక్రమ్‌ కూడా స్పందించాడు. కివీస్‌ జట్టు ఈ పర్యటనను రద్దు చేసుకోవడం తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని, అంతర్జాతీయ మ్యాచ్‌ల కోసం తమ భద్రతా ఏర్పాట్లు అత్యున్నత స్థాయిలో ఉన్నాయని ట్వీట్‌ చేశాడు. పాకిస్థాన్‌ ఈ విషయాన్ని ఇదివరకే నిరూపించుకుందని, ఇప్పుడు క్రికెట్ ఆడటానికి తమ దేశం ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన ప్రదేశాలలో ఒకటిగా నిలిచిందని పేర్కొన్నాడు. కాగా, ఆదివారం మరో ట్వీట్‌ చేసిన అక్రమ్‌.. ప్రపంచం తమ భద్రతా బలగాలను తక్కువ అంచనా వేస్తోందని, తమకు క్రికెట్‌ అనేది ఆటకన్నా ఎక్కువని చెప్పాడు. తమ దేశం నుంచి క్రికెట్‌ తరలిపోకుండా ఏదైనా చేస్తామని, దాన్ని నిరూపించుకునేందుకు తమకో అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశాడు. ఇదిలా ఉండగా, పాకిస్థాన్‌ను వీడిన న్యూజిలాండ్‌ జట్టు ప్రస్తుతం దుబాయ్‌లో బస చేస్తోంది. అక్కడి నుంచి వాళ్లు త్వరలోనే తమ స్వదేశానికి బయలుదేరనున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని