Tokyo olympics : గుండె కోతను మించిన బాధ.. పతకం చేజార్చుకున్న అదితి! ఒక్క స్ట్రోక్‌తో మారిపోయిన ఆధిక్యం

తాజా వార్తలు

Updated : 07/08/2021 11:40 IST

Tokyo olympics : గుండె కోతను మించిన బాధ.. పతకం చేజార్చుకున్న అదితి! ఒక్క స్ట్రోక్‌తో మారిపోయిన ఆధిక్యం

గుండె కోత అంటే ఇదేనేమో! గుండె పగిలేంత బాధ ఎలాగుంటుందో ఆమెకు మాత్రమే తెలుసేమో! మిల్కా సింగ్‌ 0.01 సెకన్లలో పతకం కోల్పోవడం గుండెల్ని ఎలా మెలిపెట్టేసిందో ఈ తరంలో ఎవరికీ తెలియదు! దానిని వర్ణించడమూ కష్టం. కానీ భారత యువ గోల్ఫర్‌ అదితి అశోక్‌ కేవలం ఒకే ఒక్క స్ట్రోక్‌తో పతకం చేజార్చుకోవడం చూస్తుంటే ఆ 0.01 సెకన్లే గుర్తొస్తోంది!!

నిజానికి అదితి అశోక్‌ అంటే దేశంలో 90% జనాభాకు తెలియనే తెలియదు. గోల్ఫ్‌లో ఇద్దరమ్మాయిలు ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతే వారు ఎరగరు. కానీ 23 ఏళ్ల అదితి ఇప్పుడు భారతీయులందరికీ ముఖ్య అతిథిగా మారిపోయింది. వ్యక్తిగత స్ట్రోక్‌ప్లేలో ఆమె చూపించిన తెగువ ఇప్పుడు అందరికీ చిరపరిచితం.

అదితి ర్యాంకు 200. అలాంటిది ప్రపంచ నంబర్‌ వన్‌ సహా టాప్‌-10లోని క్రీడాకారిణులకు ఆమె భారీ షాకులిచ్చింది. అంచనాలను తలదన్ని నాలుగో స్థానంలో నిలిచింది. ఎవరూ ఉహించని గోల్ఫ్‌లో పతకంపై ఆశలు రేపింది. నిజానికి ఆమె గెలిచినంత పనిచేసింది.

వ్యక్తిగత స్ట్రోక్‌ప్లేలో మూడో రౌండ్‌ ముగిసే సరికి అదితి 201 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. నాలుగో రౌండ్లో అదే ప్రదర్శన పునరావృతం చేస్తే ఆమె చరిత్ర సృష్టించేదే. శనివారం ఆమె ఏదో ఒక పతకం సాధిస్తుందనే అంతా అనుకున్నారు. నేడు తుపాను హెచ్చరికలతో ఆట నిలిపేసే సమయానికి లిడియా కో (కివీస్‌)తో కలిసి అదితి ఉమ్మడిగా మూడో స్థానంలో నిలిచింది. అప్పటికి మరో రెండు హోల్స్‌ మాత్రమే మిగిలున్నాయి.

తుపాను ప్రభావం ఇలాగే ఉండి ఆట జరగదనే అంతా భావించారు! అలా జరిగితే మూడో రౌండ్‌ వరకే లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. అలాంటప్పుడు అదితికి రజతం వస్తుందని మురిసిపోయారు! కానీ వర్షం, ఉరుములు, మెరుపులు, గాలి దుమారం ఆగిపోవడంతో ఆట మళ్లీ మొదలైంది. నాలుగో రౌండ్లో అదితి ఐదు బర్డీస్‌ సాధించింది. 5, 6, 8, 13, 14 హోల్స్‌ను నిర్దేశిత స్ట్రోక్స్‌ కన్నా ముందే పూర్తి చేసింది. 9, 11వ హోల్స్‌కు మాత్రం బోగీస్‌ ఎదురయ్యాయి. అంటే నిర్దేశిత స్ట్రోక్స్‌ కన్నా ఎక్కువ తీసుకుంది.

నాలుగో రౌండ్లో ఆమె 3 అండర్‌ 68 సాధించగా కాంస్యం గెలిచిన లిడియా కో 6 అండర్‌ 65తో నిలిచింది. అంటే ఆటను 71 స్ట్రోక్స్‌లో ముగించే బదులు 6 తక్కువ స్ట్రోక్స్‌తో ముగించింది. దాంతో మొత్తంగా అదితి 15 అండర్‌ 269 సాధించగా లిడియా 16 అండర్‌ 268 సాధించింది. కేవలం ఒకే ఒక్క స్ట్రోక్‌.. ఒకే ఒక్క బర్డీ అదితికి కలిసొచ్చి ఉంటే ఆమె సరికొత్త చరిత్ర సృష్టించేది.

అదితి రియో ఒలింపిక్స్‌లో ఉమ్మడిగా 41వ స్థానంలో నిలిచింది. కానీ టోక్యోలో ఏకంగా నాలుగో స్థానానికి మెరుగైంది. కరోనా మహమ్మారి వల్ల టోర్నీలు ఎక్కువగా జరగకున్నా.. విదేశాలకు ప్రయాణించే అవకాశం లేకున్నా.. ఈ బెంగళూరు అమ్మాయి అద్భుతమే చేసింది. సంప్రదాయ క్రీడల్లోనే కాదు భారతదేశం సరికొత్త, వినూత్నమైన ఆటల్లోనూ రాణించగలదని నిరూపించింది. ఎప్పుడూ చెప్పే మాటే అయినా.. ఆమె పతకాన్ని మించే సాధించింది!!


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని