T20 World Cup: టీమిండియాలోని ఆ ఇద్దరితో మాత్రం జాగ్రత్త: పాక్ బ్యాటింగ్ కన్సల్టెంట్

తాజా వార్తలు

Published : 21/10/2021 23:45 IST

T20 World Cup: టీమిండియాలోని ఆ ఇద్దరితో మాత్రం జాగ్రత్త: పాక్ బ్యాటింగ్ కన్సల్టెంట్

ఇంటర్నెట్డెస్క్‌: భారత్, పాకిస్థాన్‌ క్రికెట్ మ్యాచ్‌ అంటే ఇరు దేశాల అభిమానులకే కాదు.. యావత్‌ క్రికెట్‌ క్రీడాభిమానులకు ఆసక్తి ఉంటుంది. ప్రపంచకప్‌ మ్యాచుల రికార్డుల్లో పాక్‌పై టీమిండియాదే హవా. మరి టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఈ నెల 24న దుబాయ్‌ వేదికగా జరగనున్న మ్యాచ్‌లో ఎవరు విజయం సాధిస్తారనే దానిపై విశ్లేషకులు, మాజీ క్రికెటర్లు తమ విశ్లేషణలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో భారత్‌, పాక్‌ మ్యాచ్‌పై ఆసీస్‌ మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్‌ స్పందించాడు. ఆయన ప్రస్తుతం పాకిస్థాన్‌ బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్నాడు.

నాయకత్వమే కీలకం

టీమిండియా, పాక్‌ జట్ల మధ్య పోరు ఎంతో ఉత్కంఠగా ఉంటుందని హేడెన్‌ అన్నాడు. ఇలాంటి పెద్ద మ్యాచ్‌లో చిన్న తప్పిదాలే పెను ప్రమాదమవుతాయన్నాడు. అయితే నాయకత్వమే ఇక్కడ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పాడు. ఐపీఎల్‌లో సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ, కేకేఆర్‌ సారథి ఇయాన్‌ మోర్గాన్‌ను దీనికి ఉదాహరణగా పేర్కొన్నాడు. ‘‘వారిద్దరి వ్యక్తిగత ప్రదర్శన సరిగా లేకపోయినా జట్టును ఫైనల్‌కు చేర్చారు. సీఎస్‌కే కప్‌ను కొట్టడంలో ఎంఎస్ ధోనీ పాత్ర ఎనలేనిది. నాయకుడిగా జట్టును నడిపించిన తీరు అద్భుతం. అలాగే పాక్‌ కెప్టెన్‌ బాబర్ ఆజామ్‌ నాయకుడిగా, బ్యాటర్‌గా రాణించాలి. టోర్నీలోని ప్రతి బౌలర్‌ అతడినే లక్ష్యంగా చేసుకుంటారు. సారథిగా, బ్యాటర్‌గా బాబర్‌పై అదనపు ఒత్తిడి ఉంటుంది. ఈ సమయంలోనే రెండింటిని సమతుల్యం చేసుకోవాలి’’ అని సూచించాడు. 

గత కొన్నేళ్లుగా భారత క్రికెట్‌ను దగ్గర్నుంచి చూస్తున్న హేడెన్ కీలకమైన పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఇద్దరు బ్యాటర్లు కీలకమవుతారని బలంగా విశ్వసిస్తున్నాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్, వికెట్‌ కీపర్‌ రిషభ్ పంత్‌తో పాక్‌కు ముప్పు ఉండబోతోందని అంచనా వేశాడు. ‘‘ కేఎల్ రాహుల్‌ను కొన్ని రోజులుగా అబ్జర్వ్‌ చేస్తున్నా. యువ క్రికెటర్ నుంచి కీలకమైన బ్యాటర్‌గా ఎదిగిన కేఎల్‌ రాహుల్‌తో పాక్‌కు అతిపెద్ద ముప్పు ఉంటుంది. పొట్టి క్రికెట్‌లో తొలినాళ్లలో రాహుల్‌ ఇబ్బంది పడిన సందర్భాలు చూశా. బౌలర్లను శాసించడం గమనించా. కాబట్టే కేఎల్ రాహుల్‌తో జాగ్రత్తగా ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. అలానే విధ్వంసం సృష్టించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండే రిషభ్‌ పంత్‌తో కూడా అప్రమత్తంగా ఉండాలి. గతంలో ఆసీస్‌, ఇంగ్లాండ్ జట్ల మధ్య యాషెస్‌ సిరీస్‌ ఉత్కంఠ కలిగించే మ్యాచుల్లో టాప్‌లో ఉండేది. అయితే భారత్‌, పాక్‌ పోరు ముందు మరేదీ సాటి రాదు. ఈ టోర్నీలో పాక్‌ ఆటగాళ్లు బాబర్‌ అజామ్‌, రిజ్వాన్, ఫఖర్‌ జమాన్‌ కీలకమైనవాళ్లు’’ అని విశ్లేషించాడు. పాక్‌ క్రికెట్‌లో తన పాత్రపైనా క్లారిటీ ఇచ్చేశాడు. ప్రపంచకప్‌ సందర్భంగా ఎదుర్కోబోయే అంశాల గురించి ఆటగాళ్లను సన్నద్ధత చేయడమే తన లక్ష్యమని  వివరించాడు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని