సచిన్‌ కూడా నాకు అదే చెప్పేవాడు: సెహ్వాగ్‌ 
close

తాజా వార్తలు

Updated : 16/03/2021 15:19 IST

సచిన్‌ కూడా నాకు అదే చెప్పేవాడు: సెహ్వాగ్‌ 

పంత్‌, ఇషాన్‌.. మీదైన రోజు అలా చేయొద్దు!

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మెన్ రిషభ్‌పంత్‌, ఇషాన్‌ కిషన్‌.. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని చూసి ఒక విషయం నేర్చుకోవాలని మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ సూచించాడు. మ్యాచ్‌లో చివరి వరకూ క్రీజులో ఉండాలని, తమదైన రోజు ఔటవ్వకుండా బ్యాటింగ్‌ చేయాలని, జట్టును విజయతీరాలకు చేర్చాలని సెహ్వాగ్‌ కోరాడు. ఇంగ్లాండ్‌తో రెండో టీ20 అనంతరం ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడిన సెహ్వాగ్‌ ఇలా చెప్పుకొచ్చాడు.

‘‘తనదైన రోజు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తప్పకుండా జట్టును గెలిపిస్తాడు. ఫార్మాట్‌ ఏదైనా చివరి వరకూ క్రీజులో ఉండి విజయం సాధిస్తాడు. అతడి బ్యాటింగ్‌లో అదో ప్రత్యేకత. ఈ విషయంలో పంత్‌, కిషన్‌.. కోహ్లీని చూసి నేర్చుకోవాలి. మీదైన రోజు ఔటవ్వకుండా ఆడాలి. చివరివరకూ క్రీజులో ఉండి జట్టును గెలిపించాలి. నాక్కూడా సచిన్‌ ఇదే విషయం చెప్పేవాడు. ‘ఈ రోజు నువ్వు బాగా ఆడుతున్నావని తెలిస్తే.. వీలైనంతసేపు క్రీజులో పాతుకుపో. చివరి వరకు పరుగులు చేస్తూ నాటౌట్‌గా మిగిలిపో. ఎందుకంటే రేపు ఎలా ఉంటుందో మనకు తెలియదు. పరుగులు చేస్తావో లేదో చెప్పలేం. కానీ, నువ్వు బాగా ఆడే రోజు పరిస్థితి ఎలా ఉందనే విషయం అర్థమవుతుంది. దాంతో ఆరోజు ఔటవ్వకుండా ఆడి పరుగులు సాధించాలి‌’’ అని సచిన్‌ నాతో అనేవాడు’’ అని వీరూ గుర్తు చేసుకున్నాడు.

ఇక ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమ్‌ఇండియా ఏడు వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. అరంగేట్రం బ్యాట్స్‌మన్‌ ఇషాన్‌కిషన్‌ (56;32 బంతుల్లో 5x4, 4x6), కోహ్లీతో కలిసి రెండో వికెట్‌కు 94 పరుగులు జోడించాడు. అర్ధశతకం తర్వాత మరింత దూకుడుగా ఆడే క్రమంలో ఔటయ్యాడు. ఆపై పంత్‌(26; 13 బంతుల్లో 2x4, 2x6) ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. అప్పటికే టీమ్‌ఇండియా విజయం ఖరారు కాగా, భారీ షాట్‌కు ప్రయత్నించి పెవిలియన్‌ చేరాడు. మరోవైపు తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లోనే అదిరిపోయే ప్రదర్శన చేసిన ఇషాన్‌ కిషన్‌ను మాజీ ఓపెనర్‌ ప్రశంసించాడు. అతడు దేశవాళి క్రికెట్‌లో ఝార్ఖండ్‌ తరఫున ఆడుతుండటంతో మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీతో పోల్చాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని