ఆఖరి బంతికి ధోనీలా.. హెలికాప్టర్‌తో గెలిపించాడు

తాజా వార్తలు

Published : 27/01/2021 22:03 IST

ఆఖరి బంతికి ధోనీలా.. హెలికాప్టర్‌తో గెలిపించాడు

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 క్వార్టర్‌ ఫైనల్లో విష్ణు సోలంకి మాయ

అహ్మదాబాద్‌: అంతర్జాతీయ మ్యాచులకు ఆతిథ్యం ఇవ్వకముందే మొతెరా మోతెక్కిపోయింది. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీలో భాగంగా హరియాణా, బరోడా మధ్య జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ పోరు ఉత్కంఠకు దారితీసింది. ఆఖరి బంతికి హెలికాప్టర్‌ సిక్సర్‌తో బరోడా సెమీస్‌ చేరుకుంది. ఆ జట్టు ఆటగాడు విష్ణు సోలంకి (71*; 46 బంతుల్లో 4×4, 5×6) మహేంద్రసింగ్‌ ధోనీలా జట్టుకు విజయం అందించాడు.

మొదట బ్యాటింగ్‌ చేసిన హరియాణా 7 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. హెచ్‌ రాణా (49; 40 బంతుల్లో 7×4), శివమ్‌ చౌహాన్‌ (35; 29 బంతుల్లో 3×4, 1×6) రాణించారు. అయితే హరియాణా బౌలర్లు రాణించడం, పిచ్‌ బౌలింగ్‌కు సహకరిస్తుండటంతో బరోడా విజయం కష్టమే అనుకున్నారంతా. 149 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆ జట్టు గొప్ప ఆరంభమేమీ లభించలేదు. 33 పరుగులకే ఓపెనర్‌ స్మిట్‌ పటేల్‌ (21) చాహల్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్‌ కేదార్‌ దేవ్‌ధర్‌ (43; 40 బంతుల్లో 2×4, 2×6) సాయంతో వన్‌డౌన్‌లో వచ్చిన విష్ణు సోలంకి (71*) అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పాడు.

ఆఖరి 24 బంతుల్లో 42 పరుగులు చేయాల్సిన పరిస్థితుల్లో సోలంకి దుమ్మురేపాడు. వరుసగా సిక్సర్లు, బౌండరీలు బాదడంతో విజయ సమీకరణం ఆఖరి 6 బంతుల్లో 18 పరుగులుగా మారింది. సుమిత్‌ కుమార్‌ బౌలింగ్‌కు వచ్చాడు. తొలి బంతికి అభిమన్యు రాజ్‌పుత్‌ సింగిల్‌ తీశాడు. రెండో బంతికి విష్ణు ఇచ్చిన క్యాచ్‌ చేజారడంతో సింగిల్‌ వచ్చింది. మూడో బంతిని అభిమన్యు మరో సింగిల్‌ తీయడంతో విష్ణు స్ట్రైక్‌లోకి వచ్చాడు. నాలుగో బంతిని అతడు లాంగ్‌ఆన్‌లో సిక్సర్‌గా మలిచాడు. ఆ బంతి మొతెరాలోని స్టాండ్స్‌లో పడటం గమనార్హం. ఆ తర్వాత బంతిని థర్డ్‌మ్యాన్‌ దిశగా బౌండరీకి తరలించాడు. ఆఖరి బంతికి 4 పరుగులు చేస్తే సూపర్‌ ఓవర్ లేదా సిక్సర్‌ బాదితే విజయం. ఇలాంటి ఉత్కంఠకర క్షణాల్లో విష్ణు మాయ చేశాడు. బౌలర్‌ వేసిన చక్కని యార్కర్‌కు ముందే సిద్ధమై హెలికాప్టర్ షాట్‌తో స్ట్రెయిట్‌గా సిక్సర్‌ బాదేశాడు. జట్టును సెమీస్‌కు చేర్చాడు.

ఇవీ చదవండి
రూట్‌.. రైట్‌ రైట్‌! కోహ్లీ ఆపగలడా?
భయం లేదు.. దాదా క్షేమం

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని