థర్డ్‌ అంపైర్‌.. ఇదెలా ఔట్‌? 

తాజా వార్తలు

Updated : 19/03/2021 10:04 IST

థర్డ్‌ అంపైర్‌.. ఇదెలా ఔట్‌? 

సూర్య ఔట్‌పై మాజీల అసంతృప్తి..

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టీ20లో సూర్యకుమార్‌ యాదవ్‌(57; 31 బంతుల్లో 6x4, 3x6) వివాదాస్పద ఔట్ తీరుపై టీమ్‌ఇండియా మాజీలు వీవీఎస్‌ లక్ష్మణ్‌, వీరేంద్ర సెహ్వాగ్‌ స్పందించారు. లక్ష్మణ్‌ ట్వీట్‌ చేస్తూ అంపైర్‌ సాఫ్ట్‌ సిగ్నల్‌ విధానాన్ని తప్పుబట్టాడు. అలాగే సెహ్వాగ్ తనదైన శైలిలో అంపైర్లపై ఓ హాస్యాస్పద మీమ్‌ రూపొందించి వ్యంగ్యంగా విమర్శించాడు.

టీమ్‌ఇండియా ఇన్నింగ్స్‌ 13.2 ఓవర్‌కు సామకరన్‌ వేసిన బంతిని సూర్యకుమార్‌ షాట్‌ ఆడగా, ఆ బంతి నేలకు తాకుతున్న వేళ మలన్‌ క్యాచ్‌ అందుకున్నాడు. దాంతో అది వివాదాస్పదమైంది. బంతి స్పష్టంగా మలన్‌ చేతిలో పడిందో లేదో తెలుసుకోకుండానే ఆన్‌ఫీల్డ్‌ అంపైర్‌ ఔటిచ్చాడు. అది రీప్లేలో నేలకు తాకుతున్నట్లు కనిపించడంతో థర్డ్‌ అంపైర్‌ దృష్టికి వెళ్లింది. దాన్ని అనుమానాస్పదంగా భావించిన థర్డ్‌ అంపైర్‌.. అంపైర్స్‌కాల్‌గా ఔటిచ్చారు. దీనిపై అటు టీమ్‌ఇండియాతో పాటు ఇటు మాజీలు, నెటిజెన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలోనే లక్ష్మణ్‌ ఆ క్యాచ్‌ ఔట్‌ ఫొటోను ట్విటర్‌లో పంచుకొని ఇలా రాసుకొచ్చాడు. ‘ఇదెలా ఔట్‌? అత్యాధునిక సాంకేతిక నైపుణ్యం వినియోగించి అనేకమార్లు రీప్లే చూసినా థర్డ్‌ అంపైర్‌.. ఫీల్డ్‌ అంపైర్‌ నిర్ణయాన్ని పరిగణనలోకి తీసుకొని ఔటివ్వడం ఏమిటి? ఈ నియమాన్ని పునఃపరిశీలించాలి లేదా మార్చాలని భావిస్తున్నా’ అని ట్వీట్‌ చేశాడు. కాగా, వీవీఎస్‌ పంచుకున్న ఫొటోలోనూ బంతి నేలకు తాకుతున్నట్లు స్పష్టంగా కనిపించడం గమనార్హం. మరోవైపు సెహ్వాగ్‌ ఇదే ఫొటోతో పాటు ఒక చిన్నపిల్లాడు కళ్లకు గంతలు కట్టుకున్న ఫొటోను పంచుకొని.. సూర్య ఔట్‌ విషయంలో థర్డ్‌ అంపైర్‌ ఇలా కళ్లుమూసుకొని ఉన్నాడని వ్యంగ్యంగా విమర్శించాడు. కాగా, ఈ మ్యాచ్‌లో సూర్య ఔటైనా టీమ్‌ఇండియా 185/8 స్కోర్‌ సాధించింది. అనంతరం ఇంగ్లాండ్‌ 20 ఓవర్లలో 177/8తో సరిపెట్టుకుంది. దీంతో సిరీస్‌ ప్రస్తుతం 2-2తో సమంగా నిలిచింది. శనివారం జరగబోయే ఫైనల్‌ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారిదే టీ20 సిరీస్ కానుంది.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని