టీ20ల్లో పంత్‌ హీరో కాగలడు: లక్ష్మణ్‌

తాజా వార్తలు

Published : 09/03/2021 15:53 IST

టీ20ల్లో పంత్‌ హీరో కాగలడు: లక్ష్మణ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌పంత్ పొట్టి క్రికెట్‌లో మ్యాచ్‌ విన్నర్‌గా నిలుస్తాడని, అందుకు అతడికి సరైన అవకాశాలు ఇవ్వాలని మాజీ బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ సూచించారు. తాజాగా ఓ క్రికెట్‌ ఛానెల్‌లో మాట్లాడుతూ వీవీఎస్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. పంత్‌కు ఆస్ట్రేలియా పర్యటనలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అవకాశం దక్కని సంగతి తెలిసిందే. ఆపై సిడ్నీ, గబ్బా టెస్టుల్లో రెచ్చిపోయిన అతడు టీమ్‌ఇండియాకు చిరస్మరణీయ విజయం అందించాడు. ఈ క్రమంలోనే తాజాగా ఇంగ్లాండ్‌తోనూ చివరి టెస్టులో శతకం బాది.. మరోసారి తాను ఎంత విలువైన ఆటగాడో నిరూపించుకున్నాడు. దాంతో ఇప్పుడు ఇంగ్లాండ్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలోనే లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. టీ20ల్లో అతడికి సరైన అవకాశాలిస్తే బాగా ఆడతాడని చెప్పాడు. 

‘పంత్‌ దిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఒత్తిడి సమయాల్లో బ్యాటింగ్‌ చేసి ఆ జట్టుకు విజయాలు అందించడం మనం చూశాం. ఎడమచేతివాటం గల బ్యాట్స్‌మన్‌గా ప్రత్యర్థి కెప్టెన్లకు చెమటలు పట్టిస్తాడు. టీ20 ప్రపంచకప్‌ దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే పంత్‌ చేరిక టీమ్‌ఇండియాకు లాభదాయకం. ఒకటి, రెండూ ఇన్నింగ్స్‌ చూసి అతడిని అంచనా వేయొద్దు. దీర్ఘకాలంలో ఆలోచించి అవకాశాలివ్వాలి. అతడికి తుది జట్టులో చోటు ఉంటుందనే భరోసా కల్పిస్తే ఒంటి చేత్తో మ్యాచ్‌లు గెలిపిస్తాడు. అలాగే అతడి చేరికతో మిడిల్‌ ఆర్డర్‌లో మ్యాచ్‌ ఫినిషర్ల విభాగం బలోపేతం అవుతుంది. ఏడాదిన్నరగా మనం హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజానే ఆ స్థానంలో చూస్తున్నాం. టీమ్ఇండియా బ్యాటింగ్‌ లైనప్‌లో ఎవరైనా తొలి బంతి నుంచే దూకుడుగా ఆడగలిగే ఆటగాడు ఉన్నారంటే అది పాండ్య మాత్రమే. ఇప్పుడు పంత్‌ చేరాడు. అతడున్న ఫామ్‌  చూస్తే కచ్చితంగా మ్యాచ్‌ విన్నర్‌ అవుతాడు’ అని లక్ష్మణ్‌ వివరించాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని