
తాజా వార్తలు
యాష్ లేకున్నా సుందర్ నష్టం చేశాడు: ఆసీస్
ఇంటర్నెట్‌డెస్క్: సుదీర్ఘ ఫార్మాట్ అనుభవం లేకపోయినా టీమిండియా యువ బౌలర్లు గొప్పగా బౌలింగ్ చేశారని ఆస్ట్రేలియా అసిస్టెంట్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ కొనియాడాడు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గైర్హాజరీలో వాషింగ్టన్ సుందర్ బంతిని గింగరాలు తిప్పుతూ తమ జట్టు బ్యాట్స్‌మెన్‌ను బోల్తాకొట్టించాడన్నాడు. పేసర్ నటరాజన్ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడని అన్నాడు. గబ్బా మైదానంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టుతో సుందర్, నటరాజన్ తమ అంతర్జాతీయ టెస్టు కెరీర్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో వీరిద్దరు చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అంతేగాక కెరీర్లో రెండో టెస్టు ఆడుతున్న శార్దూల్ మూడు వికెట్లతో సత్తాచాటాడు.
‘‘భారత బౌలర్లు నిలకడగా బౌలింగ్ చేస్తున్నారు. అశ్విన్ లేని లోటును సుందర్ భర్తీచేస్తున్నాడు. క్రమశిక్షణతో బంతులు వేస్తూ ప్రధాన బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టించాడు. తన ప్రదర్శనతో మ్యాచ్‌ను అదుపులోకి తీసుకువచ్చాడు. ఇక నటరాజన్ చక్కని ప్రదర్శన చేశాడు. అతడికి టెస్టుల్లో అనుభవం లేదు. అయితేనేం సుదీర్ఘ ఫార్మాట్లో అరంగేట్రం చేయడానికి కావాల్సిన ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల అనుభవం ఉంది. మొత్తంగా భారత బౌలర్లు గొప్పగా బౌలింగ్ చేశారు. మ్యాచ్‌పై పట్టుబిగిస్తున్నామనే తరుణంలో పుంజుకుని వికెట్లు పడగొట్టారు’’ అని మెక్‌డొనాల్డ్ అన్నాడు.
తమ జట్టు ప్రదర్శన గురించి మాట్లాడుతూ.. శనివారం ఆటలో మరో 100 పరుగులు చేసి మంచి స్కోరును చేరుకున్నామన్నాడు. గబ్బా మైదానంలో 350కు పైగా పరుగులు సాధించడం తక్కువ స్కోరేమి కాదని పేర్కొన్నాడు. అయితే రెండో రోజు ఆట ముగిసేలోపే రోహిత్‌ను పెవిలియన్‌కు చేర్చడం సంతోషంగా ఉందని తెలిపాడు. 274 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ రెండు వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది. ఓపెనర్లు గిల్ (7), రోహిత్ (44) ఔటవ్వగా..పుజారా (8), రహానె (2) క్రీజులో ఉన్నారు. టీమిండియా ఇంకా 307 పరుగుల వెనుకంజలో ఉంది.
ఇదీ చదవండి
పశ్చాత్తాపం లేదు.. అలానే ఆడతా: రోహిత్