MS Dhoni: ధోనీ వీడ్కోలు రోజు ఏం జరిగిందంటే!

తాజా వార్తలు

Published : 06/06/2021 01:05 IST

MS Dhoni: ధోనీ వీడ్కోలు రోజు ఏం జరిగిందంటే!

తన అనుభవం చెప్పిన రుతురాజ్‌

ముంబయి: ఎంఎస్‌ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రోజు ఏం జరిగిందో యువ క్రికెటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ వివరించాడు. అతడు వీడ్కోలు పలుకుతాడన్న సంగతి జట్టులో ఎవరికీ తెలియదని పేర్కొన్నాడు. రాత్రి అందరిలాగే సోషల్‌ మీడియా ద్వారా తమకు తెలిసిందన్నాడు. మహీ ఇంక అంతర్జాతీయ క్రికెట్‌ ఆడడని అర్థమయ్యేందుకు రెండుమూడు రోజులు పట్టిందన్నాడు.

గతేడాది ఆగస్టు 15న ఎంఎస్‌ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అప్పుడతను ఐపీఎల్‌ కోసం సన్నద్ధమవుతున్నాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఏర్పాటు చేసిన సన్నాహక శిబిరంలో సాధన చేస్తున్నాడు. అతడు వీడ్కోలు ప్రకటన చేస్తాడని నిజానికి ఎవ్వరూ ఊహించలేదు. హఠాత్తుగా సాయంత్రం సోషల్‌ మీడియాలో అంతర్జాతీయ క్రికెట్‌కు ఇకపై ఆడనన్న విషయం వీడియో రూపంలో తెలియజేశాడు. అతడి వెంటనే సురేశ్ రైనా సైతం చిన్న వయసులో రిటైర్మెంట్‌ తీసుకోవడం గమనార్హం.

‘నిజానికి ఆ రోజు మేం దుబాయ్‌కు బయల్దేరాలి. చెన్నైలో ధోనీతో  10-15 మంది కలిసి సాధన చేశారు. కానీ అందులో ఎవరికీ ఈ విషయం తెలియదు. ఆ ఆగస్టు 15 సైతం మిగతా రోజుల్లాగే గడిచింది. సీఎస్‌కేలోని ఇతర ఆటగాళ్లలాగా నాకూ సోషల్‌ మీడియా ద్వారానే ధోనీ వీడ్కోలు గురించి తెలిసింది. ఆ రోజు సాయంత్రం 6:30కి సాధన ముగిసింది. మహీభాయ్‌ తప్ప మిగతా అందరం 7 గంటలకు భోజనం వద్ద కూర్చున్నాం.  ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా మహీ వీడ్కోలు పలికాడని ఎవరో చెప్పారు. భయంతో ఈ విషయం గురించి ఎవరూ మాట్లాడుకోలేదు’ అని రుతురాజ్‌ చెప్పాడు.

ధోనీ వీడ్కోలు గురించి తెలియగానే ఇకపై అతడిని అంతర్జాతీయ క్రికెట్లో చూడలేమనే తన మదిలో తట్టిందని రుతురాజ్‌ అన్నాడు. అది అర్థమవ్వడానికి రెండుమూడు రోజుల సమయం పట్టిందని తెలిపాడు. కాగా గతేడాదే చెన్నై తరఫున అరంగేట్రం చేసిన రుతురాజ్‌ ఆఖరి దశలో ఆకట్టుకున్నాడు. మొదట్లో అతడికి కరోనా వైరస్‌ రావడంతో సాధన చేసేందుకు కుదర్లేదు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని