
తాజా వార్తలు
అమ్మో.. టీమ్ఇండియాతో అంటే శ్రమించాల్సిందే
గాలె: ఆస్ట్రేలియాపై పుంజుకొని టీమ్ఇండియా సిరీస్ కైవసం చేసుకోవడంతో టెస్టు క్రికెట్‌కు గొప్ప ప్రచారం లభించిందని ఇంగ్లాండ్ సారథి జో రూట్ అన్నాడు. స్వదేశంలో భారత్‌తో తలపడాలంటే అత్యుత్తమానికి మించిన ప్రతిభను ప్రదర్శించాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. శ్రీలంకతో రెండో టెస్టుకు ముందు రూట్ మీడియాతో మాట్లాడాడు.
‘ఆసీస్-భారత్ సిరీసును మొదటి నుంచి చూస్తే అద్భుతమైన క్రికెట్‌తో దానికి ముగింపునిచ్చారు’ అని రూట్ అన్నాడు. ‘టీమ్ఇండియా గొప్పగా పోరాడింది. అసమాన సాహసం ప్రదర్శించింది. ఘోర ఓటమి నుంచి పుంజుకొంది. జట్టులోకి వచ్చిన ప్రతి ఒక్కరు రాణించారు. టెస్టు క్రికెట్‌ను ఆదరిస్తున్న అభిమానుల ప్రకారం ఆటకు ఈ సిరీస్ గొప్ప ప్రచారం తీసుకొచ్చింది. భారత్ ఇప్పుడు సుదీర్ఘ ఫార్మాట్‌ను మరింత రసవత్తరంగా మార్చేసింది’ అని రూట్ అన్నాడు.
‘మాతో సిరీసుకు టీమ్ఇండియా గొప్ప ఆత్మవిశ్వాసంతో ఉంటుందని అనుకుంటున్నా. వారిది మంచి జట్టు. సొంతగడ్డపై విజయాలు ఎలా సాధించాలో బాగా తెలుసు. కోహ్లీసేనతో పోరాడాలంటే అత్యుత్తమానికి మించిన ప్రతిభను కనబరచాలి. ఏదేమైనా భారత్-ఇంగ్లాండ్ సిరీస్ అద్భుతంగా ఉండనుంది. గెలవాలనే ఉద్దేశంతో మేం వస్తున్నాం. ఇందుకోసం మేమెంతో శ్రమించాలని తెలుసు’ అని రూట్ పేర్కొన్నాడు. భారత్‌లో సిరీసుకు బెన్‌స్టోక్స్, జోఫ్రా ఆర్చర్ రావడం జట్టులో జోష్ నింపుతుందని వెల్లడించాడు. ఫిబ్రవరి 5 నుంచి భారత్‌లో ఇంగ్లాండ్ పర్యటన మొదలవుతుందన్న సంగతి తెలిసిందే. రెండు జట్లు నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేల్లో తలపడనున్నాయి.
ఇవీ చదవండి
స్పైడర్ పంత్..!
విశ్రమించను.. విజయం తలకెక్కించుకోను: సిరాజ్