MS Dhoni: మహీ కెరీర్‌ పరిపూర్ణమైన వేళ..!
close

తాజా వార్తలు

Updated : 23/06/2021 15:49 IST

MS Dhoni: మహీ కెరీర్‌ పరిపూర్ణమైన వేళ..!

టీమ్‌ఇండియా ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలిచి ఎనిమిదేళ్లు

ఇంటర్నెట్‌ డెస్క్‌: అంతర్జాతీయ క్రికెట్లో ఐసీసీ ట్రోఫీలన్నీ గెలిచిన ఏకైక కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ. 2007లో అరంగేట్రం టీ20 ప్రపంచకప్‌ గెలిచాడు. 2011లో ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడాడు. 2013లో ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో టీమ్‌ఇండియాను విజేతగా నిలిపాడు. వర్షం కారణంగా 50 ఓవర్లు జరగాల్సిన ఫైనల్‌ టీ20గా మారింది. ఉత్కంఠకరంగా సాగిన ఆ పోరులో ధోనీసేన గెలిచి నేటికి (బుధవారం) సరిగ్గా ఎనిమిదేళ్లు.

అప్పుడూ వర్షం బెడదే

ఎనిమిది జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో టీమ్‌ఇండియా గ్రూప్‌-బిలో ఉంది. మొదట కార్డిఫ్‌లో  దక్షిణాఫ్రికాను 26 పరుగుల తేడాతో ఓడించింది. ఆ తర్వాత లండన్‌లో వెస్టిండీస్‌పై 8 వికెట్లతో విజయ దుందుభి మోగించింది. ఇక ఎడ్జ్‌బాస్టన్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను డక్‌వర్త్‌ లూయిస్‌ విధానంలో 8 వికెట్లతో చిత్తు చేసింది. కార్డిఫ్‌లోనే జరిగిన సెమీస్‌లో లంకను 8 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. జూన్‌ 23న బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లాండ్‌తో తలపడింది. ప్రస్తుత ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు ఎదురైనట్టే అప్పుడూ వర్షం బెడదే. ఎడతెరపి లేకుండా వాన పడటంతో ఓవర్లు కుదించారు. చెరో 20 ఓవర్లు ఆడించారు.

ఆదుకొన్న జడ్డూ, కోహ్లీ

టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. చల్లని వాతావరణంలో టీమ్‌ఇండియా ఇబ్బంది పడుతుందని భావించింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (9; 14 బంతుల్లో 1×4) జట్టు స్కోరు 19 వద్ద  ఔటయ్యాడు. దూకుడుగా ఆడిన శిఖర్‌ ధావన్‌ (31; 24 బంతుల్లో 2×4, 1×6) 50 పరుగుల వద్ద పెవిలియన్‌ చేరాడు. అప్పుడు విరాట్‌ కోహ్లీ (43; 34 బంతుల్లో 4×4, 1×6) కీలక ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. దినేశ్‌ కార్తీక్‌ (6), సురేశ్‌ రైనా (1), ఎంఎస్‌ ధోనీ (0) విఫలమైన వేళలో రవీంద్ర జడేజా (33; 25 బంతుల్లో 2×4, 2×6) కీలక ఇన్నింగ్స్‌ ఆడి స్కోరును 129/7కి చేర్చాడు. రవి బొపారా 3 వికెట్లతో చెలరేగాడు.

ఇషాంత్‌ మాయాజాలం

ఛేదనకు దిగిన ఇంగ్లాండ్‌ సులభంగా గెలుస్తుందనే అనుకున్నారు. కానీ ఇషాంత్‌ శర్మ, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా తలో 2 వికెట్లు తీసి ఆంగ్లేయులను దెబ్బకొట్టారు. ఓపెనర్‌ అలిస్టర్‌ కుక్‌ (2)ను జట్టు స్కోరు 3 వద్దే ఉమేశ్‌ ఔట్‌ చేశాడు. జొనాథన్ ట్రాట్‌ (20), జో రూట్‌(7), ఇయాన్‌ బెల్‌ (13)తో కూడిన టాప్‌ఆర్డర్‌ 50 పరుగుల్లోపే కుప్పుకూలింది. 4 వికెట్లు నష్టపోయి కష్టాల్లో పడ్డ జట్టును ఇయాన్‌ మోర్గాన్‌ (33; 30 బంతుల్లో 3×4, 1×6), రవి బొపారా (30; 25 బంతుల్లో 2×6) ఆదుకొన్నారు. కీలక భాగస్వామ్యంతో 17 ఓవర్లకు జట్టు స్కోరును 100 దాటించేశారు. టీమ్‌ఇండియా మ్యాచ్‌ కోల్పోతున్నట్టు అనిపించినా.. పరుగులు ఇస్తున్నా.. 18వ ఓవర్లో ఇషాంత్‌ శర్మకే ధోనీ బంతినిచ్చాడు. జట్టు స్కోరు 110 వద్ద వరుస బంతుల్లో మోర్గాన్‌, బొపారాను ఔట్‌ చేసి బ్రేక్‌ ఇచ్చాడు. 5 పరుగుల తేడాతో ధోనీసేన విజేతగా అవతరించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని