
తాజా వార్తలు
అనుకూలించినప్పుడే అందిపుచ్చుకోవాలి: అక్షర్
(Pic:BCCI)
అహ్మదాబాద్: పరిస్థితులు అనుకూలిస్తున్నప్పుడే అందిపుచ్చుకోవాలని టీమ్ఇండియా యువ స్పిన్నర్ అక్షర్ పటేల్ అంటున్నాడు. స్పిన్‌కు సహకరిస్తున్న పిచ్‌ను ఉపయోగించుకొని వికెట్లకు బంతులు విసరడమే తన లక్ష్యమని అతడు పేర్కొన్నాడు. ఇంగ్లాండ్‌తో డే/నైట్ టెస్టు తొలిరోజు ఆట ముగిసిన తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు.
మొతెరా వేదికగా జరుగుతున్న గులాబి టెస్టులో అక్షర్ పటేల్ విజృంభించాడు. 21.4 ఓవర్లు విసిరి 38 పరుగులిచ్చి ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. వరుసగా రెండో టెస్టులోనూ 5+ వికెట్ల ఘనత అందుకున్నాడు. ఇంగ్లాండ్ నడ్డి విరిచాడు. అతడికి తోడుగా అశ్విన్ 3 వికెట్లు తీయడంతో ప్రత్యర్థి 112 పరుగులకే కుప్పకూలింది. బదులుగా తొలిరోజు ఆట ముగిసే సరికి టీమ్ఇండియా 99/3తో నిలిచింది.
‘సహకరిస్తున్న పిచ్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకోవడమే నా లక్ష్యం. ఎందుకంటే పరిస్థితులు అనుకూలిస్తున్నప్పుడే అందిపుచ్చుకోవాలి. చెన్నైలో బంతి జారలేదు. మొతెరాలో మాత్రం బంతి జారిపోతోంది. అందుకే ఎక్కువగా ఎల్బీలు అయ్యారు. గరిష్ఠంగా గంటకు 85-90 కి.మీ వేగంతో బంతులు విసిరితే చాలు. ఎక్కువ టీ20 క్రికెట్ ఆడుతుండటంతో ఆ ప్రభావం టెస్టు క్రికెట్‌పై ఉంటోంది. బ్యాట్స్‌మెన్ దూకుడుగా ఆడుతున్నారు. అందుకే కఠినమైన లైన్, లెంగ్తులో వేగంగా బంతులు వేయడం విజయవంతం అవుతోంది. ఒకవేళ బ్యాట్స్‌మెన్ బంతిని చక్కగా అడ్డుకుంటే బౌలర్ వెనకడుగు వేసి వ్యూహం మార్చాలి. కానీ బ్యాటర్ స్వీప్, రివర్స్ స్వీప్ ఆడుతున్నాడంటే మాత్రం అవకాశం ఉన్నట్టే లెక్క’ అని అక్షర్ వివరించాడు.