SRH: వార్నర్‌లా కోచ్‌లను తీసేయగలరా?

తాజా వార్తలు

Published : 13/05/2021 17:43 IST

SRH: వార్నర్‌లా కోచ్‌లను తీసేయగలరా?

ప్రశ్నించిన సునిల్‌ గావస్కర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సారథిగా డేవిడ్‌ వార్నర్‌ను తొలగించిన రీతిలోనే కోచ్‌లతోనూ వ్యవహరించగలరా అని క్రికెట్‌ దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ ప్రశ్నించారు. నాయకుడిగా తీసేసినా జట్టులో వార్నర్‌కు చోటివ్వకపోవడం ఆశ్చర్యకరమని పేర్కొన్నారు. అతడు తిరుగులేని బ్యాట్స్‌మన్‌ అని అభిప్రాయపడ్డారు.

ఐపీఎల్‌-2021లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్రదర్శన ఏ మాత్రం బాగాలేదు. 7 మ్యాచులాడి 1 మాత్రమే గెలిచింది. ఆ జట్టు బ్యాటింగ్‌ విభాగంలో లోపాలు కనిపించాయి. కలిసికట్టుగా ఆడినట్టు అనిపించలేదు. జట్టు యాజమాన్యం, సారథి ఆలోచనలు వేర్వేరుగా ఉన్నట్టు తెలిసింది. ఆటగాళ్ల ఎంపిక విషయంలో వార్నర్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. దాంతో ఆగ్రహించిన ఫ్రాంచైజీ అతడిని సారథ్యం నుంచి తొలగించింది. అంతేకాకుండా రాజస్థాన్‌ మ్యాచులో తుది జట్టులో చోటివ్వలేదు. 6 ఇన్నింగ్స్‌ల్లో వార్నర్‌ 32+ సగటుతో 193 పరుగులు చేశాడు.

‘డేవిడ్‌ వార్నర్‌ను నాయకత్వం నుంచి తొలగించడమే కాకుండా తుది జట్టులో చోటివ్వని నిర్ణయంపై హైదరాబాద్‌ ఆలోచిస్తుందని అనుకుంటున్నా. వార్నర్‌ పరుగులు చేశాడు. అయితే మునుపట్లా ఆధిపత్యం వహిస్తూ కాదు. మిగతా ఆటగాళ్లతో పోలిస్తే అతడివి విలువైన పరుగులే. తుది జట్టులోనూ అతడికి చోటివ్వకపోవడం ఆశ్చర్యకరం. సారథ్యాన్ని పక్కనపెడితే అతడో తిరుగులేని బ్యాటర్’ అని సన్నీ అన్నారు.

‘నాయకుడిగా, ఆటగాడిగా వార్నర్‌ను పక్కన పెట్టడం ఎక్కువ కాలమే చర్చనీయం అవుతుంది. సీజన్‌ మధ్యలోనే కెప్టెన్‌ను మార్చినట్టు కోచ్‌లతోనూ వ్యవహరిస్తారా అన్నదే ప్రశ్న. ఫుట్‌బాల్‌లో జట్టు ఓటములు మొదలవ్వగానే మొదట మేనేజర్‌నే తొలగిస్తారు. క్రికెట్‌లోనూ అలా ఎందుకు చేయకూడదు? ఇక టోర్నీ నిరవధికంగా వాయిదా పడటం అంతర్గతంగా, ప్రశాంతంగా ఆలోచించేందుకు మంచి అవకాశం’ అని సన్నీ పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని