Cricket News: కేన్‌కు గాయం.. కివీస్‌కు బెంగ

తాజా వార్తలు

Updated : 09/06/2021 16:46 IST

Cricket News: కేన్‌కు గాయం.. కివీస్‌కు బెంగ

బర్మింగ్‌హామ్‌: ఇంగ్లాండ్‌తో రెండో టెస్టుకు ముందు న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ! ఆ జట్టు సారథి కేఎన్‌ విలియమ్సన్‌ గాయపడ్డాడు. తొలి టెస్టులో ఎడమ మోచేతికి గాయమవ్వడంతో విశ్రాంతి తీసుకుంటున్నాడు. వైద్య బృందం అతడిని పర్యవేక్షిస్తోంది. ఎడ్జ్‌బాస్టన్‌లో బుధవారం మొదలయ్యే రెండో టెస్టులో అతడు ఆడతాడో లేడో స్పష్టత లేదు. బహుశా బుధవారం సాయంత్రం నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. కాగా ఎడమచేతి చూపుడు వేలిలో చీలిక రావడంతో స్పిన్నర్‌ మిచెల్‌ శాంట్నర్‌ ఇప్పటికే దూరమయ్యాడు.

ఎడమ చేతివాటం పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ జట్టుకు అందుబాటులో ఉన్నాడని కోచ్‌ గ్యారీస్టీడ్‌ తెలిపారు. మొదటి టెస్టు ఆడిన పేసర్లలో ఒకరికి విశ్రాంతినిస్తామని పేర్కొన్నారు. ‘లార్డ్స్‌లో ఆడిన పేస్‌ బౌలర్లంతా రెండో టెస్టు ఆడరు. ట్రెంట్‌ బౌల్ట్‌ అందుబాటులో ఉన్నాడు. దాదాపుగా పునరాగమనం చేస్తాడు. ఎడమచేతి చూపుడు వేలికి గాయమవ్వడంతో మిచెల్‌ శాంట్నర్‌ దూరమయ్యాడు. కేన్‌ విలియమ్సన్‌ ఎడమ మోచేతి గాయాన్ని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. బుధవారం సాయంత్రం నిర్ణయం తీసుకుంటారు’ అని గ్యారీ స్టీడ్‌ పేరుతో ‘బ్లాక్‌ క్యాప్స్‌’ ట్వీట్‌ చేసింది.

ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు ముగిసిన తర్వాత న్యూజిలాండ్‌ ప్రతిష్ఠాత్మక ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఆడనుంది. కోహ్లీసేనతో సౌథాంప్టన్‌లో తలపడనుంది. ఈ కీలక మ్యాచ్‌కు ముందు విలియమ్సన్‌ గాయపడటం ఆ జట్టుకు ఇబ్బందికరమే. అతడు త్వరగా కోలుకోవాలని కివీస్‌ కోరుకుంటోంది. ఫైనల్లో గెలవాలంటే ఆ జట్టుకు కేన్‌ ఎంతో అవసరం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని