పునరాగమనంలో టీమ్‌ఇండియా పరాజయం.. 
close

తాజా వార్తలు

Published : 07/03/2021 18:01 IST

పునరాగమనంలో టీమ్‌ఇండియా పరాజయం.. 

8 వికెట్లతో దక్షిణాఫ్రికా ఘన విజయం..

లఖ్‌నవూ: ఏడాది తర్వాత తిరిగి ప్రారంభమైన మహిళల వన్డే క్రికెట్‌లో టీమ్‌ఇండియా మిథాలీరాజ్‌ జట్టు 8 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఘోర పరాజయం పాలైంది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం లఖ్‌నవూ వేదికగా అటల్‌ బిహారి వాజ్‌పేయీ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో భారత్‌ చిత్తుగా ఓడిపోయింది. అటు బ్యాటింగ్‌లో.. ఇటు బౌలింగ్‌లో పూర్తిగా విఫలమై పర్యాటక జట్టు ముందు తలవంచింది.

తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న దక్షిణాఫ్రికా.. టీమ్‌ఇండియాను తక్కువ స్కోరుకే పరిమితం చేసింది. ఇస్మెయిల్‌ 3/28, మ్లాబా 2/41 కట్టుదిట్టంగా బంతులేసి టీమ్‌ఇండియాను కట్టడి చేశారు. ఈ క్రమంలో 50 ఓవర్లు బ్యాటింగ్‌ చేసిన మిథాలీ టీమ్‌ తొమ్మిది వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. కెప్టెన్‌ మిథాలీ రాజ్‌(50; 58 బంతుల్లో 4x4, 1x6), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(40; 41 బంతుల్లో 6x4) మాత్రమే రాణించారు. మిగతా అమ్మాయిలంతా ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు.

అనంతరం ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 40.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్లు లిజెల్లీ(83*; 122 బంతుల్లో 11x4, 1x6), లారా వాల్వా(80; 110 బంతుల్లో 12x4) తొలి వికెట్‌కు 169 పరుగులు జోడించారు. చివర్లో లారా, సున్‌లుస్‌(1) ఔటైనా దక్షిణాఫ్రికా సునాయాస విజయం సాధించింది. కాగా, గతేడాది ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ తర్వాత టీమ్‌ఇండియా మహిళా జట్టు మళ్లీ బరిలోకి దిగడం ఇదే తొలిసారి. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని