WTC Final: ధోనీ వారసత్వం × కివీస్‌ మర్యాద
close

తాజా వార్తలు

Published : 17/06/2021 13:50 IST

WTC Final: ధోనీ వారసత్వం × కివీస్‌ మర్యాద

అరంగేట్రం ఛాంపియన్‌షిప్‌ గెలిచేందుకు కోహ్లీ, కేన్‌ తహతహ

సౌథాంప్టన్‌: వందకోట్ల మంది ఆశలు మోస్తున్న విరాట్‌ కోహ్లీ ఒకవైపు.. పద్ధతిగా, మర్యాదగా క్రికెట్‌ ఆడే కేన్‌ విలియమ్సన్‌ మరోవైపు.. వీరిద్దరి సారథ్య సామర్థ్యానికి పరీక్ష పెట్టబోతోంది ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌. సౌథాంప్టన్‌ వేదికగా శుక్రవారం మొదలయ్యే తుదిపోరుకు వీరిద్దరూ సిద్ధమయ్యారు. ఎంఎస్‌ ధోనీ వారసత్వాన్ని నిలబెట్టేందుకు విరాట్‌ ప్రయత్నిస్తుండగా.. దేశానికి ఒక్క ఐసీసీ ట్రోఫీనైనా బహుమతిగా ఇవ్వాలని కేన్‌ తపిస్తున్నాడు. మరి సమవుజ్జీల పోరులో విజేతగా నిలిచేదెవరో!!


సమరానికి సై..సై

144 ఏళ్ల టెస్టు క్రికెట్‌ను శిఖరాగ్రంపై నిలబెట్టబోతోంది ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌. క్రికెట్‌కు అసలు రూపమైన సుదీర్ఘ ఫార్మాట్‌కు సరికొత్త అర్థం చెప్పనుంది. ఘన వారసత్వం గల టీమ్‌ఇండియా, మర్యాదకు మారుపేరైన కివీస్‌ ఈ ఛాంపియన్‌షిప్‌ గెలవాలని పట్టుదలతో ఉన్నాయి. కొవిడ్‌-19 మహమ్మారి వేధిస్తున్న సమయంలో ఈ రెండు జట్లూ బయో బడుగల్లో కష్టాలు పడుతూ ఫైనల్‌కు చేరుకున్నాయి. కనీసం మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లేకుండా కోహ్లీసేన, ఇంగ్లాండ్‌ను 1-0తో ఓడించిన విలియమ్సన్‌ బృందం సమరానికి శంఖం పూరిస్తున్నాయి. రెండూ గొప్ప జట్లే.. సారథులూ గొప్పవారే.. సామర్థ్యంలో సమవుజ్జీలే కావడంతో క్రికెట్‌ ప్రపంచమంతా ఫైనల్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.


వారసత్వం నిలబెట్టాలని

ఐసీసీ ప్రవేశపెట్టిన అన్ని టోర్నీలను టీమ్‌ఇండియా కైవసం చేసుకుంది. వన్డే, టీ20 ప్రపంచకప్‌లు, ఛాంపియన్స్‌ ట్రోఫీ టైటిళ్లను సొంతంచేసుకుంది. ఎంఎస్‌ ధోనీ నుంచి టెస్టు పగ్గాలు అందుకున్న విరాట్‌ కోహ్లీ ఒకవైపు పరుగులు.. మరోవైపు కెప్టెన్‌గా విజయాలు సాధిస్తూ దుమ్మురేపాడు. భారత అత్యుత్తమ టెస్టు కెప్టెన్‌గా ఎదిగాడు. వన్డే ప్రపంచకప్‌, ఛాంపియన్స్‌ట్రోఫీ టైటిళ్లకు త్రుటిలో దూరమైన విరాట్‌ ఈ ఛాంపియన్‌షిప్‌ అందుకోవాలని, ఐసీసీ గదను ముద్దాడాలన్న గొప్ప సంకల్పంతో ఉన్నాడు. తొలి టీ20 ప్రపంచకప్‌ సాధించిన ఎంఎస్‌ ధోనీని గుర్తుచేయాలని భావిస్తున్నాడు. అభిమానులూ అదే కోరుకుంటున్నారు.


కివీస్‌ గెలిచినా.. ఓకే!

ఒకవేళ న్యూజిలాండ్‌ విజేతగా ఆవిర్భవించినా అభిమానులు నిరాశ పడకపోవచ్చు! గౌరవంగా వారిని ఆదరించే అవకాశాలే ఉన్నాయి. ఎందుకంటే కేన్‌ విలియమ్సన్‌ను ఎవరూ ప్రత్యర్థిగా భావించరు. అతడు కోహ్లీసేనపై ఆడే కవర్‌డ్రైవ్‌లను ఆస్వాదిస్తారు. జడ్డూ, అశ్విన్‌ బౌలింగ్‌లో డేవాన్‌ కాన్వే పరుగులు చేసినా.. రోహిత్‌శర్మ ప్యాడ్లకు ట్రెంట్‌బౌల్ట్‌ బనానా స్వింగర్లు ఎక్కుపెట్టినా కోప్పడరు! తమ సత్ప్రవర్తనతో మర్యాదగా క్రికెట్‌ ఆడే కివీలను ఎవరైనా ఇష్టపడకుండా ఉండలేరు. పైగా వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో వారి ఓటమికి కన్నీరు పెట్టుకున్న భారతీయ అభిమానులు చాలామందే ఉన్నారు! అప్పటి న్యూజిలాండ్‌ బాధ కొంతైనా తీరిందని సంతోషిస్తారు!


నువ్వా.. నేనా

ఫైనల్‌కు కోహ్లీసేన మానసికంగా సన్నద్ధమైంది. నీల్‌ వాగ్నర్‌ షార్ట్‌పిచ్‌ బంతులకు దెబ్బలు తగిలినా గోడ కట్టేందుకు నయావాల్‌ చెతేశ్వర్‌ పుజారా సిద్ధంగా ఉన్నాడు. ప్రపంచకప్‌ అవకాశం రాని అజింక్య రహానె ఈ ట్రోఫీని ముద్దాడేందుకు ఏమైనా చేస్తాడు! నాయకుడికి సలహాలు ఇవ్వడమే కాకుండా.. విరాట్‌ విఫలమైతే రెట్టించిన ఉత్సాహంతో పరుగులు చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కే ఎంపికవ్వని యాష్‌.. విలియమ్సన్‌, రాస్‌టేలర్‌, హెన్రీ నికోల్స్‌ను తన క్యారమ్‌ లేదా స్లైడర్‌ బంతులతో ఉచ్చులో పడేసి విజయం అందించగలడు. వాకాలో రికీ పాంటింగ్‌ను వణికించిన బౌలింగ్‌ స్పెల్‌ను అత్యంత సీనియర్‌ ఇషాంత్‌ శర్మ మరోసారి పునరావృతం చేస్తే టీమ్‌ఇండియాకు తిరుగులేనట్టే! ఏదేమైనా ఆడేది ఇంగ్లాండులో! ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌పై బాధ్యత ఎక్కువే ఉంటుంది. కొత్తబంతితో మాయచేసే  ట్రెంట్‌బౌల్ట్‌, టిమ్‌ సౌథీ జోడీని వారు సమర్థంగా ఎదుర్కోవాలి. హిట్‌మ్యాన్‌ టెక్నిక్‌కు ఇంగ్లాండ్‌ పర్యటన ఓ పరీక్షే.


సమవుజ్జీల పోరాటం

కైల్‌ జేమీసన్‌ ఇప్పటికైతే ఆడలేదు. ఆ ఆరడుగల పొడగరితో ఏం చేయించొచ్చో విలియమ్సన్‌కు బాగా తెలుసు. ఇక నీల్‌ వాగ్నర్‌  బ్యాట్స్‌మెన్‌ రిబ్స్‌ లక్ష్యంగా బంతులేస్తాడు. పుల్‌ చేయకపోతే దేహానికి తగలడం ఖాయమన్నట్టుగా ఉంటాయి అతడి బంతులు. అందుకే అతడికీ, పంత్‌కు మధ్య పోరు కోసం చాలామంది ఆశగా ఎదురు చూస్తున్నారు. బహుశా రివర్స్‌స్వీప్‌ షాట్ల కోసమేనేమో! యాష్‌, జడ్డూ స్పిన్‌ కోసం ప్రత్యేకంగా సాధన చేసిన ఓపెనర్‌ డేవిడ్‌ కాన్వేకు బుమ్రా రూపంలో ప్రమాదం పొంచివుంది. అతడు వివిధ కోణాల్లో వేసే బంతులు, యార్కర్లను ఎదుర్కోవడం కష్టమే. షమి లేట్‌ స్వింగ్‌ను ఆడటమూ సవాలే. మొత్తానికి నైపుణ్యాలు, సామర్థ్యాల పరంగా రెండు జట్ల ఆటగాళ్లు సమవుజ్జీలుగా ఉన్నారు.


జట్లు.. వివరాలు

భారత్‌: విరాట్‌ కోహ్లీ (కె), రోహిత్‌ శర్మ, శుభ్‌మన్ గిల్‌, చెతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానె, రిషభ్ పంత్‌ (వి.కీ), రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ షమి, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, ఉమేశ్ యాదవ్‌, హనుమ విహారి, వృద్ధిమాన్‌ సాహా (వి.కీ)

న్యూజిలాండ్‌: కేన్‌ విలియమ్సన్‌ (కె), టామ్‌ బ్లండెల్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, డేవాన్‌ కాన్వే, కొలిన్‌ డి గ్రాండ్‌హోమ్‌, మ్యాట్‌ హెన్రీ, కైల్‌ జేమీసన్‌, టామ్ లేథమ్‌, హెన్రీ నికోల్స్‌, అజాజ్‌ పటేల్‌, టిమ్‌ సౌథీ, రాస్‌ టేలర్‌, నీల్‌ వాగ్నర్‌, బీజే వాట్లింగ్‌, విల్‌ యంగ్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని