WTC Final: వెలుతురు లేమితో ఆట నిలిపివేత  
close

తాజా వార్తలు

Updated : 19/06/2021 22:55 IST

WTC Final: వెలుతురు లేమితో ఆట నిలిపివేత  

టీమ్‌ఇండియా 146/3.. క్రీజులో కోహ్లీ, రహానె..

సౌథాంప్టన్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో రెండోరోజు కూడా ఆట పూర్తిగా సాగలేదు. వర్షం కారణంగా తొలిరోజు టాస్‌ పడకుండానే ఆగిపోయిన మ్యాచ్‌ శనివారం వెలుతురు లేమి కారణంగా మూడో సెషన్‌ మధ్యలో నిలిచిపోయింది. దీంతో అప్పటివరకు టీమ్ఇండియా 64.4 ఓవర్లలో 146/3 స్కోర్‌ సాధించింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (44; 124 బంతుల్లో 1x4), వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె(29; 79 బంతుల్లో 4x4) నిలకడగా ఆడుతూ క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 147 బంతుల్లో 58 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు.

అంతకుముందు టాస్‌ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్‌శర్మ(34; 68 బంతుల్లో 6x4), శుభ్‌మన్‌గిల్‌(28; 64 బంతుల్లో 3x4) శుభారంభం ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 62 పరుగులు జోడించాక స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. జేమీసన్‌ బౌలింగ్‌లో హిట్‌మ్యాన్‌ స్లిప్‌లో సౌథీ చేతికి చిక్కగా మరో పరుగు తర్వాత నీల్‌వాగ్నర్‌ బౌలింగ్‌లో శుభ్‌మన్‌గిల్‌ కీపర్‌ వాట్లింగ్‌ చేతికి చిక్కాడు. దాంతో భారత్‌ 63 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం జోడీ కట్టిన విరాట్‌, పుజారా మరో వికెట్‌ పడకుండా 69/2తో తొలి సెషన్‌ను ముగించారు. భోజన విరామం అనంతరం బౌల్ట్‌ వేసిన 40.2 ఓవర్‌కు పుజారా(8) వికెట్ల ముందు దొరికిపోయి నిరాశపర్చాడు.

ఈ క్రమంలోనే కోహ్లీ, రహానె జాగ్రత్తగా ఆడి మరో వికెట్‌ పడకుండా కివీస్‌ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. దాంతో రెండో సెషన్‌ను వారిద్దరూ 120/3 స్కోర్‌తో ముగించారు. ఇక మూడో సెషన్‌లో మరింత జాగ్రత్తగా ఆడిన కోహ్లీ, రహానె నాలుగో వికెట్‌కు అర్ధశతక భాగస్వామ్యం నెలకొల్పి నాటౌట్‌గా నిలిచారు. చివరికి వెలుతురు లేమి కారణంగా 64.4 ఓవర్ల వద్ద అంపైర్లు ఆటను నిలిపివేశారు. గంటకుపైగా ఎదురు చూసినా ఆకాశం మబ్బులతో నిండి ఉండటంతో రెండోరోజు స్టంప్స్‌ ప్రకటించారు. మరోవైపు న్యూజిలాండ్‌ బౌలర్లలో జేమీసన్‌, వాగ్నర్‌, ట్రెంట్‌బౌల్ట్‌ తలా ఓ వికెట్‌ తీశారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని