WTC Finals: న్యూజిలాండ్‌ టార్గెట్‌ 139
close

తాజా వార్తలు

Updated : 23/06/2021 19:32 IST

WTC Finals: న్యూజిలాండ్‌ టార్గెట్‌ 139

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ 170 ఆలౌట్‌..

సౌథాంప్టన్‌: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో 170 పరుగులకు ఆలౌటైంది. రిషభ్‌ పంత్‌ (41; 88 బంతుల్లో 4x4) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. కివీస్‌ పేసర్లు టిమ్‌ సౌథీ 4/48, బౌల్ట్‌ 3/39 మరోసారి మెరవడంతో భారత్‌ మోస్తరు స్కోర్‌ సాధించింది. న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 32 పరుగులు కలుపుకొంటే ఆ జట్టు లక్ష్యం 139 పరుగులుగా తేలింది. మరి భారత్‌ కివీస్‌ను కట్టడి చేసి డ్రా చేసుకుంటుందా లేక ఆలౌట్‌ చేసి విజయం సాధిస్తుందా చూడాలి.

అంతకుముందు 64/2 ఓవర్‌నైట్ స్కోరుతో రిజర్వ్‌డే ఆరో రోజు ఆట కొనసాగించిన కెప్టెన్‌ విరాట్‌ (13; 29 బంతుల్లో), చెతేశ్వర్‌ పుజారా (15; 80 బంతుల్లో 2x4) విఫలమయ్యారు. ఆట ప్రారంభమైన అరగంటకే ఇద్దరూ ఒక్క పరుగు తేడాతో పెవిలియన్‌ చేరారు. జేమీసన్‌ వీరిద్దర్నీ ఔట్ చేయడం విశేషం. ఆ తర్వాత రహానె (15; 40 బంతుల్లో 1x4) వికెట్‌ కాపాడుకునే ప్రయత్నం చేసినా బౌల్ట్ బౌలింగ్‌లో లెగ్‌సైడ్‌ వెళ్లే బంతిని ఆడి కీపర్‌కు చిక్కాడు. దాంతో భారత్‌ 109 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. అనంతరం జోడీ కట్టిన పంత్‌, జడేజా(16; 49 బంతుల్లో 2x4) మరో వికెట్‌ పడకుండా 130/5 స్కోర్‌తో తొలి సెషన్‌ ముగించారు.

ఇక రెండో సెషన్‌లో మరింత జాగ్రత్తగా ఆడుతూ మెల్లిగా స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే ఇద్దరూ ఆరో వికెట్‌కు 33 పరుగులు జోడించారు. అయితే, క్రీజులో కుదురుకున్నట్లే కనిపించిన వీరు స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. తొలుత జడ్డూ వాగ్నర్‌ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్‌ ఇవ్వగా కాసేపటికే బౌల్ట్‌ బౌలింగ్‌లో పంత్‌..నికోల్స్‌ చేతికి చిక్కాడు. అప్పటికి జట్టు స్కోర్‌ 156/7గా నమోదైంది. తర్వాత టెయిలెండర్లు అశ్విన్‌(7), షమి(13), బుమ్రా(0) కూడా చేతులెత్తేయడంతో భారత్‌ 170 పరుగులకే పరిమితమైంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని