close

అందేలా ఉంది.. అందుతుందా!

 ఆస్ట్రేలియాతో తొలి టెస్టు నేటి నుంచే 
ఆత్మవిశ్వాసంతో టీమ్‌ఇండియా 
చారిత్రక సిరీస్‌ విజయంపై కన్ను 

దశాబ్దాలుగా వెళ్తున్నాం.. వస్తున్నాం! జట్లు మారినా ఫలితాలు మారలేదు. ఎప్పుడూ పైచేయి సాధించింది లేదు..ఏనాడూ సిరీస్‌ నెగ్గిందీ లేదు. కంగారూల గడ్డపై టెస్టులంటే టీమ్‌ఇండియా ఎంత తేడాతో సిరీస్‌ ఓడిపోతుందన్నదే ప్రశ్న! 
కానీ ఇప్పుడు, ఎక్కడో ఏదో ఆశ! 
ఇంతకుముందెప్పుడూ లేనంత ఆత్మవిశ్వాసం, ఎప్పుడూ లేనంత ఉత్సాహం, ఎప్పుడూలేనన్ని అంచనాలు! ఆస్ట్రేలియాలో టీమ్‌ఇండియా కథ మలుపు తిరగబోతోందన్న భావన! ఆటగాళ్ల నుంచి అభిమానుల వరకు ఒకే మాట.. కోహ్లీసేనకు చర్రిత తిరగరాసేయగలదని, అక్కడ తొలి సిరీస్‌ నెగ్గేందుకు ఇదో అద్భుత అవకాశం అని. విశ్లేషకుల ఓటూ భారత్‌కే! 
టీమ్‌ఇండియా తిరుగులేని ఫేవరెట్‌ కాకపోవచ్చు. కానీ బలహీనపడ్డ ఆసీస్‌ కంటే మెరుగైన వనరులతో చరిత్ర సృష్టించేందుకు అన్నిరకాలుగా సన్నద్ధంగా ఉందనడంలో సందేహం లేదు. బంగారం లాంటి ఛాన్సు ముందుంది..! 
మరి కోహ్లీసేన ఈ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకుని పేస్‌ పిచ్‌లపై పసలేని జట్టన్న ముద్రను పోగొట్టుకుంటుందా లేదా పాత కథను పునరావృతం చేస్తుందా ? పయనమెటువైపో తెలియడానికి ఇంకెంతో సమయం లేదు. 
నేటి నుంచే ఆస్ట్రేలియాతో తొలి టెస్టు..  అడిలైడ్‌లో! 
తెల్లవారుతుండగానే సమరం షురూ!

అడిలైడ్‌లో..  
భారత్‌ × ఆస్ట్రేలియా 
టెస్టులు: 11  
ఆస్ట్రేలియా విజయాలు: 7 
భారత్‌ గెలిచినవి: 1 

ఉదయం 5.30 నుంచి  
సోని నెట్‌వర్క్‌లో 

అడిలైడ్‌

స్ట్రేలియాలో సిరీస్‌ నెగ్గాలని తహతహలాడుతున్న టీమ్‌ఇండియా సమరానికి సన్నద్ధమైంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో మొదటి టెస్టు గురువారం ఆరంభంకానుంది. 70 ఏళ్లుగా ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత్‌కు టెస్టు సిరీస్‌ నెగ్గడానికి ఇదో అద్భుత అవకాశమని అంతా భావిస్తున్న నేపథ్యంలో పోరు మరింత ఆసక్తి రేపుతోంది. దక్షిణాఫ్రికా (1-2), ఇంగ్లాండ్‌ (1-4) పర్యటనల్లో తన రాత మార్చుకోలేకపోయిన భారత్‌.. ఇక్కడ మాత్రం ఎలాగైనా నెగ్గాలనే పట్టుదలతో ఉంది. ఈ సిరీస్‌ కోహ్లి నాయకత్వ పటిమకు కూడా పరీక్షే. ఐతే ఆస్ట్రేలియాలో భారత్‌ రికార్డు పేలవం. అక్కడ 44 టెస్టులు ఆడి కేవలం ఐదు మాత్రమే గెలిచింది. 11 పర్యటనల్లో ఒక్కసారి కూడా ట్రోఫీని ముద్దాడలేదు. మూడు సార్లు (1980-81, 1985-86, 2003-04) మాత్రమే సిరీస్‌ను డ్రా చేసుకోగలిగింది.

అయినా తేలిక కాదు: బలహీనపడ్డా ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడించడం ఇప్పటికీ తేలికైన విషయం కాదనడంలో సందేహం లేదు. సిడ్నీలో సన్నాహక మ్యాచ్‌తోనే ఈ విషయం స్పష్టమైంది. సీఏ ఎలెవన్‌కు భారత్‌ ఏకంగా 544 పరుగులు సమర్పించుకుంది. మంచి బౌలింగ్‌ దళం ఉన్నప్పటికీ నెగ్గాలంటే కోహ్లీసేన శక్తులన్నీ కూడదీసుకుని అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సిందేనని ఆ మ్యాచ్‌ చాటిచెప్పింది. తొలి టెస్టు కోసం 12 మందితో కూడిన జట్టును ప్రకటించిన భారత్‌ ఐదుగురు బౌలర్ల కూర్పును పక్కన పెట్టింది. కేవలం నలుగురు ప్రధాన బౌలర్లతోనే బరిలోకి దిగనుంది. మహ్మద్‌ షమి, బుమ్రా, ఇషాంత్‌ శర్మ పేస్‌ భారాన్ని మోయనున్నారు. స్పిన్‌ బాధ్యత అశ్విన్‌ది. రోహిత్‌ శర్మ, హనుమ విహారిల్లో ఎవరు జట్టులో ఉంటారన్నది తేలాల్సివుంది. ఎన్నో అంచనాలున్నప్పటికీ ఆస్ట్రేలియాలో మంచి రికార్డు లేని నేపథ్యంలో మన పేసర్లు ఎలా రాణిస్తారన్నది ఆసక్తికరం. ఇక బ్యాటింగ్‌లో ఎప్పటిలాగే కోహ్లినే మూల స్తంభం. ఇంగ్లాండ్‌ పర్యటనలో పరుగుల వరద పారించిన కోహ్లికి సహకారం అందించడంలో విఫలమైన బ్యాట్స్‌మెన్‌ ఈసారి ఎలా రాణిస్తారన్నదే భారత్‌కు కీలకం. పుజారా, రాహుల్‌, విజయ్‌, రహానె నిలబడాలని జట్టు కోరుకుంటోంది. పృథ్వీ షా దూరం కావడం పెద్ద లోటే అయినా సన్నాహక మ్యాచ్‌తో విజయ్‌ ఫామ్‌ను అందుకోవడం శుభ సూచకం. రాహుల్‌తో కలిసి అతడు ఇన్నింగ్స్‌ ఆరంభిస్తాడు. మరోవైపు ఆస్ట్రేలియా కూడా నలుగురు బౌలర్లతో బరిలోకి దిగనుంది. స్టార్క్‌, కమిన్స్‌, హేజిల్‌వుడ్‌ భారత్‌పై పేస్‌తో దాడి చేయనున్నారు. ఏకైక స్నిన్నర్‌గా నాథన్‌ లైయన్‌ బరిలోకి దిగుతాడు. ఆరోన్‌ ఫించ్‌తో కలిసి అరంగేట్ర ఆటగాడు హారిస్‌ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ ఆరంభిస్తాడు.

గత మూడూ డేనైట్లే.. 
మ్యాచ్‌ వేదిక అడిలైడ్‌ మైదానంలో గత మూడు టెస్టులూ డే/నైట్‌ మ్యాచ్‌లే. పిచ్‌ పొడిగా ఉంది. స్పిన్నర్లు ప్రభావం చూపవచ్చు. వాతావరణం వేడిగా ఉంది.

తుది జ‌ట్టు 
ఆస్ట్రేలియా: ఫించ్‌, హారిస్‌, ఖవాజా, షాన్‌ మార్ష్‌, హ్యాండ్స్‌కాంబ్‌, ట్రావిస్‌ హెడ్‌, పైన్‌, స్టార్క్‌, కమిన్స్‌, లైయన్‌, హేజిల్‌వుడ్‌ 
భారత్‌: రాహుల్‌, విజయ్‌, పుజారా, కోహ్లి, రహానె, రోహిత్‌ /విహారి, రిషబ్‌ పంత్‌, అశ్విన్‌, షమి, ఇషాంత్‌, బుమ్రా

‘‘గతంలో రెండు జట్లూ హద్దులు దాటాయి. ఈసారి అలా జరుగుతుందని అనుకోను. ప్రత్యర్థి ఆటగాళ్లను ఒత్తిడిలోకి నెట్టడానికి హద్దులు దాటకుండానే మాటలతో ప్రభావం చూపించే ప్రయత్నం చేయొచ్చు. హానికరం కాని కవ్వింపులు ఉండొచ్చేమో’’
- విరాట్‌ కోహ్లి

కోహ్లి × స్టార్క్‌ 

టీమ్‌ఇండియా బ్యాటింగ్‌కు వెన్నెముక విరాట్‌ కోహ్లి. ఆస్ట్రేలియాకు ప్రధాన పేస్‌ అస్త్రం మిచెల్‌ స్టార్క్‌. ఈ ఇద్దరి మధ్య సమరం సిరీస్‌లో ఆసక్తి రేకెత్తిసోంది. పదునైన పేస్‌తో హడలెత్తించే స్టార్క్‌ ఇటీవల యూఏఈలో పాక్‌తో జరిగిన సిరీస్‌లో పెద్దగా రాణించలేదు. కానీ ఆస్ట్రేలియాలో అతడు అదనపు బౌన్స్‌తో బ్యాట్స్‌మెన్‌కు సమస్యలు సృష్టించగలడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌లపై అద్భుతంగా రాణించి జోరు మీదున్న కోహ్లి.. స్టార్క్‌కు చెక్‌ పెడతాడేమో చూడాలి.

ఖవాజా × బుమ్రా 

ఖవాజాకే కాదు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెనందరికీ భారత యువ ఫాస్ట్‌బౌలర్‌ బుమ్రాను ఎదుర్కోవడం పరీక్షే. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న ఖావాజాపైనే ఆసీస్‌ ఎక్కువగా ఆశలు పెట్టుకుంది కాబట్టి అతడికి, బుమ్రాకు మధ్య పోటీకి ప్రాధాన్యం ఏర్పడింది. దక్షిణాఫ్రికాతో అరంగేట్ర టెస్టు నుంచి సత్తా చాటుతున్న బుమ్రాపై భారత్‌ చాలా ఆశలే పెట్టుకుంది. పాకిస్థాన్‌పై రాణించి ఖవాజా ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. వేగం ప్రధాన బలమైన బుమ్రా.. అతడిని త్వరగా పెవిలియన్‌ చేరిస్తే భారత్‌ పని తేలికవుతుంది.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.