close

పరీక్ష వీరికే..!

వన్డే ప్రపంచకప్‌కు ఇంకెంతో సమయం లేదు. ఇంకో నాలుగున్నర నెలల్లో ఈ ప్రతిష్టాత్మక టోర్నీ మొదలైపోతుంది. మధ్యలో టీమ్‌ఇండియా ఆడబోయేది 13 వన్డేలే. ఈ మ్యాచ్‌లు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భారత జట్టు వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నట్లుగా ఇప్పటికే దాదాపుగా ప్రపంచకప్‌ బెర్తులు ఫుల్‌ అయిపోయాయి! ఈ మెగా టోర్నీకి ఎంపికయ్యే అవకాశమున్న ఆటగాళ్లే రాబోయే సిరీస్‌ల్లో బరిలోకి దిగబోతున్నారు. అన్ని బెర్తులూ భర్తీ అయినప్పటికీ.. ఎవరికీ గ్యారెంటీ లేదని, ఫామ్‌ బాగాలేకుంటే ఎవరిపైనైనా వేటు పడొచ్చన్న రోహిత్‌ వ్యాఖ్యల్ని తేలిగ్గా ఏమీ తీసుకోవడానికి లేదు.

ఈనాడు క్రీడావిభాగం

ప్రస్తుతం జట్టులో ఉన్న కొందరు ఆటగాళ్లు ప్రపంచకప్‌కు ఎంపిక కావాలన్నా.. తుది జట్టులో ఆడాలన్నా.. రాబోయే మ్యాచ్‌ల్లో ప్రదర్శన కీలకం. ఎవరి స్థానానికి గ్యారెంటీ లేదన్న రోహిత్‌ హెచ్చరిక జట్టులో కొందరికి వర్తించకపోవచ్చు. బ్యాటింగ్‌లో కెప్టెన్‌ కోహ్లి, ఓపెనర్లు రోహిత్‌, ధావన్‌ల సత్తా, ఫామ్‌ గురించి ఎవరికీ సందేహాల్లేవు! బౌలర్ల విషయంలోనూ భరోసా ఉంది. ఎటొచ్చీ మిడిలార్డర్‌ విషయంలోనే సందేహాలున్నాయి. అందులో వివిధ స్థానాలకు ఆటగాళ్లు ఎవరనే విషయంలో ఇప్పటికీ పూర్తి స్పష్టత లేదు. ప్రపంచకప్‌ జరగబోయేది ఇంగ్లాండ్‌లో కాబట్టి.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ సిరీస్‌ల్లో సత్తా చాటిన ఆటగాళ్లకు ప్రపంచకప్‌లో ప్రథమ ప్రాధాన్యం ఉంటుంది. చివరగా స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అంబటి రాయుడు నాలుగో స్థానంలో నిలకడగా రాణించాడు. చాన్నాళ్లుగా సందిగ్ధతలో ఉన్న 4వ స్థానానికి తనే సరైన వాడినని చాటుకున్నాడు రాయుడు. ఐతే స్వదేశంలో ప్రదర్శనను బట్టి అతడికే ఆ స్థానం ఖరారు చేసే పరిస్థితి లేదు. నిరుడు రాయుడు ఇంగ్లాండ్‌ పర్యటనకు ఎంపికైనప్పటికీ.. ఫిట్‌నెస్‌ సమస్యలతో తప్పుకున్నాడు. ఆ సిరీస్‌ ఆడి ఉంటే రాయుడి సత్తా పూర్తిగా తెలిసేది. ఇప్పుడతను ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల్లో సత్తా చాటి నాలుగో స్థానానికి తాను అర్హుడినని నిరూపించుకోవాలి. ఇక 5, 6, 7 స్థానాల విషయంలో అయితే మరింత సందిగ్ధత ఉంది. ఈ స్థానాల్లో ఆడుతున్న ఎవ్వరూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయట్లేదు. ముఖ్యంగా ధోనీ ఫామ్‌ ఆందోళన కలిగిస్తోంది. అతను వైఫల్యాల బాట వీడకుంటే.. ప్రపంచకప్‌కు ప్రత్యామ్నాయం ఆలోచించాల్సిన పరిస్థితి కూడా తలెత్తవచ్చు. యువ ఆటగాడు రిషబ్‌ పంత్‌ నుంచి ధోనికి ముప్పు పొంచి ఉంది. ఆటగాడిగా కంటే వ్యూహకర్తగా ధోనీని ఎక్కువగా కోరుకుంటోంది జట్టు. ఐతే బ్యాటింగ్‌లో ఓ మోస్తరుగా అయినా రాణించకుంటే కఠిన నిర్ణయాలు తప్పకపోవచ్చు. ధోని ఫామ్‌ అందుకుంటే మిడిలార్డర్‌లో ఎప్పట్లాగే ఒక స్థానం అతడి సొంతమవుతుంది. ఇక మరో స్థానం కోసం దినేశ్‌ కార్తీక్‌, కేదార్‌ జాదవ్‌, హార్దిక్‌ పాండ్యల మధ్య పోటీ ఉంది. దినేశ్‌ కార్తీక్‌కు నిలకడ లేమి సమస్య. ఒక మ్యాచ్‌లో అదరగొడతాడు. తర్వాత తేలిపోతుంటాడు. స్వతహాగా వికెట్‌ కీపర్‌ అయినప్పటికీ.. అతను నిలకడగా రాణిస్తే బ్యాట్స్‌మన్‌గానే జట్టులో కొనసాగవచ్చు. ఆల్‌రౌండర్లయిన హార్దిక్‌ పాండ్య, కేదార్‌ జాదవ్‌లను కాదని కార్తీక్‌కు అవకాశం ఇవ్వాలంటే అతను ఎలా ఆడాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక పేసర్‌ లేదా స్పిన్నర్‌ను తగ్గించుకుని.. బ్యాటుతో, బంతితో ఉపయోగపడే ఆటగాడిని ఎంచుకోవాలనుకున్నపుడు పాండ్య, జాదవ్‌లకు అవకాశం దక్కుతుంది. వీళ్లిద్దరూ రెండు రకాలుగా రాణించి తమ ప్రాధాన్యాన్ని చాటుకోవాలి. ఈ మధ్యే ఫామ్‌ అందుకున్న రవీంద్ర జడేజా సైతం వీరితో పోటీకి వస్తున్నాడు. ప్రపంచకప్‌ ముందు అందరికీ అవకాశాలివ్వాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది. రాబోయే 13 వన్డేల్లో వీలును బట్టి అందరినీ ఆడిస్తారు. ఎవరికి వాళ్లు అవకాశం వచ్చినపుడు సత్తా చాటుకోవాల్సి ఉంది. మరి చాన్నాళ్లుగా వేధిస్తున్న మిడిలార్డర్‌ సమస్యకు ఈ మ్యాచ్‌ల్లో పరిష్కారం దొరికి, ఆయా స్థానాలకు ఆటగాళ్లు ఖరారవుతారేమో చూడాలి.

13
ఇంగ్లాండ్‌లో ప్రపంచకప్‌ ఆరంభానికి ముందు టీమ్‌ ఇండియా ఆడనున్న వన్డేలు. ఆస్ట్రేలియాతో 8, న్యూజిలాండ్‌తో 5 మ్యాచ్‌లు ఆడనుంది.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.