close

నిలుస్తారా..? నిలబెడతారా..? 

ఫోర్త్‌ అంపైర్‌

ముందు ధావన్‌, రోహిత్‌ దంచేస్తారు. తర్వాత కోహ్లి అందుకుంటాడు. కొన్నేళ్ల నుంచి వన్డేల్లో టీమ్‌ఇండియా అదరగొడుతుండటానికి ఈ ముగ్గురే ప్రధానం. మిడిలార్డర్‌ సమస్య ఎప్పట్నుంచో వేధిస్తున్నప్పటికీ భారత జట్టు మెజారిటీ విజయాలతో దూసుకెళ్తుండటానికి తొలి ముగ్గురు బ్యాటింగ్‌ వీరులే కారణం. ఒక మ్యాచ్‌లో ధావన్‌ విఫలమైనా రోహిత్‌ అందుకునేవాడు. ఇంకో మ్యాచ్‌లో రోహిత్‌ తేలిపోయినా ధావన్‌ జోరు చూపించేవాడు. ఇక ఇద్దరూ సత్తా చాటితే భారత్‌కు ఆందోళనే లేకపోయేది. నిలకడైన బ్యాటింగ్‌తో ప్రపంచంలోనే అత్యుత్తమ వన్డే జోడీగా పేరు తెచ్చుకున్నారు రోహిత్‌, ధావన్‌. కానీ ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌ ముంగిటే టీమ్‌ఇండియాకు ఈ ఇద్దరి ఫామే తలనొప్పిగా మారడం ఆందోళనకరం. 

2018, 2019ల్లో జరిగిన ఏడు వన్డే సిరీస్‌ల్లో  ఐదు భారత్‌ సొంతమయ్యాయి. ఈ విజయాల్లో ఓపెనర్లు ధావన్‌, రోహిత్‌లది ముఖ్యభూమిక.కానీ ఐపీఎల్‌ ముంగిట ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో వీరి ప్రదర్శన సాధారణం. ఇక ఐపీఎల్‌ అనగానే ఎప్పుడూ చెలరేగి ఆడే రోహిత్‌, ధావన్‌ ఈ సీజన్లో ఆశించిన స్థాయిలో రాణించలేదు. రోహిత్‌ తన మార్కు ఇన్నింగ్స్‌ ఒక్కటీ ఆడలేదు. ధావన్‌ ఒకటీ అరా పెద్ద ఇన్నింగ్స్‌ ఆడాడు కానీ.. మునుపటి స్థాయిలో మాత్రం విధ్వంసం సృష్టించలేదు. ఈ ఐపీఎల్‌లో ధావన్‌ 16 మ్యాచ్‌ల్లో 34.73 సగటుతో 521 పరుగులు చేయగా.. రోహిత్‌ 15 మ్యాచ్‌ల్లో 28.92 సగటుతో 405 పరుగులు సాధించాడు. ధావన్‌ 5 అర్ధ సెంచరీలు చేయగా.. రోహిత్‌ రెండింటికే పరిమితమయ్యాడు.

న్డేల్లో టీమ్‌ఇండియా బలమంతా టాప్‌ఆర్డరే. కొన్నేళ్లుగా ఓపెనింగ్‌లో రోహిత్‌, ధావన్‌.. వన్‌డౌన్‌లో విరాట్‌ కోహ్లి నిలకడగా రాణించారు. ఈ ముగ్గురి మెరుపులతోనే టీమ్‌ఇండియా వరుస మ్యాచ్‌లు, సిరీస్‌ విజయాలతో హోరెత్తించింది. ఐతే ఐపీఎల్‌లో రోహిత్‌.. ధావన్‌ల ప్రదర్శన చూశాక అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఒకప్పుడు ముంబయి సాధించే విజయాల్లో చాలా వరకు రోహిత్‌ పాత్ర కీలకంగా ఉండేది. సన్‌రైజర్స్‌ తరఫున ఘనమైన రికార్డున్న ధావన్‌ సైతం దిల్లీ తరఫున ఆకట్టుకోలేకపోయాడు. పరుగులు ఓ మోస్తరుగానే చేశాడు కానీ.. ప్రభావవంతమైన ఇన్నింగ్స్‌ పెద్దగా ఆడలేదు. ఈ ఐపీఎల్‌లో రోహిత్‌; ధావన్‌ల బ్యాటింగ్‌ చూస్తే అంత ఆత్మవిశ్వాసంతో ఆడుతున్నట్లు కనిపించలేదు. ధీమాగా, ధాటిగా ఆడలేదు. ముందు నుంచి ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు ఓపెనర్లు పెద్ద బలం అని అందరూ అంటున్నారు. కానీ ఈ జోడీ ప్రస్తుత ఫామ్‌ చూస్తుంటే.. అంచనాలు తప్పేలా కనిపిస్తున్నాయి.
టీమ్‌ఇండియా మిడిలార్డర్‌ పరిస్థితేంటో చెప్పాల్సిన పని లేదు. నాలుగో స్థానంలో ఎవరు ఆడతారో తెలియని పరిస్థితి. రాయుడు ఫామ్‌ కోల్పోయి జట్టుకే దూరమయ్యాడు. అనుకోకుండా అవకాశం దక్కించుకున్న విజయ్‌ శంకర్‌పై పెద్ద ఆశలేమీ లేవు. ఐపీఎల్‌లో అతను ఘోరంగా విఫలమయ్యాడు. 15 మ్యాచ్‌ల్లో 20.33 సగటుతో 244 పరుగులు మాత్రమే చేశాడు. ధోని ఐపీఎల్‌లో సత్తా చాటినా అంతర్జాతీయ స్థాయిలో అతడి ప్రదర్శన కొంత కాలంగా ఏమీ బాగా లేదు. ఐపీఎల్‌లో గాయపడ్డ కేదార్‌ జాదవ్‌ అసలు జట్టులో ఉంటాడో లేదో తెలియదు. దినేశ్‌ కార్తీక్‌కు తుది జట్టులో చోటు గ్యారెంటీ కాదు. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య ఐపీఎల్‌ స్థాయిలో ప్రపంచకప్‌లోనూ మెరుపులు మెరిపించగలడేమో చూడాలి. అయినా ధోని తర్వాత, దిగువన వస్తాడు. మొత్తంగా టీమ్‌ఇండియా మిడిలార్డర్‌ బలహీనంగా ఉందన్నది వాస్తవం. దానిపై అంతగా ఆశలు లేని నేపథ్యంలో రోహిత్‌, ధావన్‌ మెరుపులు మెరిపించకపోతే ప్రపంచకప్‌లో భారత్‌ అవకాశాలు దెబ్బతినడం ఖాయం.
మంగళవారం రాత్రి ఇంగ్లాండ్‌, పాకిస్థాన్‌ మధ్య వన్డే మ్యాచ్‌ జరిగింది. అందులో మొదట పాకిస్థాన్‌ ఓపెనర్‌ ఇమాముల్‌ హక్‌ 151 పరుగులు చేశాడు. తర్వాత 359 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్‌ 44.5 ఓవర్లలోనే ఛేదించేసింది. ఓపెనర్లు బెయిర్‌స్టో (128), జేసన్‌ రాయ్‌ (76) మెరుపు ఇన్నింగ్స్‌లతో చెలరేగిపోయారు. నిజానికి కొన్ని నెలల ముందు వరకు రాయ్‌తో కలిసి హేల్స్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించేవాడు. డ్రగ్స్‌ వివాదం కారణంగా అతడిని జట్టు నుంచి తప్పించినా ఇంగ్లాండ్‌కు ఇబ్బంది లేకపోయింది. బెయిర్‌స్టో అందుకున్నాడు. వార్నర్‌ పునరాగమనంతో ఆస్ట్రేలియా కూడా ఓపెనింగ్‌ బలాన్ని పెంచుకుంది. మిగతా ప్రధాన జట్లకు ఓపెనింగ్‌ విషయంలో ఢోకా లేదు. రోహిత్‌, ధావన్‌ ఫామ్‌లో ఉంటే ఎవరికైనా దీటుగా నిలవగలరు కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో వీళ్లు జట్టు ఆశల్ని ఏమేరకు నిలబెడతారన్నది ప్రశ్నార్థకం.  వీరిలో ఎవరైనా టోర్నీ ఆరంభంలో విఫలమైతే రాహుల్‌ను ఆడించే అవకాశాలున్నాయి. అతడిని నాలుగో స్థానంలో ఆడించొచ్చు. లేదా ఓపెనర్‌గా పంపి, రోహిత్‌ను నాలుగులో ఆడించొచ్చు. మరి ప్రపంచకప్‌లో కోహ్లి, రవిశాస్త్రి ఏం చేస్తారో.. ఓపెనర్లు టీమ్‌ఇండియాకు ఎంత బలాన్నిస్తారో చూడాలి.
ప్రస్తుతం భారత్‌కు ఉపశమనం ఏంటంటే.. ప్రత్యామ్నాయ ఓపెనర్‌గా ప్రపంచకప్‌కు ఎంపికైన కేఎల్‌ రాహుల్‌ ఫామ్‌లో ఉండటం. టీవీ షో వివాదం తర్వాత రాహుల్‌..  ఐపీఎల్‌లో కసిగా బ్యాటింగ్‌ చేశాడు. 14 మ్యాచ్‌ల్లో  53.90 సగటుతో 593 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ.. 6 యాభైలున్నాయి.

నేను ఏమంటానంటే... 
అందుకే పంత్‌ బదులు కార్తీక్‌..

ధోని జట్టు ప్రధాన వికెట్‌కీపర్‌. అతను మ్యాచ్‌ ఆడని పరిస్థితి తలెత్తితేనే రెండో వికెట్‌కీపర్‌కు అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భంలో ఒత్తిడిలో ఎన్నో మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉన్న దినేశ్‌ కార్తీక్‌ ఉంటే మంచిది అనిపించింది. ఇది అందరి నిర్ణయం. వికెట్‌ కీపింగ్‌లో కార్తీక్‌ విలువైన ఆటగాడు. ఫినిషర్‌గా అతడు ఎన్నోసార్లు నిరూపించుకున్నాడు కూడా. మెగా టోర్నీ కావడంతో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని కార్తీక్‌ను తీసుకున్నాం.

- కోహ్లి

టీమ్‌ఇండియాలో ఒక పేసర్‌ లేని లోటు కనిపిస్తోంది. బుమ్రా, షమి, భువనేశ్వర్‌లకు తోడుగా మరో నాణ్యమైన పేసర్‌ ఉండాల్సింది. హార్దిక్‌, విజయ్‌ శంకర్‌ రూపంలో ఇద్దరు మీడియం పేస్‌ ఆల్‌రౌండర్లు ఉన్నారుగా అన్న వాదనతో ఏకీభవించను. సరైన మేళవింపు జట్టుకు ఎంతో ముఖ్యం.

- గౌతమ్‌ గంభీర్‌

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.