close

జ్యోతి సురేఖ కొత్త చరిత్ర

 రెండు కాంస్యాలు సొంతం
 ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌

డెన్‌ బాష్‌ (నెదర్లాండ్స్‌): ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో తెలుగు ఆర్చర్‌ వెన్నం జ్యోతి సురేఖ చరిత్ర సృష్టించింది. మహిళల వ్యక్తిగత కాంపౌండ్‌ విభాగంలో కాంస్యం గెలిచిన భారత తొలి మహిళగా నిలిచిన ఆమె టీమ్‌ విభాగంలోనూ కంచు పతకం సాధించింది.  వ్యక్తిగత విభాగంలో మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో సురేఖ 10-9 (షూటాఫ్‌) తేడాతో ప్రపంచ రెండో ర్యాంకు ఆర్చర్‌ బోస్టన్‌ (టర్కీ)పై విజయం సాధించింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో వ్యక్తిగత పతకం సొంతం చేసుకోవడం సురేఖకు ఇదే తొలిసారి. మరోవైపు భారత మహిళల కాంపౌండ్‌ జట్టు కాంస్య పతకం గెలవడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. సురేఖ, ముస్కాన్‌ కిరార్‌, రాజ్‌కౌర్‌లతో కూడిన భారత జట్టు శనివారం మ్యాచ్‌లో 229-226 తేడాతో టర్కీపై నెగ్గి మూడో స్థానంలో నిలిచింది. ఎనిమిది అవకాశాల్లో ఆరుసార్లు పది పాయింట్లు సాధించిన సురేఖ జట్టుకు విజయాన్ని అందించింది. ‘‘గత ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ (2017)లో రజతం గెలిచాం. ఈ సారి కాంస్యం సొంతం చేసుకున్నందుకు ఎలాంటి బాధ లేదు. ఈ సారి కూడా పోడియంపై నిల్చున్నందుకు ఆనందంగా ఉంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పతకం గెలవడం అంటే మామూలు విషయం కాదు’’ అని 22 ఏళ్ల విజయవాడ అమ్మాయి సురేఖ తెలిపింది. పురుషుల రికర్వ్‌ జట్టు స్వర్ణ పతకం కోసం ఆదివారం జరిగే పోరులో చైనాతో పోటీపడనుంది.

‘‘ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో ఇదే నా తొలి వ్యక్తిగత పతకం. మ్యాచ్‌లో కొద్దిగా ఒత్తిడికి లోనయ్యా. కానీ పూర్తిస్థాయి ఆటతీరు ప్రదర్శిస్తాననే నమ్మకంతో ఉన్నా. ప్రత్యర్థి క్రీడాకారిణి కూడా గొప్పగా ఆడింది’’ 

- సురేఖ

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.