close
కూల్చేశారు..

ఒక్క రోజే 16 వికెట్లు
విజృంభించిన ఉమేశ్‌, షమి
మూడో టెస్టులో దక్షిణాఫ్రికా ఓటమి లాంఛనమే
తొలి ఇన్నింగ్స్‌లో 162; రెండో ఇన్నింగ్స్‌లో 132/8

గిర్రున తిరిగే పిచ్‌లు.. బంతిని గింగిరాలు తిప్పే స్పిన్నర్లు! భారత పర్యటన అనగానే  దక్షిణాఫ్రికా ఈ ముప్పునే ఊహించి, అన్ని రకాల విశ్లేషణలు చేసి టెస్టు సమరానికి మానసికంగా సిద్ధమైపోయి ఉంటుంది. కానీ అంచనాలు  తప్పి బోల్తా కొట్టింది. తమ అంచనా సగమే సరైందని, భారత్‌లో పదునైన పేస్‌ అస్త్రాల నుంచీ భారీ ప్రమాదం పొంచి ఉందని  గ్రహించే లోపే సిరీస్‌ను సమర్పించుకుంది. సిరీస్‌ మధ్యలో మన పేస్‌ దమ్ము అర్థమైనా.. దాన్ని తట్టుకునేందుకు రచించిన ప్రణాళికలేవీ  ఫలించక ఇప్పుడు వైట్‌వాష్‌ ముంగిట నిలిచింది. తమది ఇంకెంత మాత్రం స్పిన్నర్లపైనే ఆధారపడే జట్టు కాదని నిరూపిస్తూ.. సఫారీలను  వణికించిన టీమ్‌ ఇండియా 3-0తో సిరీస్‌ను చేజిక్కించుకోవడం లాంఛనమే.

పదునైన పేస్‌ దళంతో ఎన్నో ఏళ్లుగా ప్రత్యర్థులను హడలెత్తిస్తూ వస్తున్న దక్షిణాఫ్రికా.. భారత్‌లో భారత పేసర్లు తమను ఇలా బెంబేలెత్తిస్తారని కలలోనైనా ఊహించి ఉండదు. షమి-ఉమేశ్‌ పేస్‌కు, షార్ట్‌ బంతులకు, కచ్చితత్వానికి కుదేలైన ఆ జట్టు మూడో టెస్టులో తేలిపోయింది. భారత పేసర్లకు తోడు స్పిన్నర్లూ విజృంభించిన వేళ.. ఒక్క రోజే 16 వికెట్లు చేజార్చుకున్న దక్షిణాఫ్రికా పరాజయం అంచున నిలిచింది. ఆటను అతి కష్టంగా నాలుగో రోజుకు తీసుకెళ్లింది. కోహ్లీసేన విజయానికి  కావాల్సింది కేవలం రెండు వికెట్లే.

రాంచి

మూడో టెస్టులో విజయానికి భారత్‌ కొన్ని బంతుల దూరంలో ఉంది. కాకపోతే లాంఛనాన్ని ముగించడానికి ఓ రాత్రి ఆగాల్సి వచ్చింది. పేసర్లు నిప్పులు చెరగడంతో మూడో రోజు ఒక్క రోజే 16 వికెట్లు పడగొట్టి.. మ్యాచ్‌ను టీమ్‌ఇండియా తన చేతుల్లోకి తెచ్చుకుంది. స్పిన్నర్లూ వికెట్ల వేటలో విజయవంతమైనా.. బుల్లెట్‌ స్పీడ్‌తో సఫారీల వెన్ను విరిచింది పేసర్లే. షమి, ఉమేశ్‌లు చెరో అయిదు వికెట్లతో ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకే కుప్పకూలిన దక్షిణాఫ్రికా.. ఫాలోఆన్‌ ఆడుతూ సోమవారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 132 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. డిబ్రుయిన్‌ (30), నోర్జె (5) క్రీజులో ఉన్నారు. ఒకే రోజు ఏడుగురు  దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ రెండేసి సార్లు ఔటయ్యారు. భారత్‌ 497/9 వద్ద మొదటి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసిన సంగతి తెలిసిందే.

వణికించిన ఉమేశ్‌
భారత పేసర్లకు ధాటికి మూడో రోజే ఓటమి ఖరారవుతుందని దక్షిణాఫ్రికా ఊహించి ఉండదు. ఓవర్‌నైట్‌స్కోరు 9/2తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆ జట్టు ఉమేశ్‌, షమి (2/22) ధాటికి తల్లడిల్లిపోయింది. డుప్లెసిస్‌ను బౌల్డ్‌ చేయడం ద్వారా ఉమేశ్‌ సోమవారం  దక్షిణాఫ్రికా పతనాన్ని ఆరంభించాడు. ఉమేశ్‌ (3/40) వేసిన కళ్లు చెదిరే లేట్‌ ఔట్‌ స్వింగర్‌ను ఏమాత్రం ఆడే అవకాశం లేకపోయింది. సర్రున దూసుకొచ్చిన బంతిని వికెట్లు కూల్చేయడంతో డుప్లెసిస్‌ తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. చక్కగా బ్యాటింగ్‌ చేసిన హంజా (62; 79 బంతుల్లో 10×4, 1×6).. బవుమా (32)తో కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. దక్షిణాఫ్రికా 107/3తో కోలుకుంటున్నట్లనిపించిన దశలో స్పిన్నర్లు దెబ్బతీయడంతో పతనం వేగంగా సాగింది. హంజాను బౌల్డ్‌ చేయడం ద్వారా 91 పరుగుల నాలుగో వికెట్‌ భాగస్వామ్యాన్ని జడేజా విడదీస్తే.. అరంగేట్ర స్పిన్నర్‌ నదీమ్‌ బవుమా ఇన్నింగ్స్‌కు తెరదించాడు. నదీమ్‌కు ఇదే తొలి అంతర్జాతీయ వికెట్‌. కాసేపటికే క్లాసెన్‌ (6)ను జడేజా బౌల్డ్‌ చేయడంతో దక్షిణాఫ్రికా 119/6కు పడిపోయింది. ఆ తర్వాత ఇన్నింగ్స్‌ ముగియడం లాంఛనమే. కాకపోతే లిండె (37) కాస్త నిలవడంతో స్కోరు 150 దాటింది. ఉమేశ్‌ బౌలింగ్‌లో బౌల్డై అతడు తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగాడు. అంతకుముందు రబాడ రనౌటయ్యాడు. అతడికన్నా ముందు పీట్‌ను షమి (2/22) వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. నోర్జెను ఎల్బీగా వెనక్కి పంపడం ద్వారా దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌కు నదీమ్‌ తెరదించాడు.

హడలెత్తించిన షమి
పూర్తిగా డీలాపడ్డ దక్షిణాఫ్రికాను ఫాలో ఆన్‌ ఆడించడానికి ఏమాత్రం సందేహించలేదు కోహ్లి. 335 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను మొదలెట్టిన ఆ జట్టును భారత పేసర్లు మరింత హడలెత్తించారు. 36 పరుగులకే సగం జట్టును ఖాళీ చేసి విజయానికి బాట వేశారు. దక్షిణాఫ్రికా పతనాన్ని ఆరంభించింది ఉమేశే. ఓ కళ్లు చెదిరే డెలివరీతో అతడు ఓపెనర్‌ డికాక్‌ (5)ను బౌల్డ్‌ చేశాడు. ఆ తర్వాత షమి (3/10) విజృంభించాడు. మొదట ఫుల్‌ లెంగ్త్‌ డెలివరీతో హంజా (0)ను బౌల్డ్‌ చేసిన అతడు.. ఆ తర్వాత డుప్లెసిస్‌ (4)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. డుప్లెసిస్‌ సమీక్ష కోరినా ఫలితం లేకపోయింది. షమి (3/10) తన తర్వాతి ఓవర్లోనే బవుమా (0)ను ఖాతాలో వేసుకున్నాడు. షమి లెంగ్త్‌ బంతిని ఆడబోయిన బవుమా.. ఎడ్జ్‌తో వికెట్‌కీపర్‌ సాహాకు చిక్కాడు. అసలే 22కే 4 వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికాకు.. ఎల్గర్‌ రిటైర్డ్‌ హర్ట్‌ కావడం మరో షాక్‌. 145 కిలోమీటర్ల వేగంతో వచ్చిన ఉమేశ్‌ (2/35) బౌన్సర్‌ హెల్మెట్‌ను బలంగా తాకడంతో అతడు  మైదానాన్ని వీడాడు. షమి కూడా షార్ట్‌ బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించాడు. టీ తర్వాత లెంగ్త్‌ డెలివరీతో క్లాసెన్‌ (5)ను ఉమేశ్‌ ఎల్బీగా వెనక్కి పంపాడు. అప్పుడు స్కోరు 36/5. అయితే టెయిలెండర్లు కాస్త పోరాడడంతో ఆటను దక్షిణాఫ్రికా నాలుగో రోజుకు తీసుకెళ్లగలిగింది. 27 పరుగులు చేసిన లిండె రనౌట్‌ కాగా.. పీట్‌ (23)ను జడేజా బౌల్డ్‌ చేశాడు. రబాడ (12)ను అశ్విన్‌ ఔట్‌ చేశాడు. ఎల్గర్‌కు కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన డిబ్రుయిన్‌ భారత బౌలర్లను ప్రతిఘటించాడు. నోర్జెతో కలిసి అతడు మంగళవారం ఎంతసేపు ఇన్నింగ్స్‌ను నడిపిస్తాడో చూడాలి.

సాహాకు గాయం.. పంత్‌ కీపింగ్‌ 

భుజం గాయంతో 20 నెలలు భారత జట్టుకు దూరమై ఇటీవలే పునరాగమనం చేసిన వికెట్‌కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా మళ్లీ గాయపడ్డాడు. దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు మూడో రోజు ఆటలో సాహాకు గాయమైంది. సఫారీ జట్టు రెండో ఇన్నింగ్స్‌ 27వ ఓవర్లో అశ్విన్‌ బౌలింగ్‌లో బంతిని అందుకునే క్రమంలో సాహా ఎడమ చేతి బొటను వేలికి దెబ్బ తగిలింది. దీంతో అతను డ్రెస్సింగ్‌ రూమ్‌కి వెళ్లిపోగా.. చివరి గంట రిషబ్‌ పంత్‌ కీపింగ్‌ చేశాడు. కీపింగ్‌ సబ్‌స్టిట్యూట్‌ నిబంధన వచ్చాక భారత్‌ తరఫున ఇలా బరిలో దిగిన రెండో వికెట్‌ కీపర్‌ పంత్‌. అంతకుముందు 2018లో దక్షిణాఫ్రికాతో జొహానెస్‌బర్గ్‌లో జరిగిన టెస్టులో పార్థివ్‌ పటేల్‌ స్థానంలో దినేశ్‌ కార్తీక్‌ సబ్‌స్టిట్యూట్‌గా దిగాడు.

ఎల్గర్‌కు కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌: దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో తలకు బంతి తగలడంతో ఆ జట్టు ఓపెనర్‌ డీన్‌ ఎల్గర్‌ పెవిలియన్‌ చేరాడు. టీ విరామానికి కొద్దిసేపటి ముందు ఉమేశ్‌ యాదవ్‌ వేసిన షార్ట్‌ పిచ్‌ బంతి ఎల్గర్‌ హెల్మెట్‌కు బలంగా తగిలింది. దీంతో కాసేపు అలాగే కూర్చుండిపోయిన ఎల్గర్‌.. ఆ తర్వాత పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. టీ తర్వాత ఎల్గర్‌ బ్యాటింగ్‌ చేసే అవకాశాలు లేకపోవడంతో అతని స్థానంలో డిబ్రుయిన్‌ కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా బరిలో దిగాడు. ‘‘తల అదరడం వల్ల ఎల్గర్‌కు ఎదురయ్యే సమస్యలు తొలగేవరకు వైద్యం కొనసాగుతుంది. అతను మైదానంలోకి రావడానికి ఆరు రోజులు పడుతుంది’’ అని క్రికెట్‌ దక్షిణాఫ్రికా తెలిపింది. 

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 497/9 డిక్లేర్డ్‌

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌: ఎల్గర్‌ (సి) సాహా (బి) షమి 0; డికాక్‌ (సి) సాహా (బి) ఉమేశ్‌ 4; హంజా (బి) జడేజా 62; డుప్లెసిస్‌ (బి) ఉమేశ్‌ 1; బవుమా (స్టంప్డ్‌) నదీమ్‌ 32; క్లాసెన్‌ (బి) జడేజా 6; లిండె (సి) రోహిత్‌ (బి) ఉమేశ్‌ 37; పీట్‌ ఎల్బీ (బి) షమి 4; రబాడ రనౌట్‌ 0; నోర్జె ఎల్బీ (బి) నదీమ్‌ 4; ఎంగిడి నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 12 మొత్తం: (56.2 ఓవర్లలో ఆలౌట్‌) 162;
వికెట్ల పతనం: 1-4, 2-8, 3-16, 4-107, 5-107, 6-119, 7-129, 8-130, 9-162;
బౌలింగ్‌: షమి 10-4-22-2; ఉమేశ్‌ యాదవ్‌ 9-1-40-3; నదీమ్‌ 11.2-4-22-2; జడేజా 14-3-19-2; అశ్విన్‌ 12-1-48-0.

దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌: డికాక్‌ (బి) ఉమేశ్‌ 5; ఎల్గర్‌ రిటైర్డ్‌ హర్ట్‌ 16; హంజా (బి) షమి 0; డుప్లెసిస్‌ ఎల్బీ (బి) షమి 4; బవుమా (స్టంప్డ్‌) సాహా (బి) షమి 0; క్లాసెన్‌ ఎల్బీ (బి) ఉమేశ్‌ 5; లిండె రనౌట్‌ 27; పీట్‌ (బి) జడేజా 23; డిబ్రుయిన్‌ నాటౌట్‌ 30; రబాడ (సి) జడేజా (బి) అశ్విన్‌ 12; నోర్జె నాటౌట్‌ 5; ఎక్స్‌ట్రాలు 5 మొత్తం: (46 ఓవర్లలో 8 వికెట్లకు) 132;
వికెట్ల పతనం: 1-5, 2-10, 3-18, 4-22, 5-36, 6-67,  7-98, 8-121;
బౌలింగ్‌: షమి 9-5-10-3; ఉమేశ్‌ యాదవ్‌ 9-1-35-2; జడేజా 13-5-36-1; నదీమ్‌ 5-0-18-0; అశ్విన్‌ 10-3-28-1.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.